PM Modi's 75th birthday: మోడీ@75.. ఒక సామాన్యుడి కథ కాదు.. కోట్లాది మందికి స్ఫూర్తి.. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ప్రయాణం!

PM Modi's 75th birthday: దేశ రాజకీయాలలో ఆయన కోట్లాదిమందికి ఆరాధ్య దైవం..
PM Modi's 75th birthday: దేశ రాజకీయాలలో ఆయన కోట్లాదిమందికి ఆరాధ్య దైవం.. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్నీ త్యాగం చేసి.. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తుంటారని దేశంలో అనేక మంది భావిస్తుంటారు.. అదే సమయంలో.. ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేశాన్ని వెనక్కి నడిపిస్తారని మరికొంత మంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయనెవరో కాదు.. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించి, గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. దేశ రాజకీయాలపైనే కాదు.. ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోడీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ పడిలో అడుగుపెట్టారు.
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950లో పుట్టి.. బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్ అమ్మిన మోడీ.. 8 ఏళ్ల వయస్సులో RSSలో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్‌లో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకిఅడుగుపెట్టారు. గుజరాత్‌లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. అడ్వాణీ గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోడీది పాత్ర కీలకం. అప్పుడే ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. దీంతో 1990-91లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్రను నిర్వహించే బాధ్యతను మోడీకి అప్పజెప్పారు. జోషీతో పాటు 15 వేల కిలోమీటర్లు దేశమంతటా తిరగడంతో గుజరాత్‌లో కూడా ఒక ప్రధాన నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారు.
1991 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎన్నికల వ్యూహన్ని రూపొందించే బాధ్యతలు చేపట్టిన మోడీ.. గాంధీనగర్ నుంచి అడ్వాణీ విజయానికి తీవ్రంగా తీవ్ర కృషి చేశారు. అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాలలో శంకర్‌సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్‌పేయి స్వయంగా ఫోన్ చేసి మోడీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. సీఎంగా మోడీ ఒక సమర్థుడైన పరిపాలకుడిగా వ్యవహరించి గుజరాత్ నమునాను ప్రపంచానికి పరిచయం చేశారు. గుజరాత్‌ను తాను పరిపాలించిన 13 ఏళ్లలో.. బలమైన పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్‌పేయి, అడ్వాణీ తర్వాత అతివేగంగా గుర్తింపు పొందిన నాయకుడైన మోడీ.. తాను సీఎంగా ఉండగానే పార్టీకి జాతీయస్థాయిలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు.
వాజ్‌పేయి తర్వాత అడ్వాణీకి 10 సంవత్సరాలు పార్టీని నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ.. బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో 2013లో మోడీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. 2014లో దేశమంతటా మోడీ ప్రభంజనం వీయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు. ఆయన హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాలలో ఎన్డీయే సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిన మోడీ.. పలు వైఫల్యాలను, విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే గుజరాత్ అల్లర్లు జరిగి వేలాది మంది ఊచకోత జరగడం ఆయన రాజకీయ జీవితంలో చెరిగిపోని మచ్చ. ప్రధానిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. పెద్ద నోట్ల రద్దు, సాగు చట్టాలు, లాక్‌డౌన్ సమయంలో పేదల మరణాలు, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, మణిపూర్‌లో రెండేళ్లపాటు జరిగిన హింసాకాండ, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు, ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగపరచడం, అనేక సందర్భాలలో అప్రజాస్వామిక వైఖరి ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
పుల్వామా, పహల్గాం ఉగ్రదాడులు.. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌తో ప్రారంభించిన యుద్ధాన్నిఅంతర్జాతీయ ఒత్తిడితో 4రోజుల్లోనే ముగించాల్సి రావడం ఆయనకు అప్రతిష్ఠను తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు మోడీకి అత్యంత స్నేహితుడిగా భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు వ్యతిరేకంగా మారి భారత్‌పై టారిఫ్ ల దాడి చేసినప్పటికీ చైనా, రష్యాలతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం మోదీ దౌత్యనీతిని ప్రదర్శించి.. అందరితో సెహబాష్ అనిపించుకున్నారు.
మరోవైపు ప్రధానిగా మోదీ తన 11 ఏళ్ల పదవీకాలంలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారు. జన్‌ధన్ యోజనతో దేశంలో 51 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 10 కోట్లకు పైగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో 2014 నుంచి 2024 వరకు 4.2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడానికి ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టి.. ‘ఒకే దేశం- ఒకే పన్ను’ కలను సాకారం చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశారు. అదే ఏడాది చివరిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు.
సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎన్నికల ముందు బాలాకోట్ దాడులు.. తాజాగా ఆపరేషన్ సిందూర్‌తో.. దాయాది పాక్‌కు గట్టి బుద్ధి చెప్పగల నేతగా మన్ననలు అందుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం, కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా రూ.6 వేలు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేశారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని మోదీ ఇచ్చిన పిలుపునకు ఐరాసలో 177 దేశాల మద్దతు లభించింది.
నరేంద్ర మోదీ తన పదవీ కాలంలో అనేక రికార్డులను సృష్టించారు. 2020 ఆగస్టు 13 నాటికి నరేంద్ర మోదీ 2,269 రోజులు పదవిలో ఉండి, అటల్ బిహారీ వాజ్‌పేయి 2,268 రోజుల రికార్డును అధిగమించారు. దీంతో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 2014 నుంచి ఆయన అధికారంలో ఉన్నారు. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత జన్మించిన మొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఆయనకు ముందు పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ బ్రిటీష్ పాలనకు ముందు జన్మించినవారే కావడం విశేషం.
2025 జులై 24 నాటికి ప్రధాని మోదీ 4,078 రోజులు నిరంతరంగా పదవిలో ఉండి, ఇందిరా గాంధీ 4,077 రోజుల ప్రధాని రికార్డును బ్రేక్ చేశారు. దీంతో ఆయన, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఒకే విడతలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. 2014, 2019, 2024లో మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ విజయం ఆయనను జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో సమానంగా నిలిపింది.
ప్రధానమంత్రి మోదీ అంతర్జాతీయంగా అత్యధిక గౌరవాలు పొందిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 18 దేశాలు ఆయనకు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి. ఇది ఆయనకు ముందు ఏ ప్రధానమంత్రికి కూడా దక్కలేదు.
ఇందిరా గాంధీ తర్వాత, లోక్‌సభలో పూర్తి మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 1971లో ఇందిరా గాంధీ ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. అదేవిధంగా, మోదీ 2014లో బీజేపీ 282 సీట్లతో గెలువగా, 2019లో 303 సీట్లతో మరింత బలమైన ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. ఎన్నో అద్భుత రికార్డులు సాధించిన మోదీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మోదీ 75వ జన్మదినం సందర్భంగా అనేక రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సామాజిక సేవా, రక్తదాన శిబిరాలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అనేక సంస్కరణలు, ఆర్థిక వృద్ధితో అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ఆయన సామాన్య జీవనం, అసాధారణ నాయకత్వ ప్రయాణం యువతకు నిత్యం స్ఫూర్తినిస్తోందనడంలో సందేహం లేదు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire