TOP 6 News @ 6PM: క్రికెట్ మహిళల వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్పై సెంచరీ.. ఎవరీ గొంగడి త్రిష?
1) న్యాయవాదులు ఇలాంటి పిటిషన్లు కూడా వాదిస్తారా? చంద్రబాబుకు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు Chandrababu Naidu: చంద్రబాబుపై కేసులు...
1) న్యాయవాదులు ఇలాంటి పిటిషన్లు కూడా వాదిస్తారా? చంద్రబాబుకు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Chandrababu Naidu: చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.చంద్రబాబు ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కి బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లను కూడా వాదిస్తారా అని కోర్టు ప్రశ్నించింది.
సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య దాఖలు చేశారు. ఒక్క మాట కూడా మాట్లాడవద్దని పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. పిటిషన్ పై ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని కోర్టు వార్నింగ్ ఇచ్చింది.ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి వాటిపై జగన్ ప్రభుత్వం సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారు. జగన్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
ముఖ్యమంత్రిగా ఉన్నన చంద్రబాబు కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ కేసుల విచారణను సీఐడీకి బదులుగా సీబీఐకి బదిలీ చేయాలని న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మణీందర్ సింగ్ వాదనలకు సిద్దమైన సమయంలో ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
2) YS Jagan: వైఎస్ జగన్‌కు సుప్రీంలో ఊరట
YS Jagan: వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సోమవారం వెనక్కి తీసుకున్నారు.
ఈ పిటిషన్ పై జనవరి 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జగన్ ఆస్తుల కేసులో ట్రయల్ సరిగా జరగడం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం, శుక్ర,శనివారాల్లో మాత్రమే ఈ కేసుపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా విచారణ చేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.
ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
3) లీక్ చేశారంటే మూల్యం తప్పదు.. రాజమౌళి మాస్ వార్నింగ్..!
SSMB29 Movie: రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్లో అంచనాలు ఉంటాయి. మహేష్ బాబు హీరోగా SSMB29 రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అన్నప్పటి నుంచి ఆ అంచనాలను అందుకోవడం కాస్త కష్టంగానే ఉంది. ఇక రాజమౌళి ఈ సినిమా విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయడంతో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తోంది.
మహేష్ బాబు SSMB29 సంబంధించి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని రాజమౌళి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. చిత్ర యూనిట్‌కి కొన్ని షరతులు పెట్టారని.. హీరోతో సహా సెట్ లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏ సమాచారం బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.
సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్లు సహా చిత్ర యూనిట్ కి హెచ్చరికలు జారీ చేసినట్టు టాక్. అంతేకాదు వారితో నాన్ డిస్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్టు కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల రాజమౌళి తన సినిమా కోసం ఓ సింహాన్ని లాక్ చేసినట్టు ఓ పోస్టు పెట్టారు. అందులో ఓ పాస్ పోర్టును చూపించారు. అంటే మహేష్ బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని ఆ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే షూటింగ్ షూరూ అయిందని హింట్ కూడా ఇచ్చారు. ఈ పోస్టుకు స్పందించిన మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చారు. ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ పెట్టారు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్ట్‌ల గురించి ఇప్పటి వరకు ఏ వార్త బయటకు రాలేదు. కథ విషయంలో కూడా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే తప్ప దర్శకుడిగా రాజమౌళి ఎక్కడా నోరు విప్పలేదు. జస్ట్ సినిమా జానర్ మాత్రం చెప్పారు. సినిమా సంబంధించి ఒక్క విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఓపెనింగ్ రోజు అల్యూమీనియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలో కెమెరాలను సైతం అనుమతించలేదు. దీంతో ఓపెనింగ్ ఎలా జరిగింది. ఎవరు వచ్చారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు.
4) ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే నెలకు రూ. 43 లక్షలు ఇస్తామంటున్న మెటా కంపెనీ
Instagram Reels Earnings: టిక్ టాక్ క్రియేటర్స్‌కు ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేసే టిక్ టాక్ క్రియేటర్స్‌కు నెలకు 2500 డాలర్ల నుండి 50 వేల డాలర్ల వరకు ఇస్తామని మెటా చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే.... నెలకు రూ. 2 లక్షల నుండి 43 లక్షల వరకు వస్తుందన్నమాట. అయితే, ఇది ఇండియాలో ఉండే వారికి కాదండోయ్... ఎందుకంటే అసలు ఇండియాలో టిక్ టాక్ యాప్ అనేదే లేదు.
అమెరికాలో ఉండే టిక్ టాక్ కంటెంట్ క్రియేటర్స్‌కు ఇన్స్టాగ్రామ్ ఈ ఆఫర్ ఇచ్చిందని ఇండియా టుడే వార్తా కథనం చెబుతోంది. కనీసం 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ కంటెంట్ క్రియేటర్స్‌కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 నెలల పాటు ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేయాల్సిందిగా వారికి మెటా సూచించిందా. వారి రీల్స్‌కు వచ్చే వ్యూస్, లైక్స్, రెస్పాన్స్ రేట్ ఆధారంగా 2500 డాలర్ల నుండి 50 వేల డాలర్ల వరకు ఇచ్చేందుకు మెటా కంపెనీ రెడీ అయింది. కనీసం 3 నెలల పాటు ఈ పని చేయగలిగే వారితోనే మెటా కంపెనీ ఈ అగ్రిమెంట్‌కు సిద్దమైనట్లు సమాచారం.
టిక్ టాక్‌ను దెబ్బ కొట్టేందుకు మెటా భారీ ప్లాన్
చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ అనే కంపెనీ తయారు చేసిన టిక్ టాక్ యాప్ కు అమెరికాలో భారీ రెస్పాన్స్ కనిపించింది. అమెరికాలో దాదాపు సగం మంది పౌరులు టిక్ టాక్ యాప్ వాడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే, జో బైడైన్ సర్కార్ దిగిపోయే ముందు ఈ టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించింది.
చైనాకు చెందిన ఈ యాప్‌తో అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందని బైడెన్ సర్కార్ ఆరోపించింది. ఆ కారణంతోనే యాప్‌పై నిషేధం విధించింది. అయితే, డోనల్డ్ ట్రంప్ సర్కార్ వచ్చాకా ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేశారు. టిక్ టాక్ యాప్ బిజినెస్‌లో అమెరికా వాటాలు తీసుకుని ఆ సమస్యకు చెక్ పెట్టనున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.
5) క్రికెట్ మహిళల వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్పై సెంచరీ.. ఎవరీ గొంగడి త్రిష?
Gongadi Trisha: అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష సెంచరీ నమోదు చేశారు. 53 బంతుల్లోనే ఆమె సెంచరీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గొంగడి త్రిష స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందారు. అండర్ 19 టీ 2 ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ఆమె రికార్డు సృష్టించారు.
ఎవరీ గొంగడి త్రిష?
తెలంగాణలోని భద్రాచలం లో 2005 డిసెంబర్ 15న త్రిష జన్మించారు. మూడో తరగతి నుంచే ఆమెకు క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు క్రికెట్ నేర్పించారు. కోచ్ వద్ద ఆమెకు క్రికెట్ లో మెళకువలు నేర్పించారు. అండర్ 16 జట్టులో ఆడి ఉమెన్ ఆఫ్ ది సిరీస్ గా ఆమె ఎంపికయ్యారు. అప్పటికి ఆమె వయస్సు ఎనిమిదేళ్లే. అండర్ 19 జట్లుకు ఆమె 12 ఏళ్ల వయస్సులో ఆడారు. గొంగడి త్రిష పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.
6) Donald Trump About India: డోనల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన.. అమెరికాలో ఉండే NRI లకు ఇది వార్నింగ్ అనుకోవాలా?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అమెరికన్స్‌కు పన్ను భారీగా తగ్గించి, విదేశాలపై భారీగా సుంకం పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు హానీ చేసే విదేశాలు, విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు చెప్పారు. అలా చెప్పే సందర్భంలో ఉదాహరణ కోసం చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల పేర్లు ప్రస్తావించారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి మూడు విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికన్స్‌ను ధనవంతులను చేయడం కోసం వారిపై ఇన్కమ్ టాక్స్ భారాన్ని తగ్గిస్తామని చెప్పడం. రెండోది విదేశాలపై, విదేశీయులపై ట్యాక్స్ భారాన్ని పెంచడం. ఇక మూడోది అమెరికాకు హానీ చేసే దేశాల పేర్లలో ఇండియా పేరు కూడా చెప్పడం. ఓవైపు భారత్‌తో స్నేహపూర్వక వైఖరి ఉంటుందని చెబుతూనే మరోవైపు అమెరికాను ఇబ్బంది పెట్టే దేశాల జాబితాలో ఇండియాను చేర్చడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే ఇప్పుడు అటు అమెరికాలో ఇటు ఇండియాలో హాట్ టాపిక్ అయింది.
అమెరికాకు హానీ చేయడం అంటే?
అమెరికా దృష్టిలో హానీ చేయడం అంటే తమ దేశ ప్రయోజనాలను దెబ్బ తీసేలా వ్యవహరించడమే అని అర్థం. ఉదాహరణకు అమెరికాకు చైనా అంటే ఎందుకంత కోపమంటే... అమెరికాలో అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫెంటానిల్ అనే డ్రగ్ చైనా నుండే తమ దేశానికి వస్తోందనేది అమెరికా చేస్తోన్న ఆరోపణ. చైనా నుండి ఫెంటానిల్ ముందుగా అమెరికా పొరుగు దేశాలైన కెనడాకు, మెక్సికో వెళ్తోందని, అక్కడి నుండి అక్రమ రవాణా మార్గాల్లో అమెరికాలోకి వస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటివరకు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ లైట్ తీసుకున్నారు కానీ నేనలా కాదని ట్రంప్ చెబుతున్నారు.
అమెరికా ప్రయోజనాలను చైనా దెబ్బతీస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే చైనా నుండి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుండి 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ గతంలోనే చెప్పారు. తాజాగా అమెరికాకు హానీ చేస్తోన్న దేశాల జాబితాలో చైనా పేరును కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మరి ఆ జాబితాలో ఇండియా పేరు ఎందుకు తీసుకొచ్చారనేదే ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ప్రశ్న.
ఇండియాపై డోనల్డ్ ట్రంప్ ఆరోపణలు
ఇండియాపై డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ 17న అమెరికాలో ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్‌పై తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. అమెరికా నుండి భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తోన్న దేశాల్లో భారత్ ముందుంది అన్నారు. భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకం వసూలు చేస్తున్నాయన్నారు. చైనా సంగతి అయితే ఇక చెప్పనక్కరేలేదన్నారు. ట్రంప్ చేస్తోన్న ఈ వ్యాఖ్యలు అమెరికాలో ఉండే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా యూరప్ దేశాల పట్ల ట్రంప్ వైఖరెలా ఉందో ఇప్పుడు చూద్దాం.
యూరప్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా ఉత్పత్తులపై ఎవ్వరు అధిక మొత్తంలో సుంకం వసూలు చేసినా... వారికి తను అధికారంలోకి వస్తే అదే ట్రీట్మెంట్ ఇస్తామని అన్నారు. అప్పుడు చెప్పినట్లుగానే ట్రంప్ ఇప్పుడు భారీగా సుంకం పెంచుతున్నట్లు ప్రకటనలు చేస్తూ విదేశాలను బెదిరిస్తున్నారు. యూరప్ దేశాలు కూడా అమెరికాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం లేదని డోనల్డ్ ట్రంప్ అన్నారు. అంతేకాదు... అధ్యక్ష బాధ్యతలు తీసుకోకముందే డొనల్డ్ ట్రంప్ యురొపియన్ యూనియన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా వద్ద ఆయిల్, గ్యాస్ కొనండి... లేదంటే అమెరికా వైపు నుండి అన్నివిధాలుగా సుంకం రూపంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అమెరికాలో ఉండే భారతీయుల పరిస్థితేంటి?
అమెరికా పౌరులపై ఇన్ కమ్ ట్యాక్స్ తగ్గించి వారు మళ్లీ ధనవంతులయ్యేలా చేస్తానని ట్రంప్ చెప్పారు. అందుకే అమెరికాకే తొలి ప్రాధాన్యమిస్తూ విదేశాలపై, విదేశీయులపై సుంకం పెంచనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో రెండు రిస్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఇండియా నుండి అమెరికా వెళ్లే ఉత్పత్తులపై భారీగా సుంకం పెంచడం వల్ల అమెరికా మార్కెట్‌నే లక్ష్యంగా వ్యాపారం చేసే భారతీయ వ్యాపారుల బిజినెస్ దెబ్బ తినడం.ఇక రెండోది ఏంటంటే... విదేశీయులపై కూడా సుంకం పెంచుతామని చెప్పడమంటే... అమెరికాలో ఉండే ఎన్నారైలు కూడా ఆ ప్రమాదంలో ఉన్నట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే కానీ జరిగితే... అమెరికాలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వెళ్లిన ఎన్నారైలు అక్కడ సంపాదించింది అక్కడే ట్యాక్సులు కట్టేందుకే సరిపోతుందేననే ఆందోళన వ్యక్తమవుతోంది.
పొమ్మనలేక పొగబెట్టడమేనా?
డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న విదేశీయులను పొమ్మనలేక పొగపెట్టినట్లే అవుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. విదేశీయులు భారీగా ట్యాక్సులు చెల్లించినా అది అమెరికా ఖజానాకే లాభం. ఒకవేళ అమెరికాలో విదేశీయులు ఉండలేక తమ సొంత దేశాలకు వెళ్లిపోయినా...మళ్లీ అమెరికా పౌరులకే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా అమెరికాకు ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా లాభమే కానీ వచ్చిన నష్టమేమీ లేదనేది మేధావుల అభిప్రాయం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire