
Gerhard Schug Story
కోమాలోకి వెళ్లిన గెర్హార్డ్ షుగ్ అనే వ్యక్తి తాను నరకాన్ని చూశానని, అక్కడ సైతాన్ ఆత్మలను హింసించడం కళ్లారా చూశానని చెప్పిన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది
Viral : స్వర్గం, నరకం అనేవి నిజంగానే ఉన్నాయా? చనిపోయాక మనిషి ఎక్కడికి వెళ్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరు. సరిగ్గా ఇలాంటి వింత అనుభవాన్నే ఎదుర్కొన్న గెర్హార్డ్ షుగ్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. 2020లో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించిన గెర్హార్డ్, ఐదు రోజుల పాటు కోమాలో ఉన్నాడు. తిరిగి స్పృహలోకి వచ్చాక తను చూసిన నరకపు దృశ్యాలను వివరించి అందరినీ హడలెత్తించాడు. తను నేరుగా సైతాన్ పక్కనే నిలబడ్డానని, అక్కడ ఆత్మలు పిండిపిండి అవ్వడం కళ్లారా చూశానని ఆయన చెబుతున్న మాటలు వింటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది.
అసలేం జరిగిందంటే.. 2019లో తన కూతురు చనిపోవడంతో గెర్హార్డ్ తీవ్రమైన ఒంటరితనంలోకి వెళ్లిపోయాడు. దానికి తోడు వెన్నెముక గాయం, పార్కిన్సన్స్, ఊపిరితిత్తుల వ్యాధి, డిప్రెషన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. మరణం తర్వాత మరో జీవితం ఉంటుందన్న నమ్మకంతో, ఈ బాధల నుంచి విముక్తి పొందాలని తను ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ విధి మరోలా ఉంది. ఆత్మహత్యాయత్నం తర్వాత ఐదు రోజుల పాటు చావుబతుకుల మధ్య కోమాలో ఉన్న గెర్హార్డ్, తిరిగి బతికాడు. అయితే ఆ ఐదు రోజులు తను ఒక భయంకరమైన లోకాన్ని చూశానని ఆయన అంటున్నాడు.
మిర్రర్ నివేదిక ప్రకారం.. గెర్హార్డ్ తన అనుభవాన్ని వివరిస్తూ, "నేను చనిపోయాక చాలామంది చెప్పినట్టు వెలుగునైతే చూడలేదు, పైగా అంతా చీకటిగా, భయంకరంగా ఉంది" అని చెప్పాడు. తను చూసిన నరకంలో రాళ్లతో కట్టిన ఒక భారీ రాజభవనం ఉందట. దాని పైకప్పు చైనా లేదా జపాన్ కట్టడాల మాదిరిగా చాలా ఎత్తుగా ఉంది. అక్కడ ఒక సింహాసనంపై కొమ్ములున్న సైతాన్ కూర్చుని ఉన్నాడట. ఆ భవనం పక్కనే సముద్రం లాంటి ప్రదేశం ఉందని, అక్కడికి పడవల ద్వారా ఆత్మలను సైతాన్ ముందుకు తీసుకొస్తున్నారని గెర్హార్డ్ వివరించాడు. తనను కూడా అలాగే సైతాన్ దగ్గరకు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నాడు.
అక్కడ దృశ్యాలు ఇంకా దారుణంగా ఉన్నాయట. ఆ భవనం నేల మీద సింహం పంజాల మాదిరిగా ఉండే నాలుగు పెద్ద రాళ్లు ఉన్నాయని, అవి తిరుగుతున్నప్పుడు భయంకరమైన శబ్దాలు వస్తాయని ఆయన చెప్పాడు. సైతాన్ దగ్గరకు తెచ్చిన ఆత్మలలో కొన్నిటిని ఎంచుకుని, ఒక గరాటు లాంటి దానిలో వేసి ఆ రాళ్ల కింద పిండి చేస్తున్నారట. అక్కడ విపరీతమైన వేడి, భరించలేని అరుపులు ఉన్నాయని, ఆ దృశ్యం చూసి తను వణికిపోయానని గెర్హార్డ్ గుర్తు చేసుకున్నాడు. ఐదు రోజుల కోమా కాలం తనకి ఐదు ఆరేళ్ల నరకయాతనలా అనిపించిందన్నాడు. కోమా నుంచి బయటకు వచ్చాక గెర్హార్డ్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన జీవితాన్ని చాలా పాజిటివ్‌గా చూస్తున్నాడు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడే వెళ్తానని, అప్పటివరకు ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




