Frog Man: ఈయన మనిషా? లేక కప్పా? గాలి ఊది ఊది బుగ్గలు బుడగల్లా మార్చుకున్న వైనం!

Frog Man
x

Frog Man: ఈయన మనిషా? లేక కప్పా? గాలి ఊది ఊది బుగ్గలు బుడగల్లా మార్చుకున్న వైనం!

Highlights

Frog Man : ప్రకృతిలో కప్పలు గాలిని పూరించుకుని బుగ్గలను ఎలా ఉబ్బేస్తాయో మనం చూసే ఉంటాం. కానీ, ఒక మనిషి బుగ్గలు కూడా అచ్చం కప్పలాగే ఉబ్బిపోతే? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.

Frog Man: ప్రకృతిలో కప్పలు గాలిని పూరించుకుని బుగ్గలను ఎలా ఉబ్బేస్తాయో మనం చూసే ఉంటాం. కానీ, ఒక మనిషి బుగ్గలు కూడా అచ్చం కప్పలాగే ఉబ్బిపోతే? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలో ఒక వ్యక్తి ఏకంగా 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా చేసిన పని వల్ల అతని ముఖం ఆకృతి పూర్తిగా మారిపోయింది. గాలిని గట్టిగా ఊదడమే వృత్తిగా చేసుకున్న ఈ వ్యక్తి బుగ్గలు ఇప్పుడు బుడగల్లా వేలాడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫ్రాగ్ మ్యాన్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల జాంగ్ ఒక గాజు తయారీ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత మూడు దశాబ్దాలుగా అతను గాజు వస్తువులను తయారు చేసే పనిలో ఉన్నాడు. ఈ వృత్తిలో భాగంగా, కరిగిన గాజును పైపు ద్వారా గట్టిగా ఊదుతూ దానికి ఒక ఆకృతిని తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా 30 ఏళ్ల పాటు రోజుకు వందల సార్లు గాలిని బలంగా ఊదడం వల్ల అతని ముఖ కండరాలు విపరీతంగా సాగిపోయాయి. ఫలితంగా అతను గాలి ఊదినప్పుడు అతని బుగ్గలు అచ్చం కప్పలాగే బయటకు పొడుచుకువస్తాయి.

జాంగ్ పనిచేసే చోట అతన్ని అందరూ ముద్దుగా పెద్ద నోరున్న అన్నయ్య అని పిలుచుకుంటారు. జాంగ్ కూడా తన పరిస్థితిని చూసి బాధపడకుండా, సరదాగా తనను తాను ఫ్రాగ్ ప్రిన్స్ అని పిలుచుకుంటాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. జాంగ్ సుమారు 1.5 మీటర్ల పొడవైన లోహపు పైపును ఉపయోగించి, 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడెక్కిన గాజును ఊదుతూ కనిపిస్తాడు. ఆ సమయంలో అతని బుగ్గలు ఒక ఫుట్‌బాల్‌లా ఉబ్బిపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

జాంగ్ చెబుతున్న దాని ప్రకారం.. అతను పనిలో చేరిన కొత్తలో అతని ముఖం అందరిలాగే మామూలుగా ఉండేది. కానీ, గాజును ఊదడానికి అవసరమైన విపరీతమైన పీడనం వల్ల క్రమంగా బుగ్గల్లోని కండరాలు పట్టు కోల్పోయాయి. వేడి వాతావరణంలో, చొక్కా కూడా లేకుండా నిరంతరం శ్రమిస్తూ అతను తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. కండరాలు సాగిపోవడం వల్ల ఇప్పుడు అతను గాలి ఊదకపోయినా, అతని బుగ్గలు కొంచెం వదులుగానే కనిపిస్తాయి.

ఈ వీడియో చూసిన కొందరు మొదట నవ్వినా, జాంగ్ వెనుక ఉన్న కష్టాన్ని చూసి ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఇది చూసి నవ్వడానికి ఏమీ లేదు, ఒక కుటుంబం కోసం అతను పడ్డ కష్టం మనకు కనిపిస్తోంది" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "అతను ఒక గొప్ప కళాకారుడు.. తన వృత్తి కోసం తన రూపాన్నే త్యాగం చేశాడు" అని మరొకరు కొనియాడారు. కష్టపడి పని చేసే వ్యక్తికి దక్కిన గుర్తింపుగా జాంగ్‌ను ఇప్పుడు అందరూ గౌరవిస్తున్నారు. ఏదేమైనా జాంగ్ బుగ్గలు మాత్రం నెటిజన్లకు ఒక వింతలా అనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories