PM Modi: ప్రధాని మోడీ శ్రీశైల పర్యటన: ప్రత్యేక పూజలు, అభివృద్ధి

ప్రధాని మోడీ శ్రీశైల పర్యటన: ప్రత్యేక పూజలు, అభివృద్ధి
x

ప్రధాని మోడీ శ్రీశైల పర్యటన: ప్రత్యేక పూజలు, అభివృద్ధి

Highlights

దేశం చూపు.. శ్రీశైలం వైపు శ్రీశైలానికి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్న మోడీ

తెలుగు రాష్ట్రాల్లోనే కొలువై ఉన్న మహిమాన్విత పుణ్యక్షేత్రం.. జ్యోతిర్లింగ క్షేత్రంతో పాటు.. శక్తిపీఠం కూడా నెలవైన పవిత్రధామం. అంతేనా చారిత్రక ప్రదేశం.. కన్నుల పండువగా కనిపించే రమణీయ ప్రదేశం.. ఇవన్నీ కలిసిన పవిత్ర ప్రదేశం శ్రీశైలం క్షేత్రం.... ఇప్పుడు ఈ క్షేత్రం దేశం దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది..అందుకు కారణం లేకపోలేదు... ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలానికి రానున్నారు.... స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు... వాటితో పాటు క్షేత్ర అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు.. ఈ పర్యటన తర్వాత క్షేత్ర దశ మారుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశం గా మారిన వైనం పై ప్రత్యేక కథనం.

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు..డిల్లీ నుండి ప్రత్యేక విమానం ద్వారా కర్నూలు జిల్లా లోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి నుండి ప్రత్యేక హెలికాఫర్ట్ ద్వారా సున్నిపెంట కు చేరుకోనున్నారు...అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకోనున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం లో స్వామి అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు...ఆలయం లో ప్రధాని 40 నిమిషాల పాటు ఆధ్యాత్మిక ప్రపంచంలో గడపనున్నారు...పూజల అనంతరం క్షేత్ర పరిసర ప్రాంతంలో ఉన్న శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించ నున్నారు...అక్కడ ఆయన కొన్ని నిమిషాలు ఏకాంతంగా ధ్యానం చేసుకోనున్నారు...అనంతరం అక్కడి నుండి కర్నూలు బహిరంగ సభకు బయలుదేరనున్నారు...

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రాన్ని దేశ ప్రధాని స్థాయి వ్యక్తులు దర్శించిన దాఖలాలు అతి తక్కువ.... శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన కోసం అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. పూర్తి అయిన ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన తనయ ప్రధాని ఇందిరాగాంధీ ఈ క్షేత్రాన్ని సందర్శించారు... అప్పటినుండి ప్రధాని హోదాలో ఇప్పటివరకు ఆలయానికి వచ్చిన దాఖలాలు ఏమీ లేవు... గత ఏడాదిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించుకున్నారు... స్వామి అమ్మవారి దర్శనం అనంతరం సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ధ్యానం ఆచరించారు... తమ అభిమాన నేత శ్రీశైలానికి మొదటిసారి ప్రధాని హోదాలో వస్తున్న నేపథ్యంలో బీజేపి నేతల ఆనందానికి అవధులు లేవు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు కమలదల నేతలు... శ్రీశైల పుణ్యక్షేత్రంలో రోడ్ షో ఉండే అవకాశం ఉండటంతో ప్రధానిని తిలకించాలన్న ఆకాంక్షతో పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు... మరోవైపు స్థానికులు సైతం ప్రధాని సందర్శనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు...

ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల పర్యటన నేపద్యం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, దేవాదాయ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది...పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలను తీసుకుంది...ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది...రహదారులను మరమ్మత్తులు చేస్తోంది. మరికొన్నింటిని నూతనంగా నిర్మిస్తోంది...అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సౌకర్యం కొరకు చేసిన క్యూ లైన్స్ ను బ్యారికేడ్స్ ను పూర్తి తొలగించింది... ఆలయాన్ని పూర్వ వైభవం చేకూరేలా సరిదిద్దుతోంది. ఆధ్యాత్మికత అలరారేలా ఆలయం ముస్తాబవుతోంది... క్షేత్ర పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రంగురంగుల అందమైన బొమ్మలను చిత్రకారులు గోడలపై వేస్తున్నారు.. ప్రధాని పర్యటించే ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు.. సున్నిపెంట గ్రామాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు... దీంతో ప్రధాని పర్యటనపై గ్రామస్తులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు...

ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి మాత్రమే పరిమితమైన శ్రీశైలం అభివృద్ధి ప్రణాళికలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి. ఆలయ విస్తరణ నుంచి భ్రమరాంబ అమ్మవారి ప్రాకార పునర్నిర్మాణం వరకు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రధాన అడ్డంకి, అటవీశాఖ అనుమతులు...ముఖ్యంగా ఆలయ పరిసరాలు అటవీప్రాంతంలో ఉండటంతో ప్రతి నిర్మాణం, ప్రతి విస్తరణకు కొత్త కష్టాలు ఎదురవుతూనే వున్నాయి... ఈ సమస్యను కేంద్రం మాత్రమే పరిష్కరించగలదు.. అందుకే ప్రస్తుత ప్రధాని పర్యటనపై అందరి చూపు పడింది...

తిరుపతి తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇప్పటికే శ్రీశైలం మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా అమలు పరచడంతో పాటు 2050 వరకు కావలసిన సౌకర్యాల కల్పననే ధ్యేయంగా పనిచేస్తుంది... ఇప్పటికే ఆలయ అభివృద్ధికి సమస్యగా ఉన్న

భూ వివాదాన్ని పరిష్కరించేందుకు క్యాబినెట్ లో చర్చ కూడా నిర్వహించింది... రోజురోజుకీ శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరగడంతో దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు స్థల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది... శ్రీశైల దేవస్థానానికి బ్రిటిష్ వారి గెజిట్ ప్రకారం వేల ఎకరాల భూములు ఉండేవి. కానీ కాలక్రమేణా.. అవి అటవీ భూములుగా మారిపోయాయి అన్నది స్థానికుల వాదన.. దీనిని పరిష్కరించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ, రెవెన్యూ ,అటవీశాఖ మంత్రులు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి భూములను డీ నోటిఫై చేసి దేవస్థానానికి అప్పగించాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది... తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతమంతా NSTR పరిధిలో ఉండటంతో అది సాధ్యం కావడం లేదు.. అడవుల డీ నోటిఫై అనుమతుల కోసం కేంద్రానికి పంపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది... కానీ అనుకోకుండా దేశ ప్రధాని నేరుగా శ్రీశైల క్షేత్రం వస్తుండడంతో ఇక్కడనుండే దానికి సంబంధించిన ప్రత్యేక అనుమతుల కోసం ప్రధాని ఒప్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడిందని తెలుస్తోంది.

శ్రీశైల దేవస్థానంతో పాటు ఆలయానికి సమీపంలో ఉన్న సున్నిపెంట గ్రామం.. ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆలయ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచేందుకు, అభివృద్ధికి అవకాశం కల్పించేందుకు స్థానిక ప్రజలను అక్కడి నుంచి పునరావాసం చేయాలనే ప్రతిపాదన ఉంది. సున్నిపెంట ప్రజలకు కొత్త స్థలాలు, గృహాలు కేటాయించాలన్న ప్రణాళికపై కూడా ప్రధాన చర్చ జరుగుతోంది. అదే సమయంలో అటవీ శాఖ పరిమితుల్లో ఉన్న పాదయాత్ర మార్గాలపై పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశాలన్నీ ప్రధాని సమక్షంలో ప్రస్తావించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి ప్రెజెంటేషన్ సిద్ధం చేసిందని సమాచారం.

ప్రధాని మోడీ పర్యటనలో అందరినీ ఆకర్షిస్తున్న మరో అంశం.. శివాజీ స్ఫూర్తి కేంద్రం.. శ్రీశైలం క్షేత్రానికి, చత్రపతి శివాజీ మహారాజుకు విడదీయరాన్ని అనుబంధం ఉంది... తన పరివారంతో ఈ క్షేత్రాన్ని సందర్శించిన చత్రపతి శివాజీ అమ్మవారి మహిమతో మంత్రముగ్ధుడయ్యాడని చరిత్ర చెబుతోంది.. హైందవ సామ్రాజ్య స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తూ దక్షిణాదిని ఏకతాటిపై చేసిన చత్రపతి ఉత్తరాది వైపుకు మళ్లేందుకు శక్తినివ్వాలని శత్రు జయం కలగాలని అమ్మవారిని ఆరాధించినట్లు పెద్దలు చెబుతారు.. శివాజీ ధ్యానానికి మెచ్చిన బ్రమరాంబ దేవి ఆయన ఖడ్గాన్ని స్పృశించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటినుండి అప్రతిహతంగా యుద్ధాలను గెలుస్తూ ముందుకు సాగాడు శివాజీ మహారాజ్... ఆయన తపస్సు చేసిన ప్రాంతంలో శివాజీ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు RSS సంయుక్తంగా ఓ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు... శివాజీ మహారాజ్ ధ్యానం చేసుకున్న ప్రాంతంలో ధ్యాన మందిరాన్ని ఆ పక్కన ఆయన తన పరివారంతో నిర్వహించిన ప్రజా దర్బార్ ను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు.... ప్రస్తుతం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో నిర్వాహకులు పనిచేస్తున్నారు... ఈ నేపథ్యంలో గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమ్మవారి స్వామివారి ఆశీస్సుల తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం నిర్వహించారు... ప్రస్తుతం నరేంద్ర మోడీ పరిస్థితి కూడా అదే రకంగా కొనసాగుతుంది... భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం ధ్యాన మందిరంలో పూజలు నిర్వహించి కర్నూలుకు పయనం కానున్నారు.....ఈ ప్రాజెక్టు కేవలం స్మారక స్థలం కాదు… అది జాతీయ ఏకతకు ప్రతీకగా రూపుదిద్దుకుంటోంది....శివాజీ మహారాజ్‌ శౌర్యం, హిందూ ధర్మ పరిరక్షణకు చిహ్నంగా నిలిచే ఈ కేంద్రాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. ప్రధాని మోడీ ఈ కేంద్రాన్ని సందర్శించనుండడంతో పాటు.. కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులతో మరింత అభివృద్ధి కి బాటలు వేసే అవకాశం లేకపోలేదని స్థానికులు

భావిస్తున్నారు...

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రధాని పర్యటన ఆలయ అభివృద్ధి కి కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు....శ్రీశైలం ఆలయ అభివృద్ధి, రోడ్డు కనెక్టివిటీ, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, సౌకర్యాల విస్తరణ అన్నింటికీ కేంద్ర సహకారం కావాలి. ప్రధాని మోడీతో జరగబోయే సమీక్షలో ఈ అంశాలు స్పష్టంగా ప్రస్తావించబోతున్నారని దేవదాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామస్తులు సైతం ప్రధాని పర్యటనపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు... నల్లమల ప్రాంతం అంతా ఒకప్పుడు మావోల ప్రభావమున్న నేపథ్యంలో అడవినీ రక్షణ దళాలు జల్లెడ పడుతున్నారు. గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీతోపాటు, ఆర్మర్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ దళాలని నల్లమలలోనే గత కొన్ని రోజుల నుంచి పూర్తిగా మకాం వేశాయి.... శ్రీశైల క్షేత్రాన్ని SPG, NIAలు తమ కంట్రోల్ కి తీసుకున్నాయి... అదనంగా హెలిపాడ్ లను సిద్ధం చేసింది.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది.

ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న…ఈ పర్యటన తర్వాత శ్రీశైలం క్షేత్ర దశ నిజంగా మారుతుందా? ఆలయ అభివృద్ధి పయనంలో దశాబ్దాలుగా మిగిలిపోయిన “అనుమతుల” ఇబ్బందులు ఇక ముగిసినట్లేనా.. లేక.. మరోసారి వాగ్దానాలతోనే ముగుస్తుందా? ... అయితే స్థానిక ప్రజలు మాత్రం శ్రీశైలం లో సమస్యలు ముగుస్తాయని బలంగా నమ్ముతున్నారు.. భక్తులు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు…ఇప్పుడు దేశం చూపు శ్రీశైలంపై… ప్రధాని మోడీ పర్యటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories