BCCI : ఆసీస్ మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు.. ఘటనపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం

BCCI
x

BCCI : ఆసీస్ మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు.. ఘటనపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం 

Highlights

BCCI : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది.

BCCI : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. హోటల్ నుంచి ఓ కాఫీ షాప్‌కు వెళ్తున్న ఇద్దరు ఆసీస్ క్రికెటర్లను మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి వెంబడించి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ ఘటనపై అధికారికంగా స్పందిస్తూ, నిందితుడిని అరెస్ట్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసుల చర్యను ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతను సమీక్షించి, కట్టుదిట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

గురువారం ఉదయం ఇండోర్‌లోని ఒక హోటల్ నుంచి కాఫీ షాప్‌కు వెళ్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు క్రీడాకారులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి వారిని వెంబడించి, ఆ తర్వాత వారిని అనుచితంగా తాకాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో అఖిల్ అనే నిందితుడిని పోలీసులు తక్షణమే అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో స్పందించారు. "ఇది చాలా బాధాకరం, అవాంఛనీయమైన సంఘటన. భారత్ ఎప్పుడూ తన ఆతిథ్యం, ఆదర-సత్కారాలకు ప్రసిద్ధి చెందింది. అతిథుల పట్ల గౌరవం చూపడం మన సంస్కృతి. మేము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము" అని సైకియా అన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో మధ్యప్రదేశ్ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవడాన్ని బీసీసీఐ ప్రశంసించింది.

"ప్రతి ఒక్కరికీ పూర్తి న్యాయం జరిగేలా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, మేము మా భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అవసరమైతే మరింత పటిష్టం చేస్తాము" అని సైకియా హామీ ఇచ్చారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈ ఘటనను ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తి ఇద్దరు మహిళా క్రికెటర్లను వెంబడించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బోర్డు తెలిపింది. వెంటనే టీమ్ సెక్యూరిటీ పోలీసులుకు సమాచారం అందించినట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియా జట్టు ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే శనివారం దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్‌కు ముందు పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టు తన తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్ 30న నవీ ముంబైలో జరగనున్న రెండో సెమీ-ఫైనల్‌లో భారత జట్టును ఎదుర్కోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories