TOP 6 NEWS @ 6PM: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti Srinivas Reddy statement on double bedroom houses to all eligible beneficiaries
x

TOP 6 NEWS @ 6PM: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి 

Highlights

1) ఇండియాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే... మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రిసెర్చ్ స్కాలర్స్ సమిట్ 2025 ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య...

1) ఇండియాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే...

మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రిసెర్చ్ స్కాలర్స్ సమిట్ 2025 ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి స్టూడెంట్స్ ప్రారంభించిన స్టార్టప్స్ 80 శాతం సక్సెస్ అవుతున్నాయని అన్నారు. 1991 లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాల్లో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించారు.

అప్పట్లో సంస్కరణలు తీసుకురావడం అనేది ఒక ఆప్షన్ కాకుండా అది ఒక తప్పనిసరి అవసరం ఏర్పడిందని అన్నారు. ఆ సంస్కరణలే ఆయా దేశాలను ఆర్థికంగా అభివృద్ధి బాటలో వెళ్లేలా చేశాయన్నారు. ఇండియా కూడా ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరువాతే అభివృద్ధిలోకి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ ఐఐటి కాలేజీల స్థాపించడం కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా వచ్చిందేనని చెబుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

1990 లలో కమ్యునికేషన్ సెక్టార్‌లో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ సంస్థలదే హవా నడిచేది. కానీ ఆర్థిక సంస్కరణల తరువాత ఈ రంగంలోకి ప్రైవేటు కంపెనీలు రావడం ఒక గేమ్ చేంజర్ గా నిలిచిందన్నారు. దాంతో కమ్యునికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు.

భారత్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ గత కొన్నేళ్లలో భారత్ ఆర్థికంగా 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుందన్నారు. భారత్‌కు ఉన్న గొప్ప అవకాశం దేశ జనాభానే అని అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు జనాభాలేమి సమస్యను ఎదుర్కుంటున్నాయి. కానీ భారత్ వద్ద జనాభాకు, మానవ వనరులకు కొదువ లేదన్నారు. ఆ విషయంలో రాబోయే ఇంకో 40 ఏళ్ల వరకు భారత్ కు సమస్యే లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

2) వల్లభనేని వంశీకి మరోసారి తప్పని నిరాశ... అప్పటివరకు జైల్లోనే

గన్నవరం టీడీపీ ఆఫీసులో డీటీపీ ఆపరేటర్ సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ ఇస్తే ఈ కేసులో బాధితుడిగా ఉన్న సత్యవర్థన్ కు ఆయన నుండి ప్రాణహాని తప్పదని సత్యవర్ధన్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా వంశీ నుండి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా రాబట్టాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.

3) డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి

ఇంటి స్థలం ఉండి అందులో ఇల్లు నిర్మించాలనుకుంటున్న వారికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే,, ఇంటి స్థలం లేని వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టంచేశారు.

ఒకవేళ ఆ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో, లబ్ధిదారులే ఆ పని పూర్తి చేసుకునేలా వారికే ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని కేటాంయిపుల కోసం వేచిచూస్తున్న ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉంది.

4) ఇకపై టూవీలర్‌తో పాటు 2 హెల్మెట్స్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన నిర్ణయం

Nitin Gadkari about two helmets mandatory rule: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి టూవీలర్స్ ఉపయోగించే వారి భద్రత కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే వారికి ఆ వాహనంతో పాటు కచ్చితంగా ఐఎస్ఐ ముద్ర ఉన్న 2 హెల్మెట్స్ అమ్మాల్సిందేనని ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆటోఎక్స్‌పోలో గడ్కరి ఈ ప్రకటన చేశారు.

ఇప్పటికే ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ( Helmet mandatory for Pillion rider ) ఉంది. ఆ నిబంధన పాటించని వారికి ట్రాఫిక్ పోలీసులు ఛలాన్లు కూడా విధిస్తున్నారు. అయితే, టూవీలర్ కొనే సందర్భంలో మాత్రం రెండు హెల్మెట్స్ తప్పనిసరిగా విక్రయించాల్సిందే అనే నిబంధన లేదు. ప్రస్తుతం టూవీలర్ కొనేటప్పుడు రైడర్ సేఫ్టీ కోసం ఒక హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన అమలవుతోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) IPL 2025: 17ఏళ్లుగా ఈ స్టేడియంలో ఆర్సీబీ గెలిచిందే లేదు.. మరీ ఈ సారైనా గెలుస్తారా?

IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోని ఇతర జట్ల కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. కానీ టైటిల్ విషయానికి వస్తే మాత్రం అన్నింటికంటే వెనుకబడి ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. అయితే, ఈసారి సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. కానీ, రెండో మ్యాచ్‌లో పెద్ద పరీక్ష ఎదుర్కోనుంది. ఎందుకంటే, ఆర్సీబీ తన రెండో మ్యాచ్‌ను 17 ఏళ్లుగా ఓడిపోతూ వస్తున్న జట్టుతో ఆడనుంది.

ఐపీఎల్ 2025లో 8వ మ్యాచ్ ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తలపడనున్నాయి. దీనిని ఎంఏ చిదంబరం స్టేడియం అని కూడా అంటారు. ఈ మైదానంలో ఆర్సీబీ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఆర్సీబీ చెపాక్ గ్రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చివరిసారిగా 2008లో ఓడించింది. ఇది లీగ్‌లోని మొదటి సీజన్ కూడా. ఆ తర్వాత ప్రతిసారీ చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానంలో ఆర్సీబీని ఓడించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) మయన్మార్, థాయ్‌లాండ్‌లను వణికించిన భారీ భూకంపం.. స్పందించిన మోదీ

మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు శుక్రవారం భూకంపంతో చిరుగుటాకులు వణికిపోయాయి. మయన్మార్‌లోని మండాలయ్, సగైంగ్ నగరాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రభుత్వం కార్యాలయాల నిర్వహణ కోసం ఆ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదేకాకుండా ఎన్నో భారీ అంతస్తుల కట్టడాలు, అపార్ట్‌మెంట్స్ నివాసించడానికి వీలులేకుండా ఒక పక్కకు ఒరిగిపోయాయి.

మయన్మార్‌లో సగైంగ్ రీజియన్ నుండి మండాలయ్ రీజియన్ వెళ్లే రహదారి మధ్యలో ఇర్రవడి నదిపై నిర్మించిన ఓల్డ్ సగైంగ్ బ్రిడ్జి ఈ భూకంపం ధాటికి కుప్పకూలింది.

మయన్మార్, థాయ్‌ల్యాండ్‌లో భూకంపం మిగిల్చిన నష్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ రెండు దేశాలకు తగిన విధంగా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ విపత్తు నుండి అందరూ క్షేమంగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల ప్రభుత్వాలకు అందుబాటులో ఉండాల్సిందిగా భారత విదేశాంగ శాఖను ఆదేశించినట్లు మోదీ తెలిపారు.

మయన్మార్, థాయ్‌లాండ్‌లో ఉన్న భారతీయుల కోసం కూడా ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలు హెల్ప్ లైన్ ద్వారా సేవలు అందిస్తున్నాయి.

థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్: +66-2-260-0000

బ్యాంకాక్‌లో ఇండియా కాన్సూలేట్ జనరల్ హెల్ప్ లైన్: +66-2-662-9000

మయన్మార్‌లోని మండాలయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ ఆఫీస్: +95‐92054490, 0095‐281019

Show Full Article
Print Article
Next Story
More Stories