కర్నాటక సీఎం మార్పు దిశగా సాగుతున్న కాంగ్రెస్: సిద్దరామయ్య ఎగ్జిట్? డీకే శివకుమార్ ఎంట్రీ?


కర్నాటక సీఎం మార్పు దిశగా సాగుతున్న కాంగ్రెస్: సిద్దరామయ్య ఎగ్జిట్? డీకే శివకుమార్ ఎంట్రీ?
కర్నాటకకు త్వరంలో కొత్త ముఖ్యమంత్రి? సిద్దరామయ్య సీఎం కుర్చీ దిగడం ఖాయమేనా? డిసెంబర్ 1లోపు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
కర్నాటకలో ముఖ్యమంత్రి పీఠంపై హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య వైదొలగడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. జాతీయ మీడియా కూడా కర్నాటకం మీదే ఫోకస్ పెట్టింది. ఏ క్షణమైనా సిద్దరామయ్య సీఎం కుర్చీ దిగడం.. ఆ కుర్చీలో డీకే శివకుమార్ కూర్చోవడం ఖాయమంటూ వార్తలొస్తున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ సందేశం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. తనతో మాట్లాడేందుకు గడిచిన వారం రోజులుగా ప్రయత్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ నుంచి చల్లని కబురొచ్చింది. ప్లీజ్ వెయిట్.. నేను మీకు కాల్ చేస్తానంటూ రాహుల్ నెంబర్ నుంచి డీకే మొబైల్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్నాటక రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చన్న ఊహాగానాల మధ్య.. డీకేకు రాహుల్ నుంచి ఈ మెసేజ్ రావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 29న ఢిల్లీ వెళ్లేందుకు డీకే సన్నద్ధమవుతున్నారు. సోనియా గాంధీని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరిన డీకే.. అదే రోజు బెంగళూరుకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఢిల్లీకి వచ్చిన కర్నాటక కాంగ్రెస్ నాయకులు ప్రియాంక్ ఖర్గే, బచ్చేగౌడతో రాహుల్.. భేటీ అయినట్లు సమాచారం. ఓట్ చోరీ, సర్ ప్రక్రియ, కర్నటకలో రాజకీయ పరిస్థితుల గురించి వారితో రాహుల్ చర్చించినట్లు తెలిసింది. కర్నాటక టెక్ సదస్సులో రాహుల్ ఆవిష్కరించాల్సిన కేఈవో ఏఐ పీసీ పరికరం గురించి కూడా వారి మధ్య చర్చకొచ్చిందట.
కర్నాటకలో అధికార మార్పిడి, రాష్ట్ర కేబినెట్‌లో మార్పుల గురించి ప్రియాంక్ ఖర్గేతో రాహుల్ సవివరంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అధికార పంపకం ఒప్పందం ఏదీ లేదని బహిరంగంగా ఖండించడంతోపాటు పూర్తిగా ఐదేళ్ల పదవీకాలం తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారట. అధికార పంపకం ఒప్పందాన్ని బహిరంగంగా తిరస్కరించాల్సిన అవసరం లేదన్నారట. త్వరలోనే వారిద్దరితో తాను మాట్లాడుతానని ప్రియాంక్ ఖర్గేకు రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న తాజా పరిణామాలు సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బగా చెబుతున్నారు. రాహుల్ జోక్యంతో పరిస్థితులన్నీ డీకే శివకుమార్‌కు అనుకూలంగా మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కర్నాటకలో ఎన్నికల అనంతరం నేతల మధ్య అంతర్గతంగా జరిగిందని చెబుతన్న ఒప్పందం మేరకు రెండున్నరేళ్ల అనంతరం సీఎంగా డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 20 నాటికి కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచింది. 2023 మే 10న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలవడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 135 స్థానాలు, బీజేపీకి 66 స్థానాలు, జేడీఎస్‌కు 19 స్థానాలు ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. మొత్తం అసెంబ్లీలో 224 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పట్లోనే సీఎంగా సిద్ధరామయ్య లేక డీకే శివకుమార్ అన్న వివాదాం పదిరోజులు నడిచింది. ఎన్నికల ముందు నుంచే డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కర్నాటకలో సాంప్రదాయం ప్రకారం కేపీసీసీ అధ్యక్షుడు సీఎం కావడం ముందు నుంచీ వస్తున్నఆనవాయితీ. ఎన్నికల ముందు జరిగిన రాహుల్ గాంధీ పర్యటన, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీకే.. అంతా తానై వ్యవహరించారు. ఎన్నికల అనంతరం సీఎం సీటు తనకే కావాలని అప్పట్లో ఆయన గట్టిగానే పట్టుపట్టారు. పార్టీలో సీనియర్ నేత, అప్పటి వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్య సీఎం సీటు కోసం పోటీ పడ్డారు. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు మాస్ లీడర్‌గా.. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన సిద్ధూవైపే అధిష్టానం మొగ్గుచూపింది. చివరికి ఆయననే సీఎంగా ఎంపిక చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే డీకేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు. అయితే రెండున్నరేళ్ల ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవాలని... డీకేకు పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ నుంచి సానుకూల మెస్సేజ్ రావడంతోడీకే సీఎం కావడానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ సీఎం అయితే డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ అధ్యక్షుడిగా సతీష్ జార్జిహోళికి ఇవ్వనున్నట్లు సమాచారం.
డిసెంబర్‌లో పార్లమెంట్ శీతకాల సమావేశాలతోపాటు కర్నాటక అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఆ లోపే సీఎం మార్పు వివాదాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సుర్జిత్ సింగ్ సుర్జేవాల, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వంటి నేతలు పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారట. ఈ క్రమంలో డీకే కల నెరవేరనుందా..? లేదంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేలా సిద్ధరామయ్య చక్రం తిప్పనున్నారా..? అన్నది తీవ్ర ఆసక్తికరంగా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



