Atla Taddi 2025: రేపే అట్లతద్ది... మన తెలుగింటి ఆడపడుచుల నోము - పూజా విధానం, కథ!

Atla Taddi 2025: రేపే అట్లతద్ది... మన తెలుగింటి ఆడపడుచుల నోము - పూజా విధానం, కథ!
x

Atla Taddi 2025: రేపే అట్లతద్ది... మన తెలుగింటి ఆడపడుచుల నోము - పూజా విధానం, కథ!

Highlights

తెలుగు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఇష్టంగా జరుపుకునే పండుగ అట్లతద్ది. ఇది ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని తదియ తిథి రోజున వస్తుంది.

తెలుగు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఇష్టంగా జరుపుకునే పండుగ అట్లతద్ది. ఇది ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని తదియ తిథి రోజున వస్తుంది. ఈ సంవత్సరం అట్లతద్ది అక్టోబర్ 9, 2025, గురువారం జరుపుకోనున్నారు. ఈ పండుగనే ఉత్తరాది వారు కర్వా చౌత్గా ఆచరిస్తారు.

ఈ నోమును వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాల కోసం నోచుకుంటే.. పెళ్లికాని యువతులు మంచి, ఆరోగ్యవంతుడైన భర్త రావాలని ఆచరిస్తారు.

అట్లతద్ది నాడు చేయాల్సిన ప్రధాన పనులు:

గోరింటాకు: అట్లతద్దికి ముందు రోజు సాయంత్రం కాళ్లు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం, ముత్తయిదువులకు పంచడం శుభప్రదంగా భావిస్తారు.

శుభ్రత: ఇంటిని శుభ్రం చేసుకుని మామిడాకుల తోరణాలు కడతారు.

ఉపవాసం ఆరంభం (చంద్రుడి కిరణాలు పడేలోపే): తెల్లవారుజామున చుక్క ఉండగానే నిద్ర లేచి, స్నానపానాదులు ముగించుకుని భోజనం చేస్తారు. ఈ భోజనంలో బెండకాయ చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగు అన్నం వంటివి తీసుకుంటారు. భోజనం చేసిన తర్వాత మళ్లీ సాయంత్రం పూజ ముగిసేవరకు కటిక ఉపవాసం ఉంటారు (మంచి నీరు కూడా తాగరు).

ఆట పాటలు: అన్నం తిన్న తర్వాత స్త్రీలు, యువతులు రెండు బృందాలుగా ఏర్పడి 'అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…' అంటూ పాటలు పాడుతూ, ఊయల ఊగుతూ ఆనందంగా గడుపుతారు.

అట్లతద్ది పూజా విధానం:

తోరాలు: ఈ రోజు వ్రతం నోచుకునే స్త్రీలు తమ చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు వంటి పత్రాలు/పుష్పాలతో 11 ముడులు వేసిన తోరాలను కట్టుకుంటారు.

పూజా ఏర్పాట్లు:

కలశం స్థాపించి, పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి పూజ చేస్తారు.

ఒక పళ్ళెంలో బియ్యం పోసి, బియ్యప్పిండితో చేసిన కుడుములను పెట్టి, వాటిపై పసుపు కుంకుమలు వేసి, పుష్పాలతో అలంకరిస్తారు. దీనిని కైలాసంగా భావిస్తారు.

పూజ, కథా పఠనం: ముందుగా గణపతికి పూజ చేసి, తర్వాత లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం చదువుతారు. అనంతరం అట్లతద్ది వ్రత కథ చదువుతారు.

వాయనం: పూజ పూర్తయిన తర్వాత, 11 మంది ముత్తయిదువలను ఆహ్వానించి, ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున, గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కటి పెట్టి, తాంబూలంతో కలిపి వాయనం ఇస్తారు. శక్తి ఉన్నవారు జాకెట్ బట్ట లేదా చీరలు పెడతారు.

వాయనం ఇచ్చిపుచ్చుకునే విధానం: వాయనం ఇచ్చే స్త్రీ "ఇస్తినమ్మ వాయనం" అని అంటే, అందుకునే స్త్రీ "పుచ్చుకుంటినమ్మ వాయనం" అని మూడుసార్లు చెప్పి పుచ్చుకుంటారు.

భోజనం: చంద్ర దర్శనం అయిన తర్వాత మళ్లీ స్నానం చేసి, అట్లు వేసి, గౌరీదేవికి నైవేద్యం పెట్టి, కథ చెప్పుకొని, అక్షతలు వేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేస్తారు.

అట్లతద్ది వ్రతకథ (సునామ వృత్తాంతం):

పూర్వం సునామ అనే రాజకుమార్తె ఉండేది. అట్లతద్ది నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన అందమైన భర్త వస్తాడని తెలుసుకుని, తన స్నేహితురాళ్లతో కలిసి వ్రతాన్ని ఆచరించింది. సుకుమారి కావడంతో, ఆమె పగలు నాలుగో ఝాముకే నీరసించి కళ్లు తిరిగి పడిపోయింది.

అది చూసిన ఆమె అన్నగార్లు, చెల్లెలిని కాపాడాలనే ఆతృతతో.. చెరువులోని చింతచెట్టుకు అద్దాన్ని కట్టి, దానికి ఎదురుగా అరికె కుప్పకు నిప్పు పెట్టి, అద్దంలో కనిపించే మంటను చంద్రుడుగా చూపించారు. అన్నయ్యల మాట నమ్మిన సునామ, చంద్రోదయమైందని భావించి ఉపవాసం భంగం చేసింది.

కాలక్రమేణా, ఆమె స్నేహితురాళ్లకు పడుచు భర్తలు లభించారు, కానీ సునామకు మాత్రం ముసలి పెళ్లికొడుకుల సంబంధాలే రావడం మొదలుపెట్టాయి. దుఃఖించిన ఆమె అడవికి పారిపోగా, లోకసంచారం మీద వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు.

పార్వతీదేవి, "నువ్వు చంద్రోదయాని కంటే ముందే ఎంగిలిపడ్డావు. అందుకే నీ వ్రతం ఉల్లంఘన జరిగింది. కనుక ఈ ఏడాది అట్లతద్ది నోమును పూర్తిగా నియమ నిష్ఠలతో చేయి, తప్పకుండా మంచి భర్త లభిస్తాడు," అని చెప్పారు. దాంతో సునామ ఇంటికి వచ్చి మళ్లీ శ్రద్ధగా నోము నోచుకోగా, తర్వాత ఆమెకు అందగాడు, ఆరోగ్యవంతుడైన వరునితో పెళ్లి జరిగింది. వారు సుఖ సంతోషాలతో జీవించారు.

ఉద్యాపన: ఈ వ్రతాన్ని వరుసగా పది సంవత్సరాలు చేసుకుని, తదుపరి ఏడాది ఉద్యాపన చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories