Viral Video: వ్యూస్ కోసం వింత చేష్టలు.. అన్నంలో జ్యూస్, చాక్లెట్ ఏంటి? ఈ వంట తింటే యమలోకానికి నేరుగా టికెట్టే

Viral Video
x

Viral Video: వ్యూస్ కోసం వింత చేష్టలు.. అన్నంలో జ్యూస్, చాక్లెట్ ఏంటి? ఈ వంట తింటే యమలోకానికి నేరుగా టికెట్టే

Highlights

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య వింత వింత వంటకాలు పుట్టుకొస్తున్నాయి. వంటలో ప్రయోగాలు చేయడం మంచిదే కానీ, మరీ ఇంత దారుణంగానా? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య వింత వింత వంటకాలు పుట్టుకొస్తున్నాయి. వంటలో ప్రయోగాలు చేయడం మంచిదే కానీ, మరీ ఇంత దారుణంగానా? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. గతంలో మనం ఫాంటా ఆమ్లెట్, చాక్లెట్ బిర్యానీ వంటివి చూశాం. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. మీకు తిన్న తిండి అరగడం కష్టమే. అన్నంలో చాక్లెట్, కోడిగుడ్లు, టమోటాలు, జ్యూస్.. ఇలా దేనికీ సంబంధం లేని పదార్థాలన్నీ కలిపేసి ఒక వింత పదార్థాన్ని తయారు చేసింది ఒక మహిళ. ఈ వీడియో చూసిన నెటిజన్లు "అన్నం పరబ్రహ్మ స్వరూపం.. దాన్ని ఇలా నాశనం చేస్తారా?" అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక పాన్ లో ఉన్న ఉడికించిన అన్నంతో మొదలవుతుంది. మొదట చూసినప్పుడు ఆ మహిళ ఏదో ఫ్రైడ్ రైస్ చేస్తోందని అందరూ అనుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. ఆమె ఆ అన్నంలోకి చాక్లెట్ ముక్కలను తుంపి వేయడం ప్రారంభించింది. అక్కడితో ఆగితే బాగుండేది.. కానీ ఆ తర్వాత ఆమె అందులో కోడిగుడ్లను కొట్టి పోసింది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతుండగానే, మరిన్ని టమోటాలను కోసి అందులో వేసింది. ఇక ఆ వంటకాన్ని చూస్తేనే ఒక రకమైన వికారపు ఫీలింగ్ కలుగుతుంది.



ప్రయోగాలు అక్కడితో అయిపోలేదు. ఆ మహిళ ఆ మిశ్రమంలోకి జ్యూస్ పోసింది. అప్పటికీ ఆమె మనసు తృప్తి చెందలేదు కాబోలు.. ఒక గ్లాసు పాలు, ఒక ప్యాకెట్ నిండా చక్కెరను కూడా అందులో కుమ్మరించేసింది. చాక్లెట్ తీపి, టమోటా పులుపు, కోడిగుడ్డు నీచు వాసన, పాలు.. ఇవన్నీ కలిస్తే అది వంట అవుతుందా లేక విషం అవుతుందా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వింత కాంబినేషన్లు కేవలం వ్యూస్ కోసమే చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు.

ఈ వింత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో mainswayamhoon అనే ఐడి నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా 70 లక్షల మందికి పైగా వీక్షించారు. సుమారు 90 వేల మంది లైక్ చేయగా, వేల సంఖ్యలో కామెంట్లతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. "దీన్ని అసలు మనుషులు తింటారా?" అని ఒకరు అడిగితే, "అన్నం మీద కోపం ఉంటే పడేయండి కానీ ఇలాంటి పనులు చేయకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "దీనికి ఏమని పేరు పెడదాం? టమోటా చాక్లెట్ పాయసమా?" అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడం కోసం, కొందరు క్రియేటర్లు ఇలాంటి అసహ్యకరమైన ప్రయోగాలు చేస్తూ ఆహారాన్ని వృధా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలో ఎంతోమంది ఆకలితో అలమటిస్తుంటే, ఇలా అన్నంతో చెలగాటం ఆడటం సరైనది కాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories