
Thalapathy Vijay
Thalapathy Vijay : కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు నటుడు విజయ్‌కు 15 రోజుల గడువు లభించింది. ఇదే కేసులో ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా నోటీసులు అందాయి.
Thalapathy Vijay : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కజగం అధినేత, నటుడు విజయ్ విచారణాంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజయ్‌కు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా విచారణకు హాజరయ్యేందుకు ఆయన మరికొంత సమయం కోరారు. మార్చి 10న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు విజయ్ను ఆదేశించారు. దీనిపై స్పందించిన విజయ్, తన లీగల్ టీమ్ ద్వారా సీబీఐకి రెండు కీలక విన్నపాలు చేశారు. ఎన్నికల పనులు మరియు వ్యక్తిగత కారణాల దృష్ట్యా విచారణ నుంచి 15 రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని, అలాగే విచారణను ఢిల్లీలో కాకుండా చెన్నై లేదా తమిళనాడులోని ఏదైనా ప్రాంతంలో నిర్వహించాలని కోరారు. విజయ్ విన్నపాన్ని పరిశీలించిన సీబీఐ, 15 రోజుల గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. త్వరలోనే ఆయనకు కొత్త తేదీలతో కూడిన నోటీసులు అందనున్నాయి. అయితే, విచారణ వేదిక మార్పుపై అధికారులు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
మొండికేస్తున్న ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ
ఇదే కేసులో కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా సీబీఐ నోటీసులు పంపింది. అయితే, ఆయన ఈ నోటీసులను స్వీకరించడానికి నిరాకరించినట్లు సమాచారం. ఇంటికి వెళ్ళిన అధికారులకు ఆయన సిబ్బంది నోటీసు తీసుకోలేదని, కనీసం ఈమెయిల్ ద్వారా పంపిన సమాచారానికి కూడా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సెంథిల్ బాలాజీకి కూడా త్వరలోనే మరో దఫా నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అసలేం జరిగిందంటే?
2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో, కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సభ నిర్వహణలో లోపాలు, జనం రద్దీని నియంత్రించడంలో విఫలమవడం వంటి అంశాలపై విజయ్ను ఇప్పటికే జనవరిలో రెండుసార్లు సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు సేకరించిన కొత్త ఆధారాల ఆధారంగా మూడవ విడత విచారణకు రంగం సిద్ధం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




