ఇక ఆ దేశాలకు దబిడి దిబిడే.. ఫ్రాన్స్ తో చారిత్రాత్మక ఒప్పందాలు

భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక గర్జన: 21 ఒప్పందాలు.. దేశీయంగానే హామర్ క్షిపణుల తయారీ!
x

భారత్-ఫ్రాన్స్ 'వ్యూహాత్మక' గర్జన: 21 ఒప్పందాలు.. దేశీయంగానే హామర్ క్షిపణుల తయారీ!

Highlights

PM Modi and Emmanuel Macron Meet: మూడురోజుల పర్యటన కోసం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భారత్ వచ్చారు.

PM Modi and Emmanuel Macron Meet: మూడురోజుల పర్యటన కోసం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భారత్ వచ్చారు. ముంబయి చేరుకున్న మేక్రాన్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షున్ని మహారాష్ట్ర లోక్‌భవన్‌లో సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త రంగాలకు వాటిని విస్తరించడం, భాగస్వామ్యంలో పురోగతిపై సమాలోచనలు జరిపారు. భౌగోళిక రాజకీయ తిరుగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారం గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించారు. అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అడ్వాన్స్‌ మెటీరియల్‌ వంటి రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోనున్నారు, ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 21 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌లో హామర్‌ క్షిపణుల ఉత్పత్తికి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, సాఫ్రాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం దీనిలో ఒకటి. ఇరు దేశాల సైన్యాల మధ్య అధికారులను పరస్పరం నియుక్తం చేయడం మరొకటి.

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. మనకు ఎంతోకాలంగా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్‌ ఒకటి.. ఇరు దేశాల మధ్య సంబంధాలను గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసుకున్నామన్నారు. విశ్వాసం, దార్శనికతల ప్రాతిపదికన దీనిని ప్రత్యేక స్థాయికి తీసుకువెళ్తున్నాం. ఎవరెస్ట్‌ పర్వత శిఖరంపైనా ఎగరగలిగే సత్తా ఉన్న హెలికాప్టర్ల తయారీని రెండు దేశాలూ కలిసి కర్ణాటకలో చేపట్టాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. వీటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాం. భారత్‌-ఐరోపా సంబంధాల్లో 2026 సంవత్సరం కీలక మలుపుగా నిలుస్తుంది. కొద్దిరోజుల క్రితమే ఈయూతో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతటా అనిశ్చితి అలముకున్న వేళ ఫ్రాన్స్‌తో కుదిరిన బంధం.. ప్రపంచ సుస్థిరతకు ప్రబల శక్తిగా నిలుస్తుంది’’ అని భారత ప్రధాని పేర్కొన్నారు.

భారత్- ఫ్రాన్స్... భూమిపై, సముద్రంలో, ఆకాశంలో ఒకరికొకరు సహకరించుకుంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. భారత్‌తో కుదిరిన రక్షణ సంబంధాలపై ఆయన కీలక వాఖ్యలు చేశారు. మేక్ ఇన్ ఇండియా'లో ఫ్రాన్స్ ఒక కీలక భాగస్వామి అని స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఐదవ తరం విమానాల ఇంజన్లు.. ఇలా అనేక రంగాలలో తమ దేశం భారత్‌తో కలిసి పని చేస్తోందన్నారు. ఇరు దేశాలు చట్టబద్ధ పాలనను బలంగా నమ్ముతాయని, కొన్నేళ్లుగా దీన్ని రెండు దేశాలు నిరూపించాయని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సహకరిస్తామని ప్రకటించారు. ఆవిష్కరణ అంటే కేవలం సాంకేతిక రంగంలో సాధించే విజయాలు మాత్రమే కాదని మేక్రాన్ చెప్పుకొచ్చారు. అవి సామాన్య ప్రజల ప్రయోజనం కోసం, వారి జీవితాలను మెరుగుపరచడం కోసమన్నారు. ఈ ఏడాది జూలైలో ఫ్రాన్స్‌లో నిర్వహించే శిఖరాగ్ర సమావేశానికి భారత్​ను ఆహ్వానించామని మేక్రాన్ తెలిపారు

కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్‌ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వర్చువల్‌గా ప్రారంభించారు. మరోవైపు బెంగళూరులో నిర్వహించిన ఇరు దేశాల ఆరో ద్వైపాక్షిక రక్షణ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి కేథరిన్‌ వోట్రిన్, ఇరు దేశాల త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాన్ని పదేళ్లకు పునరుద్ధరించేలా భారత్, ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అత్యాధునిక 'హామర్' క్షిపణులను భారత్‌లోనే తయారు చేసేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ మధ్య హామర్ క్షిపణుల తయారీకి సంబంధించి జాయింట్ వెంచర్ ఒప్పందం కుదిరింది. దీనివల్ల ఈ శక్తివంతమైన క్షిపణులు ఇకపై భారత్‌లోనే తయారుకానున్నాయి. ఫ్రాన్స్‌తో ఒప్పందం.. రక్షణ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు ఉపయోగపడుతుందన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

మరోవైపు ముంబైలో జరిగిన ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్ మీట్‌లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ సంబర్భంగా రక్షణ రంగంలో సాంకేతిక బదిలీపై కూడా మెక్రాన్‌ కీలక కామంట్స్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా అద్భుతంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి, ఏ ఒక్క దేశ ఆధిపత్యం లేని సరికొత్త ప్రపంచ మార్గాన్ని నిర్మించడానికి ఒక ఉమ్మడి కార్యాచరణపై పని చేస్తున్నామన్నారు. విమాన, రైల్వే రంగాలు భారత్, ఫ్రాన్స్‌లకు అత్యంత కీలకమైన రంగాలు అని మెక్రాన్‌ అన్నారు. 'విమాన రంగం ఇరు దేశాల భాగస్వామ్యాల్లో ఒక ప్రధానమైన భాగం. అదేవిధంగా, హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ నిర్మాణంలో కూడా మేము ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతున్నాం. కేవలం సేవలు అందించడమే కాకుండా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు బదిలీ చేసేలా చేస్తాం. సాంకేతిక బదిలీని సాకారం చేసేందుకే భారత ప్రధానితోకలిసి ‘ఇన్నోవేషన్ ఇయర్’ను ప్రారంభించాం అని వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories