Viral : ఆకాశంలో వింతలు చూశాం.. కానీ ఇండిగో వెబ్‌సైట్‌లో ఈ జీరో వింత ఏంటి సామీ?

Viral : ఆకాశంలో వింతలు చూశాం.. కానీ ఇండిగో వెబ్‌సైట్‌లో ఈ జీరో వింత ఏంటి సామీ?
x
Highlights

ఆకాశంలో వింతలు చూశాం.. కానీ ఇండిగో వెబ్‌సైట్‌లో ఈ జీరో వింత ఏంటి సామీ?

Viral : ఆన్‌లైన్ షాపింగ్ చేసినా, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినా మనందరి కళ్లు కూపన్ కోడ్ బాక్స్‌పైనే ఉంటాయి. ఏదో ఒక కోడ్ తగిలించి నాలుగు పైసలు ఆదా చేద్దామని తాపత్రయపడతాం. కానీ ఒక ప్రయాణికుడికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇచ్చిన కూపన్ ఆఫర్ చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. భారీ డిస్కౌంట్ వస్తుందని ఆశపడి కూపన్ అప్లై చేస్తే.. స్క్రీన్ మీద వచ్చిన మెసేజ్ చూసి ఆ కస్టమర్ మైండ్ బ్లాక్ అయ్యింది. సాధారణంగా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో టికెట్ బుక్ చేసేటప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. అమిత్ అగర్వాల్ అనే ప్రయాణికుడు ఇండిగో వెబ్‌సైట్‌లో ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తూ, డిస్కౌంట్ కోసం FLYMORE అనే కూపన్ కోడ్‌ను ఉపయోగించాడు. సాధారణంగా ఈ కోడ్ వాడితే కొంత డబ్బు తగ్గుతుంది. కానీ అమిత్ కేసులో సీన్ రివర్స్ అయ్యింది. కోడ్ అప్లై చేయగానే స్క్రీన్ మీద Congratulations! You have saved ₹0.0 అని మెసేజ్ వచ్చింది. అంటే కూపన్ పని చేసింది కానీ, తగ్గించిన రూపాయి మాత్రం సున్నా!

ఈ వింత అనుభవాన్ని చూసి అమిత్ షాక్ అవ్వడమే కాకుండా, నవ్వుకుంటూ ఆ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశాడు. ఇండిగోను ట్యాగ్ చేస్తూ.. "అభినందనలు! మీ దగ్గర నేరుగా బుక్ చేసుకున్నందుకు 0.0 రూపాయలు ఆదా చేశాను. ఇండిగో గారు, మీ ధారాళతకు ధన్యవాదాలు!" అంటూ సెటైర్లు వేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? లైకులు, కామెంట్లతో రెచ్చిపోయారు. ఇప్పటివరకు ఈ పోస్ట్‌ను దాదాపు 1.91 లక్షల మంది వీక్షించగా, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.

విషయం కాస్త ముదిరి వైరల్ అవ్వడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ రంగంలోకి దిగింది. ట్వింకిల్ అనే ప్రతినిధి అమిత్ పోస్ట్‌కు బదులిస్తూ.. "హాయ్, ఇలా జరిగినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి, మేము ఈ సమస్యను తనిఖీ చేస్తాము. మీ కాంటాక్ట్ వివరాలు, PNR నంబర్‌ను మాకు పంపండి" అని కోరింది. ఇది ఒక సాంకేతిక లోపం కావచ్చని, సిస్టమ్ అప్‌డేట్ సమయంలో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లు చదువుతుంటే నవ్వు ఆపుకోవడం కష్టం. "తమ్ముడూ.. ఆ మిగిలిన సున్నా రూపాయలతో ఒక కొత్త ఇల్లు కొనుక్కో!" అని ఒకరు, "ఇండిగో వాళ్ళు చాలా పద్ధతిగా జోక్ చేశారు" అని మరొకరు కామెంట్ చేశారు. "ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇస్తే ఇండిగో దివాలా తీయదా?" అని మరికొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా, ఆన్‌లైన్ సిస్టమ్స్ లో ఇలాంటి చిన్నా చితకా లోపాలు అప్పుడప్పుడు ప్రయాణికులకు చిరాకు తెప్పించినా, సోషల్ మీడియాకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories