Ashes 4th Test : మెల్‌బోర్న్‌లో పరువు కోసం ఇంగ్లాండ్ పోరాటం.. ఆసీస్ వేగానికి బ్రేక్ పడేనా?

Ashes 4th Test : మెల్‌బోర్న్‌లో పరువు కోసం ఇంగ్లాండ్ పోరాటం.. ఆసీస్ వేగానికి బ్రేక్ పడేనా?
x

Ashes 4th Test : మెల్‌బోర్న్‌లో పరువు కోసం ఇంగ్లాండ్ పోరాటం.. ఆసీస్ వేగానికి బ్రేక్ పడేనా?

Highlights

ప్రతిష్టాత్మకమైన యాషెస్ 2025-26 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ నేడు (శుక్రవారం) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ప్రారంభం కానుంది.

Ashes 4th Test : ప్రతిష్టాత్మకమైన యాషెస్ 2025-26 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ నేడు (శుక్రవారం) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఇంగ్లాండ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్లలో జరిగిన మొదటి మూడు టెస్టుల్లోనూ ఓడిపోయిన ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్‌ను ఆస్ట్రేలియాకు ధారపోసింది. ఇప్పుడు కనీసం మిగిలిన రెండు టెస్టుల్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బెన్ స్టోక్స్ సేన ఆరాటపడుతోంది. కానీ మెల్‌బోర్న్ గడ్డపై ఉన్న రికార్డులు చూస్తుంటే ఇంగ్లాండ్‌కు విజయం అంత సులువు కాదని అర్థమవుతోంది.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్ జట్టు చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ వారి రికార్డు మరీ ఘోరంగా ఏమీ లేదు కానీ ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 57 టెస్టులు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 29 సార్లు గెలుపొందగా, ఇంగ్లాండ్ 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరో 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. గణాంకాలను బట్టి చూస్తే మెల్‌బోర్న్ పిచ్‌పై ఇంగ్లాండ్ నెగ్గడం కష్టమైన పనిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియా ఫామ్ చూస్తుంటే ఇంగ్లాండ్ బాజ్‌బాల్ వ్యూహం ఆసీస్ వేగం ముందు తలవంచుతోంది.

మెల్‌బోర్న్ పిచ్ ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకే స్వర్గధామంలా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, జట్టులో నలుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు. గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఒకవేళ లయన్ ఫిట్‌గా ఉన్నా కూడా, పిచ్ పరిస్థితుల దృష్ట్యా అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమని స్మిత్ హింట్ ఇచ్చారు. ఆస్ట్రేలియా తన తుది జట్టును టాస్ సమయంలో ప్రకటించనుంది. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ వంటి బౌలర్లు తమ స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాళ్లు జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. బాజ్‌బాల్ శైలిలో దూకుడుగా ఆడాలని చూస్తున్న ఇంగ్లాండ్, కీలక సమయాల్లో వికెట్లు పారేసుకుంటూ మూల్యం చెల్లించుకుంటోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జో రూట్ పైనే ఇప్పుడు జట్టు భారం మొత్తం ఉంది. 2015 తర్వాత ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా యాషెస్ సిరీస్ గెలవలేదన్న చేదు నిజాన్ని ఈ సిరీస్ కూడా మళ్ళీ గుర్తు చేస్తోంది. కనీసం ఈ బాక్సింగ్ డే టెస్టులోనైనా గెలిచి సిరీస్ స్కోరును 3-1 కి తగ్గించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

ఇంగ్లాండ్ తుది జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.

ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, జాక్ వెదరల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ (కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, మైఖేల్ నేసర్, బ్రెండన్ డాగెట్, జై రిచర్డ్సన్.

Show Full Article
Print Article
Next Story
More Stories