Suryakumar Yadav : సింహం గ్యాప్ ఇచ్చింది కానీ.. వేట మర్చిపోలేదు..468 రోజుల తర్వాత సూర్య ప్రతాపం

Suryakumar Yadav : సింహం గ్యాప్ ఇచ్చింది కానీ.. వేట మర్చిపోలేదు..468 రోజుల తర్వాత సూర్య ప్రతాపం
x
Highlights

468 రోజుల తర్వాత సూర్య ప్రతాపం

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సూర్య, రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 468 రోజుల నిరీక్షణకు తెరదించుతూ అద్భుతమైన హాఫ్ సెంచరీ బాదడమే కాకుండా, ఒక అరుదైన ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన విమర్శకుల నోళ్లు మూయించాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సూర్య కేవలం 37 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్య ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్ల భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ తన 22వ అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్‌కు ఈ హాఫ్ సెంచరీ చాలా ప్రత్యేకం. అక్టోబర్ 12, 2024న హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా హాఫ్ సెంచరీ బాదిన సూర్య, ఆ తర్వాత ఫామ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. 2025 ఏడాది అతనికి ఒక పీడకలలా సాగింది. గతేడాది ఆడిన 21 మ్యాచ్‌ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసి, 13.62 సగటుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దాదాపు 468 రోజుల పాటు హాఫ్ సెంచరీ కోసం ఎదురుచూసిన సూర్య, చివరకు రాయ్‌పూర్ పిచ్‌పై తన ముద్ర వేశాడు.

అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో సూర్య ఒక భారీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా యువ సంచలనం అభిషేక్ శర్మ పేరిట ఉన్న రికార్డును సూర్య అందుకున్నాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు 8 సార్లు 25 కంటే తక్కువ బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అభిషేక్ శర్మ కూడా 8 సార్లు ఇదే ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు సూర్య కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.

ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. సూర్య ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం. రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026కు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అత్యంత కీలకం. రాయ్‌పూర్‌లో సూర్య ఆడిన షాట్లు చూస్తుంటే పాత మిస్టర్ 360 మళ్ళీ వచ్చాడని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మైదానం నలుమూలల అతను బాదిన సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories