Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి ఎక్కువ అవసరం... ఎందుకంటే...

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి ఎక్కువ అవసరం... ఎందుకంటే...
x
Highlights

Delhi Assembly Elections 2025 Political scenario explained: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే ప్రచారం తార స్థాయికి చేరింది. ఆపద...

Delhi Assembly Elections 2025 Political scenario explained: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే ప్రచారం తార స్థాయికి చేరింది. ఆపద నుంచి బయటపడాలంటే దిల్లీ వాసులు ఆప్ ను ఓడించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దిల్లీ అభివృద్ధిపై బీజేపీకి స్పష్టమైన విజన్ లేదని ఆప్ విమర్శలు చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో తన సత్తాను చాటిన కమలం పార్టీకి హస్తిన మాత్రం అందకుండా పోతోంది. మోదీ, అమిత్ షా మంత్రాంగం చేసినా పదేళ్లు అధికారం దక్కలేదు.

ఇక త్వరలో జరిగే ఎన్నికల్లో దిల్లీ పీఠం దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోసారి హస్తినలో ప్రత్యర్థులపై పట్టు సాధిస్తామని ఆప్ ధీమాగా ఉంది. అసలు దిల్లీలో పట్టు కోసం బీజేపీ ఎలాంటి స్ట్రాటజీలతో వస్తుంది? కమలం ఎత్తులకు ఆప్ ఎలాంటి పై ఎత్తులు వేస్తోంది? దిల్లీ ఓటర్ల నాడి ఎలా ఉందనే విషయాలను ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

దిల్లీలో హోరాహోరీ

దిల్లీ అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరి 23తో ముగియనుంది. దీంతో 2025 జనవరి రెండో వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. బీజేపీ, ఆప్ మధ్య ప్రచార యుద్దం పతాక స్థాయికి చేరుకుంది.

కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ చార్జీషీట్ విడుదల చేసింది. ఆప్ పాలనలో దిల్లీ కుంభకోణాలకు నిలయంగా మారిందని ఆ పార్టీ ఆరోపించింది. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పి స్కామ్ లు చేశారని బీజేపీ విమర్శలు చేసింది. ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆ పార్టీ ఫెయిలైందని ఆరోపించింది.

బీజేపీ విమర్శలకు తగ్గేదేలేదన్నట్టు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కౌంటరిచ్చారు. ఐదేళ్లలో బీజేపీ దిల్లీకి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.శాంతిభద్రతలు క్షీణించినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.విద్యుత్, మంచినీరు, మహిళలకు ఉచిత ప్రయాణం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో తమ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన వివరించారు. మరోవైపు పోస్టర్లు, సోషల్ మీడియాలో కూడా రెండు పార్టీల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరింది.

దిల్లీలో గెలుపు బీజేపీకి ఎందుకంత ముఖ్యం?

దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ పక్షాలు అధికారంలో ఉన్నాయి. కానీ, దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పాగా వేయలేకపోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గాలి వీచినా.. అసెంబ్లీ ఎన్నికలనాటికి ఫలితాలు తిరగబడుతున్నాయి. ఇదే బీజేపీని వేధిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజధాని ప్రాంతం ఉన్న రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉండడం ఆ పార్టీని కలవరపెడుతోంది.

దిల్లీకి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, రాజకీయ నాయకులు తరచుగా వస్తుంటారు.అయితే అలాంటి రాష్ట్రంలో తాము కాకుండా ఓ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండడం కూడా బీజేపీకి రాజకీయంగా ఇబ్బందిపెడుతోందనే విశ్లేషణలున్నాయి.ప్రధాని పదవి రేసులో కేజ్రీవాల్ పేరు కూడా వినిపిస్తోంది. దిల్లీలో ఆప్ ను ఓడిస్తే కేజ్రీవాల్ ను ఈ రేసు నుంచి తప్పించవచ్చు. దిల్లీతో పాటు పంజాబ్ లో కూడా ఆప్ అధికారంలో ఉంది. ఆప్ దిల్లీలో అధికారంలో కొనసాగితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ విస్తరించే అవకాశాలున్నాయని రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. అందుకే ఆప్ ను దిల్లీలో ఓడించడం బీజేపీకి రాజకీయ అవసరమని ఆయన అన్నారు.

దిల్లీలో వికసించని కమలం

నరేంద్ర మోదీ 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీ ప్రభావంతో చాలా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని విశ్లేషణలున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా దిల్లీలోని ఎంపీ సీట్లన్నీ కమలం ఖాతాలోనే పడ్డాయి. 2014 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో దిల్లీలోని ఏడు ఎంపీ సీట్లు బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చతికిలపడింది.

2015లో ఆప్ 67 సీట్లలో గెలిస్తే బీజేపీకి మూడు సీట్లే దక్కాయి. 2020లో కూడా సేమ్ సీన్ రిపీటైంది.ఆప్ 62 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. ఇక వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

నాలుగోసారి కేజ్రీవాల్ సీఎం అవుతారా?

అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం నుంచి ఆప్ రాజకీయ పార్టీ ఏర్పాటైంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. బీజేపీకి 31 సీట్లు దక్కాయి. మేజిక్ ఫిగర్ కు కమలం పార్టీకి ఐదు సీట్ల దూరంలో నిలిచింది. అప్పుడు కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారిగా 2013 డిసెంబర్ 28న సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఈ ప్రభుత్వం ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. 49 రోజులే ఆయన సీఎంగా ఉన్నారు. 2014 ఫిబ్రవరిలో తన పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు రాలేదు. కానీ, ఏడాది తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 67 సీట్లను కట్టబెట్టారు దిల్లీ ఓటర్లు. 2020లో కూడా మరోసారి ఆప్ అధికారంలోకి వచ్చింది. దిల్లీ లిక్కర్ స్కాంలో జైలు నుంచి విడుదలైన తర్వాత 2024 సెప్టెంబర్ లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే కేజ్రీవాల్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

లిక్కర్ స్కాం ప్రభావం- దిల్లీ ఎన్నికలు

దిల్లీ లిక్కర్ స్కాం దేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలను ఓ కుదుపు కుదిపేసింది. దిల్లీలో లిక్కర్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా,మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ కేసులో అరెస్టై ఐదు నెలలు జైల్లో గడిపారు. లిక్కర్ స్కాంలో ఆప్ నకు 100 కోట్ల ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. ఈ నిధులను గోవా ఎన్నికలకు ఉపయోగించారని ఆ సంస్థలు ఆరోపించాయి.

అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆప్ పాలనలో జరిగిన అవినీతి అంటూ సోషల్ మీడియాలో, పోస్టర్ల రూపంలో ప్రచారం చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా తన ఇంటికి వందల కోట్లతో మరమ్మతులు చేసుకొని అద్దాలమేడ నిర్మించుకున్నారని బీజేపీ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. దిల్లీలో వందల కోట్ల పథకాలకు మోదీ డిసెంబర్ 3న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆపద నుంచి దిల్లీ బయటపడాలంటే ఆప్ అధికారం కోల్పోవాలన్నారు.మార్పు కోసం ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు.

ఈసారి గెలిచేదెవరు?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఈ సారి బీజేపీ, ఆప్ నకు ముఖ్యమే. కేజ్రీవాల్ పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేసింది. దిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. దళితులు, మైనార్టీలు ఆ పార్టీకి కొంత దూరమయ్యారనే విశ్లేషణలున్నాయి. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలు కొంత ఆ పార్టీని బలహీనం చేశాయనే వాదనలు కూడా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ కూడా ఆప్ పై విమర్శలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అదే సమయంలో ఆప్ పై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. బీజేపీ కూడా అన్ని అస్త్రాలను తమకు అనుకూలంగా మలుచుకుంటుంది.ఈసారి దిల్లీ పీఠం దక్కించుకోవాలని వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందుకోసం పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరి, దిల్లీ ఓటర్ల మనసులో ఏముంది? ఆప్ కే మళ్ళీ పట్టం కడతారా... కాషాయానికి దారిస్తారా… అన్నది వేచి చూడాల్సిందే ( Who will be the next Delhi CM ).

Show Full Article
Print Article
Next Story
More Stories