UGC : వర్సిటీల్లో కుల రాజకీయాలకు బ్రేక్? యూజీసీ ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

UGC : వర్సిటీల్లో కుల రాజకీయాలకు బ్రేక్? యూజీసీ ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
x
Highlights

వర్సిటీల్లో కుల రాజకీయాలకు బ్రేక్? యూజీసీ ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

UGC : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకువచ్చిన కొత్త ఈక్విటీ నిబంధనలు-2026పై దేశవ్యాప్తంగా రేగుతున్న నిప్పులకు సుప్రీంకోర్టు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. కుల వివక్షను రూపుమాపాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ నిబంధనలు, సమాజాన్ని విడదీసేలా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు 2012 నాటి పాత నిబంధనలనే అనుసరించాలని స్పష్టం చేస్తూ, కొత్త రూల్స్‌పై స్టే విధించింది.

భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థలో కుల వివక్ష అనేది ఒక చేదు నిజం. నివేదికల ప్రకారం..2019 నుంచి 2025 మధ్య కాలంలో యూనివర్సిటీ క్యాంపస్‌లలో కుల ఆధారిత వేధింపులు ఏకంగా రెట్టింపు అయ్యాయి. ఈ సామాజిక రుగ్మతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్-2026ను తెరపైకి తెచ్చింది. అయితే, వివక్షను రూపుమాపాలనే మంచి ఉద్దేశంతో తెచ్చిన ఈ నిబంధనలు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఈ చర్చ మరింత ముదిరింది.

UGC అంటే ఏమిటి?

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(UGC) అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. దీనిని 1956లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దేశంలోని యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేయడం, ఉన్నత విద్యా ప్రమాణాలను నిర్ణయించడం, వాటిని పర్యవేక్షించడం. భారతదేశంలోని డిగ్రీలు ప్రదానం చేసే ప్రతి యూనివర్సిటీకి UGC గుర్తింపు తప్పనిసరి.

వివాదానికి బీజం

యూజీసీ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలపై ప్రధానంగా సమానత్వం విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇందులో ముఖ్యంగా రెగ్యులేషన్ 3 (సి) అనే క్లాజు వివాదాస్పదమైంది. ఈ నిబంధనలు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల రక్షణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయని, జనరల్ కేటగిరీ విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించాయని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టం అనేది ఎప్పుడూ తటస్థంగా ఉండాలని, ఒక వర్గానికి కొమ్ముకాస్తూ మరో వర్గాన్ని వదిలేయకూడదనే వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది.

సుప్రీంకోర్టు ఘాటు స్పందన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం ఈ నిబంధనలపై విచారణ చేస్తూ యూజీసీని గట్టిగా నిలదీసింది. ఒకవైపు దేశం కులరహిత సమాజం కోసం పోరాడుతుంటే, వర్సిటీల్లో ప్రత్యేక కమిటీలు, బహుశా ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులను కులాల వారీగా విడదీస్తున్నామా? అని కోర్టు ప్రశ్నించింది. అమెరికాలో గతంలో నల్లజాతీయులు, తెల్లజాతీయుల కోసం వేర్వేరు పాఠశాలలు ఉండే పరిస్థితులు ఉండేవని, అటువంటి వేర్పాటువాద ధోరణులు భారత్‌లో రాకూడదని జస్టిస్ బాగ్చీ హెచ్చరించారు. కేవలం కుల వివక్ష అనే పదాన్ని వాడటం పట్ల కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వివక్ష అనేది ర్యాగింగ్ లేదా ఇతర రూపాల్లో కూడా ఉండవచ్చు కదా అని ప్రశ్నించింది.

పరిష్కారం ఎక్కడ?

యూజీసీ తెచ్చిన నిబంధనలు ఉద్దేశపూర్వకంగా సరైనవే కావొచ్చు, కానీ పదజాలం, అమలు తీరు అస్పష్టంగా ఉండటమే ఈ వివాదానికి కారణం. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొన్ని కీలక మార్పులు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. రక్షణ అనేది కేవలం రిజర్వ్‌డ్ వర్గాలకే కాకుండా, వివక్షకు గురయ్యే ఏ విద్యార్థికైనా వర్తించేలా ఉండాలి. క్యాంపస్‌లలో అడ్డుగోడలు కట్టడం కంటే, విద్యార్థుల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించే అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి.

ప్రస్తుతానికి 2012 నిబంధనలు అమలులో ఉంటాయి కాబట్టి, యూజీసీ, కేంద్ర ప్రభుత్వం ఈ విరామ సమయంలో నిపుణుల కమిటీ సూచనలతో అందరికీ ఆమోదయోగ్యమైన, పారదర్శకమైన సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే విద్యాలయాలు కులాల కుంపట్లుగా కాకుండా, దేశ ఐక్యతకు ప్రతిబింబాలుగా విరాజిల్లుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories