TOP 6 NEWS @ 6PM: విజయ్ సాయి రెడ్డి రాజీనామాపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
1) విజయసాయి రెడ్డికి జగన్ ఎంత చెబితే అంత - వైఎస్ షర్మిల విజయసాయి రెడ్డి వైసీపీని వీడటం, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించడంపై ఏపీ కాంగ్రెస్...
1) విజయసాయి రెడ్డికి జగన్ ఎంత చెబితే అంత - వైఎస్ షర్మిల
విజయసాయి రెడ్డి వైసీపీని వీడటం, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి ఇకనైనా ప్రజలకు వాస్తవాలు చెబితే బాగుంటుందని షర్మిల అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా చెబితే అలా వినే విజయసాయి రెడ్డి ఇవాళ ఆ పార్టీకి దూరం జరిగారంటే ఇది మామూలు విషయం కాదన్నారు. వ్యక్తిగతంగానైనా, రాజకీయంగానైనా... వైఎస్ జన్ చెప్పినట్లు వింటూ ఆ పని చేసి పెట్టడమే ఇన్నాళ్లు విజయసాయి రెడ్డి చేసిన పని అన్నారు.
"జగన్ తిట్టమని చెబితే విజయసాయి రెడ్డి ఎవరినైనా తిడతారు. అబద్దాలు చెప్పమని చెబితే అబద్దాలు చెబుతారు. అలాంటి విజయసాయి రెడ్డి జగన్‌ను కాదని పార్టీలోంచి బయటికి రావడమేంటి" అని షర్మిల అనుమానం వ్యక్తంచేశారు. జగన్ కోసం ప్రాణంపెట్టే వారు ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారంటే ఆయనపై విశ్వాసం కోల్పోయినట్లేనని షర్మిల అభిప్రాయపడ్డారు.
2) Vijaysai Reddy: జగన్ తో మాట్లాడిన తర్వాతే రాజీనామా
Vijaysai Reddy: జగన్ తో మాట్లాడిన తర్వాతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా అందించిన తర్వాత ఆయన న్యూదిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను రాజీనామా చేయవద్దని కూడా జగన్ కోరారన్నారు.తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని జగన్ సూచించారన్నారు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారన్నారు. కేసుల మాఫీ కోసం తాను రాజీనామా చేశానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినందున తాను భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన అన్నారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.తనలాంటి వాళ్లు వెయ్యి మంది వైఎస్ఆర్‌సీపీ నుంచి బయటు వెళ్లినా జగన్ కు ఉన్న ప్రజాదరణ తగ్గదని ఆయన అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు.తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అప్రూవర్ గా మారలేదని ఆయన అన్నారు. తనపై కేసులు మాఫీ చేయించుకునేందుకు రాజీనామా చేయలేదని ఆయన అన్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. 2011 ఆగస్టులో తనపై కేసులు పెట్టారని విజయసాయి రెడ్డి చెప్పారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విక్రాంత్ రెడ్డిని కేవీరావు వద్దకు తాను పంపానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.
చెన్నైలో ఉన్నప్పటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ తో పరిచయం ఉందన్నారు. చంద్రబాబుతో రాజకీయంగా విబేధించినట్టు ఆయన తెలిపారు. కానీ, ఈ ఇద్దరితో వ్యక్తిగతంగా తనకు శత్రుత్వం లేదన్నారు. పార్టీలో తన ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేదని ఆయన అన్నారు.
3) మంత్రి సీతక్క డ్యాన్స్.. వీడియో వైరల్
Minister Sitakka Steps to Dj Tillu Song With Mulugu Students: ములుగులో రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీత డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 3K రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేసి అక్కడున్న యువతీ, యువకుల్లో జోష్ నింపారు.
ములుగు 3K రన్లో డీజే టిల్లు పాటకు డాన్స్ చేసిన మంత్రి సీతక్క pic.twitter.com/N7V3391zdJ
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
మంత్రి సీతక్క డ్యాన్స్‌కు ఫిదా అయిన అక్కడ వారు చప్పట్లు, ఈలలతో అభినందించారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి సీతక్క.. విద్యార్థులు, యువకులతో కలిసి సరదాగా గడిపారు. ప్రస్తుతం సీతక్క డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
4) ప్రభాస్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న నిధి అగర్వాల్
Nidhi Agarwal Interesting Comments On Rajasaab: నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నిధి.. తన క్యూట్ అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది. సవ్యసాచి సక్సెస్ కాకపోయినప్పటికీ నిధి అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ ఇస్మార్ శంకర్ మినహా మరే చిత్రం ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. సక్సెస్ లేకపోయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తోంది. పవన్ సరసన హరిహర వీరమల్లులో, ప్రభాస్‌తో రాజాసాబ్‌లోనూ నటిస్తున్నారు. ఇవి రెండూ పాన్ ఇండియా సినిమాలే.
అయితే ఈ సినిమాల నుంచి ఎప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ రాజాసాబ్ సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలను ఆశిస్తుంటారు. నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని భావిస్తారు.
అయితే రాజాసాబ్ తో మాత్రం ప్రజలు ఖచ్చితంగా నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారని అనిపిస్తుందన్నారు. ఈ సినిమాలో నా పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పగలనన్నారు. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ మొదటిసారి హర్రర్ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం నిధి చేసిన కామెంట్స్ రాజాసాబ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.
5) World Economic Forum: దావోస్‌లో 20 లక్షల కోట్లు సంపాదించిన భారత్.. ఆశ్చర్యపోయిన 130 దేశాలు..!
World Economic Forum: వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో (WEF) జరిగిన ఐదు రోజుల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార రంగ ప్రముఖుల నుంచి 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను పొందడంలో సక్సెస్ అయింది. ఇందులో మహారాష్ట్రకు అత్యధికంగా దాదాపు 80శాతం వాటా ఉంది. ఈ భారీ పెట్టుబడులు ప్రపంచంలోని 130 దేశాలను ఆశ్చర్యపరిచాయి.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐదుగురు కేంద్ర మంత్రులతో పాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అతిపెద్ద భారతీయ ప్రతినిధి మండలి ఈ సమావేశానికి నాయకత్వం వహించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) అమెరికాలో ట్రంప్ భయానికి పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్... ఎందుకంటే..
Indian students in America: అమెరికాలో డోనల్డ్ ట్రంప్ అక్రమవలసదారులను సొంత దేశాలకు పంపించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్తగా దేశంలోకి వచ్చే వారిపై నియమ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమవలసదారులను గుర్తించే పనిలో అమెరికా ప్రభుత్వం బిజీ అయింది. దీంతో అమెరికాలో మాస్టర్స్ చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ విడిచిపెడుతున్నట్లు ఎన్డీటీవీ వార్తా కథనం చెబుతోంది.
"అమెరికాలో బతకాలంటే పార్ట్ టైమ్ జాబ్స్ తప్పనిసరి అవసరం. ఊర్లో అప్పులు చేసో లేక పొలాలు అమ్మేసుకునో మాస్టర్స్ డిగ్రీ కోసం, అమెరికాలో భవిష్యత్ కోసం ఇక్కడి వరకొచ్చాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిబంధనలు అతిక్రమించి రిస్క్ తీసుకోలేం" అని ఇండియన్ స్టూడెంట్స్ చెప్పినట్లుగా ఆ కథనం వెల్లడించింది.
జనవరి 20న డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటివరకు అమెరికాలో మాస్టర్స్ చదువుకుంటున్న ఫారెన్ స్టూడెంట్స్ ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యప్పీగా పనిచేసుకున్నారు. కానీ జనవరి 20న ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే ట్రంప్ దాదాపు 80 వరకు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో అక్రమవలదారులను వారి సొంత దేశాలకు వెనక్కు పంపించే పాలసీ కూడా ఉంది. ఆ తరువాతి నుండే అమెరికాలో ఉంటున్న అక్రమవలసదారులకు, చదువకోవడానికి వెళ్లిన విద్యార్థులకు టెన్షన్ మొదలైంది.
పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో అమెరికా రూల్స్ ఏం చెబుతున్నాయి? అమెరికాలో చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇది F-1 వీసా రూల్. అయితే, ఆ మాత్రమే పనిచేస్తే తమ అవసరాలకు డబ్బులు సరిపోవనే ఉద్దేశంతో చాలామంది విదేశీ విద్యార్థులు ఎంత వీలైతే అంతసేపు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటుంటారు.
రెస్టారెంట్స్, గ్యాస్ స్టేషన్స్, రీటేల్ స్టోర్స్, కేర్ టేకర్స్... ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారానికి ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ఎక్కువే పనిచేస్తుంటారు. కానీ ఇప్పుడలా పరిమితికి మించి పనిచేయడానికి వారు ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోననే భయమే వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
గంటకు 7 డాలర్లు... రోజూ 6 గంటలు పని ఇల్లినాయిస్‌లో ఉండే అర్జున్ అనే స్టూడెంట్ తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పినట్లుగా ఆ కథనంలో ఉంది. గతంలో తను ఒక చిన్న కేఫ్‌లో రోజుకు 6 గంటలు పనిచేసే వాడిని. గంటకు 7 డాలర్లు ఇచ్చే వారు. కానీ ఇమ్మిగ్రేషన్ రూల్స్ టైట్ అవడంతో గత వారమే తాను ఆ పని మానేశాను. ఎందుకంటే అనధికారికంగా పనిచేసే వారిని ప్రభుత్వం గుర్తించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే అమెరికాలో మాస్టర్స్ చదువుకోవడం కోసం తను 42 లక్షలకుపైనే అప్పుచేశాను. ఆ అప్పు తీర్చాలంటే తను కెరీర్‌ను మరో రిస్క్‌లో పెట్టలేను అని అర్జున్ చెప్పినట్లు ఆ వార్తా కథనం స్పష్టం చేసింది.
ఇది ఒక్కరి సమస్య కాదు.. ఇది ఒక్క అర్జున్ సమస్య మాత్రమే కాదు... అమెరికాలో చదువుకునేందుకు అప్పు చేసి అక్కడికి వెళ్లిన అనేక మంది విదేశీ విద్యార్థుల సమస్య ఇది. "పనిచేసే చోట తనిఖీలు జరిగే ప్రమాదం ఉంది. అక్కడ తాము పరిమితికి మించిన పనివేళలు పనిచేస్తున్నామని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తే... స్టూడెంట్ వీసాను రద్దు చేస్తుంది" అని ఇండియన్ స్టూడెంట్స్ భయపడుతున్నారు. అదే కానీ జరిగితే ఆ తరువాత స్టూడెంట్ వీసా రద్దయిన వారు కూడా అక్రమ వలసదారుల జాబితాలోకే వస్తారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్రమవలసదారులను దేశం నుండి పంపించాల్సి వస్తే... అందులో తమ పేరు లేకుండా చూసుకోవాలనేది ఇండియన్ స్టూడెంట్స్ అభిప్రాయం.
అమెరికాలో పరిస్థితులు చక్కబడే వరకు తాము పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో రూల్స్ అతిక్రమించకుండా ఇండియన్ స్టూడెంట్స్ జాగ్రత్తపడుతున్నారు. అందుకే వారు వారానికి 20 గంటలకు మించి పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమ్మనాన్నల్ని అడగలేక
"ఎక్కువ పని గంటలు పనిచేయడం మానేశాక డబ్బులకు ఇబ్బంది అవుతోంది. ఇప్పటికే దాచుకున్న డాలర్లు కూడా ఖర్చయిపోయాయి. రూమ్ మేట్స్ వద్ద అప్పు చేస్తున్నా. ఇప్పుడు అమ్మనాన్నల్ని అడగాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. కానీ ఇంకొన్ని రోజులకైనా ఆ పని చేయక తప్పేలా లేదు. ఇలా ఎన్ని రోజులు నెట్టుకురావాలో అర్థం కావడం లేదు". ఇది మరో విద్యార్థి ఆవేదన.
ఆ 18000 మంది పరిస్థితి ఏంటి?
ఇప్పటికే అమెరికాలో ప్రాథమిక జాబితా ప్రకారం 18000 మందికిపైగా భారతీయులు అక్కడ అక్రమంగా వలస ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వారిని అమెరికా పంపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు భారత్ కూడా అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని వెనక్కు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, వారు అసలు భారత్‌కు చెందిన వారేనా కాదా అనే వివరాలు చెక్ చేసుకున్న తరువాతే ఆ పని చేస్తామని భారత్ చెబుతోంది. మొత్తానికి అమెరికాలో అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ రాక అక్కడుంటున్న భారతీయులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire