ముక్కోటి ఏకాదశి 2025 విశిష్టత: వైకుంఠ ద్వారం ఎందుకు అంత పవిత్రమంటే?

ముక్కోటి ఏకాదశి 2025 విశిష్టత: వైకుంఠ ద్వారం ఎందుకు అంత పవిత్రమంటే?
x

ముక్కోటి ఏకాదశి 2025 విశిష్టత: వైకుంఠ ద్వారం ఎందుకు అంత పవిత్రమంటే?

Highlights

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఏకాదశి తిథి వస్తుంది. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఈ ఏకాదశులన్నింటిలోకీ అత్యంత విశిష్టమైనదిగా భావించేది ముక్కోటి ఏకాదశి.

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఏకాదశి తిథి వస్తుంది. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఈ ఏకాదశులన్నింటిలోకీ అత్యంత విశిష్టమైనదిగా భావించేది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశిగా కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వస్తారని పురాణ విశ్వాసం. అందుకే ఈ ఏకాదశికి ‘ముక్కోటి’ అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం చెబుతోంది.

సాధారణంగా ఏకాదశులను చాంద్రమానం ప్రకారం పాటిస్తారు. కానీ ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలంగా పండితులు పేర్కొంటారు. ఆ పవిత్ర సమయంలో వచ్చే ఏకాదశి కావడంతో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ రోజున దేవతలందరూ వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని విశ్వాసం. అదే సంప్రదాయాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహిస్తారు. ఉత్తర ద్వారం మోక్ష ద్వారంగా భావిస్తారు. ఆ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే జన్మ పావనమవుతుందని భక్తుల నమ్మకం.

ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆలయ దర్శనం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ రోజు చేసిన పూజలు, దాన ధర్మాలు అనేక జన్మల పుణ్యఫలితాన్ని అందిస్తాయని విశ్వాసం. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ పర్వదినం కోసం ఆతృతగా ఎదురుచూస్తారు.

గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలు, పురాణాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories