SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో దారుణమైన ఓటమి... ఎందుకిలా?

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో దారుణమైన ఓటమి... ఎందుకిలా?
x
Highlights

SRH vs DC match highlights: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌పై మొదటి...

SRH vs DC match highlights: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌పై మొదటి మ్యాచ్ గెలిచింది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం విశాఖపట్నం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయి రెండో ఘోర పరాజయం సొంతం చేసుకుంది.

తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయారు. ఫలితంగా 18.4 ఓవర్లకే 163 పరుగుల స్వల్ప స్కోర్‌కే సన్‌రైజర్స్ హైదరాబాద్ చాపచుట్టేసింది.

ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. ఆ తరువాత ట్రావిస్ హెడ్ ( 12 బంతుల్లో 22 పరుగులు ) ఇన్నింగ్స్ ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బంతిని షాట్ కొట్టబోయి కె.ఎల్. రాహుల్ చేతికి చిక్కడంతో ఔట్ అయ్యాడు.

ఇక ఇషాన్ కిషన్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 5 బంతులే ఆడిన కిషన్ 2 పరుగులకే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మూడో మ్యాచ్ లోనైనా మరోసారి ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ చూడొచ్చనుకుంటే మరోసారి నిరేశే ఎదురైంది. అదే స్టార్క్ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 బంతులకే డకౌట్ అయ్యాడు.

అనికెత్ వర్మ హాఫ్ సెంచరీ వృధా

20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అనికేత్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశాడు. 5 ఫోర్లు, 6 సిక్సులతో 41 బంతుల్లో 74 పరుగులు రాబట్టి జట్టు స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో జేక్ ఫ్రేసర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

అనికేత్ వర్మ రాబట్టిన పరుగులే జట్టు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ సొంతం చేసుకునేందుకు కారణమయ్యాయి. లేదంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ టోటల్ స్కోర్ ఇంకెంత తక్కువగా ఉండేదో!! ఎందుకంటే ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో32 పరుగులు) తప్ప ఇంకెవ్వరూ రెండు అంకెల స్కోర్ చేయలేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ నడ్డి విరిచిన స్టార్క్

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఏకంగా 5 వికెట్లు తీసి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నడ్డి విరిచాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.

బౌలింగ్‌లోనూ విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్

బ్యాటింగ్ లో ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లోనూ ప్రత్యర్థికి ఏ దశలోనూ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. 164 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

7వ స్థానానికి చేజారిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపిఎల్ 2025 పాయింట్స్ పట్టికలో తాజా ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7వ స్థానానికి దిగజారింది. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తాజా విజయం తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2వ స్థానంలో ఉంది. నెంబర్ 1 స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనసాగుతోంది.

ఈ రోజు రాత్రి 7.30 గంటలకు గౌహతిలోని బార్సపార స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 11వ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు గెలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానం మరో అడుగు కిందకు జారే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories