
Australia Cricket: ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు.. ఒలింపిక్స్ ఆశలు కూడా గల్లంతే?
ఒలింపిక్స్ 2028 అర్హతపై ఆసీస్‌కు గట్టి షాక్ న్యూజిలాండ్ ఫేవరెట్.. భారత్‌కు మెడల్ ఆశలు పెరిగే సూచనలు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిశక్రమించిన ఆసీస్.. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీ20 క్రికెట్లో ఇటీవల పేలవ ప్రదర్శనల కారణంగా ఆస్ట్రేలియాకు ఒలింపిక్స్ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. 2028లో జరిగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ కోసం అర్హత ప్రక్రియపై ఇంకా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తుది నిర్ణయం ప్రకటించకపోయినా.. ప్రస్తుత సమాచారం ప్రకారం ఆసీస్‌కు అవకాశాల్లేవని తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రతి ఖండం నుంచి ఒక క్రికెట్ జట్టు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అదనంగా ఒక గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా మరో జట్టుకు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం ఆరు జట్లు మాత్రమే ఈ మెగా ఈవెంట్లో పోటీపడతాయని తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. 2026 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో కంగారూల ర్యాంక్ పడిపోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో న్యూజీలాండ్ జట్టు స్థిరమైన ప్రదర్శనతో ముందంజలో ఉంది.
ఓషియానియా ప్రాంతం నుంచి ఒలింపిక్స్ అర్హత సాధించే ప్రధాన ఫేవరెట్‌గా న్యూజిలాండ్‌ను ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇటీవలి టీ20 ఫామ్‌ను చూస్తే.. వారి ఒలింపిక్ కలలు నిజమవుతాయా లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే అర్హత విధానం, జట్ల ఎంపిక ప్రమాణాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఐఓసీ తుది మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. ఆసీస్ జట్టు తమ స్థానం నిలబెట్టుకోవాలంటే మరలా మునుపటిలా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒలింపిక్స్ నుంచి ఆసీస్ అవుట్ అయితే.. అది మనకు పెద్ద సానుకూలంగా మారనుంది. ఎందుకంటే మనకు ఐసీసీ ట్రోఫీల్లో పెద్ద అడ్డంకి ఆస్ట్రేలియానే కాబట్టి. ప్రస్తుతం భారత్ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉంది. భారత్ ఒలింపిక్స్ ఆడడం పక్కా.
దాదాపు 128 సంవత్సరాల తర్వాత తిరిగి క్రికెట్ ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించుకుంది. 2028లో లాస్ఏంజెలెస్లో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో జరుగుతాయి. మొదటి మ్యాచ్ జులై 12న జరగనుంది. ఒలింపిక్స్‌లో చివరిసారి 1900లో క్రికెట్ మ్యాచ్ జరగగా.. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీ పడ్డాయి. మళ్లీ ఇన్నేళ్లకు లాస్ఏంజెలెస్ వేదికగా టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈసారి పురుషులు, మహిళల విభాగంలో మ్యాచులు జరగనున్నాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఆరు టీమ్స్ తలపడనున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




