Ugadi 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు.. ఉగాది నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే..!

Ugadi 2023 Panchangam Sobhakritu Nama Samvatsara Rasi Phalalu
x

Ugadi 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు.. ఉగాది నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే..!

Highlights

Ugadi 2023: ఈ రోజునుంచి తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

Ugadi 2023: ఈ రోజునుంచి తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ప్రజలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండగను జరుపుకుంటారు. చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు రోజు ఉగాది పండుగ వస్తుంది. రాశుల ప్రకారం ఈరోజు నుంచి జీవితంలో చాలా మార్పులు వస్తాయని అనాదిగా ప్రజలు నమ్ముతుంటారు. అందుకనే పంచాంగ శ్రవణం ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఈ సంవత్సరం వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం 5, వ్యయం 5

రాజపూజ్యం 3, అవమానం 1.

ఈ రాశి వారికి శని 11వ స్థానంలోనూ, రాహువు వ్యయం లోనూ, కేతువు 6లోనూ సంచరించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది. వ్యాధులకి గురైనవారు కోలుకుంటారు. అప్పుల బాధ తగ్గిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వస్తుంది. అవివాహితులకి జూలై, నవంబర్ నెలల మధ్య పెళ్లి సంబంధం కుదరే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగం, స్థిరపడటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఫలితాలని పొందుతారు. ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం 14, వ్యయం 11

రాజపూజ్యం 6, అవమానం 1.

ఈ రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి గురువు వ్యయం లోనూ, అక్టోబర్ చివరి వారి నుంచి రాహువు లాభ స్థానంలోనూ, కేతువు పంచమ స్థానం లోనూ సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం శని దశమ స్థానంలో తిరగడం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి, సంపాదనకు, లాభాలకు లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు ఉంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగం పట్టవచ్చు. ఈ రాశి వారు శివనామస్మరణ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం 2, వ్యయం 11

రాజపూజ్యం 2, అవమానం 4

ఈ ఏడాది భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధంగా కొన్ని పనులు జరిగి జీవితం కొత్తగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభ వార్తలని వింటారు. వ్యాపారులు, వివిధ వృత్తుల వారు, ఐటీ నిపుణులు ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలని పొందవచ్చు.

కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం 11, వ్యయం 8

రాజపూజ్యం 5, అవమానం 4.

ఈ ఏడాది శని అష్టమంలోనూ, గురువు, రాహువులు దశమంలోనూ, కేతువు చతుర్ధం లోనూ సంచరిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టపడటం వల్ల కొద్దిగానే ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వినాయకుడిని పూజించడం వల్ల కలిసివస్తుంది.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం 14, వ్యయం 2

రాజపూజ్యం 1, అవమానం 7.

ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, నవమ స్థానంలో గురు రాహువులు, మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భాగ్యరాశిలో గురు రాహువుల సంచారం వల్ల అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. శివుడిని ఆరాధించటం వల్ల శుభ ఫలితాలను చూస్తారు.

కన్యా రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం 2, వ్యయం 11

రాజపూజ్యం 4, అవమానం 7.

ఈ ఏడాది ఆరవ స్థానంలో శని, 8వ స్థానంలో గురు రాహువులు, రెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల వీరికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు బాగా ఒత్తిడికి గురవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులతో ఆచితూచి మాట్లాడాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం 14, వ్యయం 11

రాజపూజ్యం 7, అవమానం 7.

తులారాశివారికి ఈ ఏడాది పంచమంలో శనీశ్వరుడు, సప్తమంలో గురు రాహువులు, మొదటి స్థానంలో కేతువు సంచరించడం వల్ల జీవితంలో శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం జరుగుతుంది. అక్రమ సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం 5, వ్యయం 5

రాజపూజ్యం 4, అవమానం 5

ఈ రాశి వారికి ఏడాదంతా శనీశ్వరుడు నాలుగవ రాశిలోనూ, గురు రాహువులు ఆరవ రాశిలోనూ, కేతువు వ్యయంలోనూ సంచరిస్తున్నారు. దీంతో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. అవసరానికి డబ్బు అందుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం 8, వ్యయం 11

రాజపూజ్యం 6, అవమానం 3

మూడవ స్థానంలో శని, ఐదవ స్థానంలో గురు రాహువులు, 11వ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విందులు, వినోదాలకు, విహార యాత్రలకు వెళుతారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.ఇష్ట దైవాన్ని పూజిస్తే శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2,)

ఆదాయం 11, వ్యయం 5

రాజపూజ్యం 5, అవమానం 6

ధనస్థానంలో శనీశ్వరుడు, సుఖస్థానంలో గురు రాహులు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందు వల్ల ఈ రాశి వారు ఈ ఏడాది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా పని భారం పెరిగినప్పటికీ ఉద్యోగ జీవితం సంతృప్తి కరంగా సాగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు స్నేహితులను గుడ్డిగా నమ్మటం వల్ల సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. శివుడిని ఎక్కువగా ధ్యానించడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి.

కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం 11, వ్యయం 5

రాజపూజ్యం 6, అవమానం 1.

మొదటి రాశిలో శనీశ్వరుడు, మూడవ రాశిలో గురు రాహువులు, భాగ్య స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు లాభిస్తాయి. ఐటి, ఇంజనీరింగ్ టెక్నాలజీ టెక్నికల్ రంగాలకు చెందిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. తీర్థ యాత్రలకు, దూర ప్రయాణాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం 8, వ్యయం 11

రాజపూజ్యం 1, అవమానం 2.

ఈ రాశివారికి వ్యయంలో శని, రెండవ స్థానంలో గురు రాహులు అష్టమంలో కేతువు సంచరిస్తున్నందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. గృహ యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. అధికారులతో అతి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. బంధు మిత్రులతో ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోవడం ప్రస్తుతానికి మంచిది కాదు. వినాయకుడిని ఎక్కువగా పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories