
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో హై అలర్ట్.. 300 మంది నక్సలైట్ల కోసం పోలీసుల గాలింపు
Mission 2026 : భారతదేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమరశంఖం పూరించింది. మార్చి 2026 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గడువు విధించుకుంది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అత్యంత కీలకమైన ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన నలుగురు అగ్రనేతలు సహా సుమారు 300 మంది నక్సలైట్లు భద్రతా దళాల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. వారిని పట్టుకోవడం లేదా ఏరిపారేయడమే లక్ష్యంగా అడవుల్లో జల్లెడ పడుతున్నారు.
భద్రతా దళాల ప్రధాన లక్ష్యంగా ఉన్న ఆ నలుగురు అగ్రనేతలు ఎవరంటే.. మిసిర్ బేస్రా (భాస్కర్), దేవ్‌జీ (కుంభ దాదా), రామన్న (గణపతి), మల్లా రాజారెడ్డి (సాగర్). వీరంతా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో కీలక సభ్యులు. తాజాగా దేవ్‌జీ తన అనుచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. రాజారెడ్డి ఒడిశాలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అగ్రనేతలకు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, ఒకటి లొంగిపోవడం.. లేదంటే ఎన్‌కౌంటర్‌లో అంతమవ్వడం అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా సాగించిన పోరాటం వల్ల నక్సలిజం ప్రభావం గణనీయంగా తగ్గింది. కేంద్ర హోం శాఖ నివేదిక ప్రకారం, గతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు పడిపోయింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలకు మాత్రమే నక్సల్స్ కదలికలు పరిమితమయ్యాయి. నక్సల్స్ కోటలుగా భావించిన ప్రాంతాల్లో ఇప్పుడు భద్రతా దళాల క్యాంపులు వెలిశాయి. కేంద్రం నిర్దేశించిన 2026 మార్చి గడువులోగా ఈ ప్రమాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడంలో భాగంగా అడవుల్లో డ్రోన్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పట్టుబడుతుండటం లేదా ఎన్‌కౌంటర్లలో చనిపోతుండటంతో మావోయిస్టు కేడర్‌లో ఆందోళన మొదలైంది. మార్చి 2026 తర్వాత భారత్ సరికొత్త శాంతియుత వాతావరణంలోకి అడుగుపెడుతుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




