Prashant Kishor: 2024లోనూ అధికారం బీజేపీదేనన్న ప్రశాంత్ కిశోర్

Prashant Kishor Key Comments
x

Prashant Kishor: 2024లోనూ అధికారం బీజేపీదేనన్న ప్రశాంత్ కిశోర్

Highlights

Prashant Kishor: విపక్షాలన్నీ ఏకమైనా ఎన్డీయేను ఓడించలేవని జోస్యం

Prashant Kishor: రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరు? బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముచ్చటగా మూడోసారి పార్లమెంట్‌లో పాగా వేస్తుందా? విపక్షాలు అన్నీ కలిసి ఎన్డీయే కూటమిని కూలదోస్తాయా? ఇంతకీ విపక్షాలు కాషాయ సర్కార్‌పై పైచేయి సాధించడం సాధ్యమేనా? మరోమారు ప్రధాని కుర్చీని దక్కించుకుంటామనే ధీమాలో బీజేపీ... మోడీని గద్దె దించుతామనే అత్యుత్సాహంలో విపక్షాలు ఉన్నాయి. ఇంతకీ 2024లో ప్రధాని కుర్చీలో కూర్చునేదెవరు? ఇదే ఇపుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ క్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

2024 ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా వెల్లడించారు. విపక్షాల ఐక్యత బీజేపీని ఏమీ చేయలేదని కుండబద్దలు కొట్టారు. విపక్షాలు ఏకమైనా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉంటాయని పీకే చెప్పుకొచ్చారు. వాటి ఐక్యత కూడా స్థిరంగా ఉండబోదని జోస్యం చెప్పారు. విపక్షాల ఐక్యత అంటే కేవలం ఆయా పార్టీల నేతలు కలవడం మాత్రమేనని తెలిపారు. విపక్షాలు బీజేపీని ఓడించాలంటే ముందుగా హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఇది త్రీ లెవెల్ పిల్లర్ అని పీకే వెల్లడించారు. వీటిలో కనీసం రెండింటిని విపక్షాలు అధిగమించపోతే... బీజేపీని అవి కనీసం ఛాలెంజ్ కూడా చేయలేవని తన మనసులో మాట బయటకు చెప్పారు.

హిందుత్వ సిద్ధాంతంపై పోరాడాలంటే విపక్షాలు తమ సిద్ధాంతాలను ఏకం చేయాలని... ఎవరి సిద్ధాతం వారిది అనుకుంటే బీజేపీని ఓడించలేవని ప్రశాంత్ తెలిపారు. గాంధీవాది, అంబేద్కరైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు... ఏదైనాసరే సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమన్నారు. అయితే ఈ సిద్ధాంతాల వల్లే ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదని వెల్లడించారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని... బీహార్‌లో తాను చేపట్టిన జన సూరజ్ యాత్ర లక్ష్యం కూడా గాంధీ కాంగ్రెస్‌ను మళ్లీ తీసుకురావడానికి చేసే ప్రయత్నమేనని ఆయన చెప్పుకొచ్చారు.

విపక్షాలు ఏకం కావడం, నాయకులు కలవడం గురించే మీడియా మాట్లాడుతుంటుందని పీకే అన్నారు. ఎవరు ఎవరితో కలిసి లంచ్ చేశారు?.. ఎవరు ఎవరినీ టీకి పిలిచారనేది చూస్తుంటారని తెలిపారు. తాను మాత్రం సిద్ధాంతాల పరంగా ఎలాంటి మార్పు ఉందనే కోణంలో చూస్తానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. సిద్ధాంతాల ప్రకారం విపక్షాలు ఏకం కావడం కుదరని పని అని... అందుకే విపక్షాలు బీజేపీని ఓడించే అవకాశమే లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఓ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పీకే తన అభిప్రా‍యాన్ని ఖరాఖండిగా చెప్పారు. కాంగ్రెస్‌కు పునర్జన్మను ఇవ్వాలని తాను అనుకుంటున్నానని... ఎన్నికల్లో గెలవాలని వారు కోరుకుంటున్నారన్నారు ప్రశాంత్. తన సలహాలను పాటించేందుకు వారు అంగీకరించలేదని పీకే తెలిపారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ... ఎన్నికల్లో వచ్చే ఫలితాలే యాత్రకు అసలైన పరీక్ష అని అన్నారు. యాత్ర అంటే కేవలం నడవడం మాత్రమే కాదని... ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయని చెప్పారు. ఆరు నెలల పాదయాత్ర తర్వాత మార్పు ఏమైనా వచ్చిందా? అని ప్రశాంత్ కిశోర్ ఎదురు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories