Konark Sun Temple: 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ గర్భగుడి..!

Konark Sun Temple: 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ గర్భగుడి..!
Konark Sun Temple: ప్రపంచ ప్రసిద్ధ యునెస్కో వారసత్వ కట్టడం, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో ఒక సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది.
Konark Sun Temple: ప్రపంచ ప్రసిద్ధ యునెస్కో వారసత్వ కట్టడం, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో ఒక సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. సుమారు 122 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఆలయ గర్భగుడి (జగమోహన హాల్) తలుపులు త్వరలో తెరుచుకోనున్నాయి. భారత పురావస్తు శాఖ (ASI) ఆలయ గర్భగుడిలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను శాస్త్రీయ పద్ధతిలో తొలగించే బృహత్తర ప్రక్రియను ప్రారంభించింది.
బ్రిటిషు కాలంలో ఎందుకు మూసేశారు?
13వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుత కట్టడం 1900 కాలంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ వెనుక గోడలు బలహీనపడి పగుళ్లు రావడంతో, ప్రధాన నిర్మాణం కూలిపోకుండా ఉండేందుకు 1903-04లో అప్పటి బ్రిటిష్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. లోపలి భాగాన్ని పటిష్టం చేసేందుకు జగమోహన హాల్ మొత్తాన్ని ఇసుకతో నింపి, పూర్తిగా సీల్ చేసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గర్భగుడిలోకి ఎవరికీ ప్రవేశం లేదు.
ఐఐటీ మద్రాస్ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికత:
ఈ క్లిష్టమైన ప్రక్రియ కోసం ఏఎస్ఐ, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల బృందం రంగంలోకి దిగింది. నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు జీరో-వైబ్రేషన్ డైమండ్ డ్రిల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
నిర్మాణంపై ఒత్తిడిని గమనించేందుకు 40 హై-ప్రెసిషన్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఇసుకను తీయకుండా, దశలవారీగా తొలగిస్తూ లోపలి రాళ్లకు తగిన సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మరో మూడు నెలల్లో పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో వెయ్యేళ్ల ఆయుష్షు:
తాజ్మహల్ తర్వాత భారత్లో అత్యధిక పర్యాటకులు (ఏటా 35 లక్షల మంది) సందర్శించే కట్టడం కోణార్క్. ఈ ఆపరేషన్ విజయవంతమైతే, శతాబ్దం తర్వాత తొలిసారిగా భక్తులు గర్భగుడిని దర్శించుకునే వీలు కలుగుతుంది. "ఆలయానికి మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్షును అందించడమే మా లక్ష్యం" అని ఏఎస్ఐ అధికారులు వెల్లడించారు. ఈ వార్తతో భక్తులు మరియు పర్యాటక రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



