Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో మసూద్ అజార్ కుటుంబం ముక్కలు

ఆపరేషన్ సిందూర్‌తో మసూద్ అజార్ కుటుంబం ముక్కలు
x

ఆపరేషన్ సిందూర్‌తో మసూద్ అజార్ కుటుంబం ముక్కలు

Highlights

ఆపరేషన్‌ సిందూర్‌ ప్రధావం పెద్దదే.. భారత సైన్యం చేసిన దాడిలో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది బయట పెట్టిన జైషే టాప్ కమాండర్ పాకిస్తాన్ చెప్పేవన్నీ బుకాయింపులే..

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిలలాడిపోవడం తెలిసిందే.. చిత్తయిపోయినా తమదేపై చేయి అన్నట్లు అమెరికా అండ చూసుకొని రెచ్చిపోయిన పొరుగు దేశం ఇప్పుడు వాస్తవాలను అంగీకరిస్తోంది. భారత వైమానికి దళదాడితో ఉగ్రవాది మసూద్ అజర్ ఫ్యామిలీ ఎలా తుడుచిపెట్టుకుపోయిందో తాజాగా జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఒకరు చెప్పుకొచ్చారు.. మరోవైపు భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ వెనుక అమెరికా అధ్యక్షుని ప్రమేయం ఎక్కడా లేదని తాజాగా బయట పడింది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ తెలిపారు. మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదని చెప్పుకొచ్చారు.

పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టడం తెలిపిందే. దీనికి సంబంధించిన ఆసక్తిక విషయాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది మే 7న బహవల్‌పూర్‌‌లోని జామియా మస్జిద్ సుబహానల్లాపై భారత ఆర్మీ భీకర దాడులు చేసింది. నిఘా వర్గాల పక్కా సమాచారంతోనే ఈ ఎటాక్ చేసింది. భారత్ దాడి తర్వాత ఉగ్రవాది మసూద్ అజర్ వెక్కివెక్కి ఏడ్చాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత సైన్యం ఆపరేషన్‌లో తన ఫ్యామిలీకి చెందిన 10 మంది చనిపోయారని అతడు స్వయంగా వెల్లడించాడంటూ ఆయా కథనాల్లో ప్రస్తావించారు. భారత్ దాడి జరిపినప్పుడు వారంతా జామియా మస్జిద్ సుబహానల్లా లోపలే ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా, పాకిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది.

భారత వైమానికి దశం దాడిలో జైషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు బహవల్‌పూర్‌లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి.

ఆ వీడియోలో జైషే మహమ్మద్ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్‌పూర్‌లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు ఇలియాస్ కాశ్మీరీ .

మరోవైపు భారత పార్లమెంట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి, 26/11 ముంబయి మారణకాండ వెనుక జైషే అధినేత మసూద్‌ అజర్‌ హస్తం ఉందని ఇలియాస్ కశ్మీరీ అంగీకరించాడు. ఇలియాస్‌ కశ్మీరీ చెప్పినదాని ప్రకారం మసూద్‌ అజార్‌ బాలాకోట్‌ ను అడ్డాగా చేసుకొని ఎప్పటి నుంచో భారత్‌పై ఉగ్ర కుట్రలు పన్నుతున్నట్లు తేలింది. ఇక ఒసామా బిన్‌ లాడెన్‌ను ఇలియాస్‌ అమరవీరుడిగా పోల్చాడు. పాక్‌ సైన్యం పహారాలో జైషే స్థావరం స్వేచ్ఛగా నడుస్తోందని భారత్‌ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పాక్‌ మాత్రం అక్కడ ఎటువంటి ఉగ్ర క్యాంపులు లేవని ప్రపంచానికి నమ్మబలుకుతోంది.

కాగా బహవల్‌పూర్‌‌పై భారత్ దాడి చేసిన నెల తర్వాత, జూన్‌లో పాకిస్థాన్ అగ్ర రాజకీయ నేత బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది మసూద్ అజర్ ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. ఒకవేళ అజర్ ఆచూకీపై భారత్ సరైన సమాచారాన్ని అందిస్తే, పాక్ సంతోషంగా అరెస్టు చేస్తుందని ఆయన ప్రకటించారు. పాక్ గడ్డపై అజర్ ఎక్కడున్నాడో చెప్పాలని భారత్‌ను ప్రశ్నించారు.

లాహోర్‌కు దాదాపు 400 కి.మీ దూరంలోని బహవల్‌పూర్‌ పాకిస్తాన్‌లోని 12వ అతిపెద్ద నగరం. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు ఈ నగరమే ఆయువుపట్టు. ఈ నగరంలో జామియా మస్జిద్ సుబహానల్లా ఉంది. దీన్నే స్థానికులు ఉస్మానో అలీ క్యాంపస్ అని పిలుస్తుంటారు. బహవల్‌పూర్‌‌లోని జామియా మస్జిద్ సుబహానల్లాను ప్రధాన కేంద్రంగా చేసుకొని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2000 దశకం తొలినాళ్లలో జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థను మౌలానా మసూద్ అజర్ స్థాపించాడు. పాక్ ఉగ్రవాదులను కశ్మీర్‌లో జిహాద్ కోసం ఉసిగొల్పాడు. గత కొన్ని దశాబ్దాల్లో భారతగడ్డపై జరిగిన ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ అజర్ హస్తం ఉంది. అతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అందుకే బాహ్య ప్రపంచానికి మొహం చూపించకుండా, పాకిస్థాన్‌లోనే రహస్యంగా మసూద్ అజర్ జీవితాన్ని గడుపుతున్నాడు.

మరోవైపు భారత్‌–పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్‌ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చిచెప్పారు. ట్రంప్‌ చెప్పినదంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేశారు. భారత్‌తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇషాక్‌ దార్‌ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని .. రెండు దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు.

కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాకు చెప్పారు. కానీ, ఆ చర్చలేవీ జరగలేదు. జూలై 25వ తేదీన వాషింగ్టన్‌లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్‌ తేల్చిచెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు.భారత్, పాక్‌ల సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్‌ చెబుతుండగా ఇక మేము ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్‌ను అడుక్కోలేం కదా అని తెలిపారు ఇషార్ దార్.


Show Full Article
Print Article
Next Story
More Stories