Smriti Mandhana : ఆగిపోయిన స్మృతి మంధాన పెళ్లి..ఆస్పత్రిలో చేరిన స్టార్ బ్యాటర్ తండ్రి

Smriti Mandhana : ఆగిపోయిన స్మృతి మంధాన పెళ్లి..ఆస్పత్రిలో చేరిన స్టార్ బ్యాటర్ తండ్రి
x

 Smriti Mandhana : ఆగిపోయిన స్మృతి మంధాన పెళ్లి..ఆస్పత్రిలో చేరిన స్టార్ బ్యాటర్ తండ్రి

Highlights

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడింది.

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన ఈ పెళ్లి వాయిదా పడటానికి కారణం స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడమే. ఈ విషయాన్ని క్రికెటర్ మేనేజర్ మీడియాకు తెలియజేశారు.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న సమదోల్‌లోని మంధాన ఫామ్‌హౌస్‌లో వివాహ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నవంబర్ 23న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ఈ విషయంపై స్పందిస్తూ.. "ఈరోజు ఉదయం ఆయన (శ్రీనివాస్ మంధాన) అల్పాహారం తీసుకుంటున్నప్పుడు ఆరోగ్య సమస్య మొదలైంది. కొద్దిసేపు వేచి చూసినా, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. రిస్క్ తీసుకోకుండా వెంటనే ఆంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తరలించాము" అని తెలిపారు.

తండ్రికి తీవ్ర అనారోగ్యం కారణంగా ఈ సమయంలో పెళ్లి చేసుకోవడానికి స్మృతి మంధాన ఇష్టపడలేదు. "ఇలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడానికి స్మృతి మంధాన ఇష్టపడలేదు. అందుకే మ్యారేజ్ ఈవెంట్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు" అని మేనేజర్ వివరించారు. ఈ నిర్ణయంతో ఇరు కుటుంబాలు, అభిమానులు నిరాశకు గురయ్యారు.

స్మృతి, పలాష్ వివాహ వేడుకలు ఇప్పటికే కొన్ని రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. మెహందీ, హల్దీ వంటి సాంప్రదాయ వేడుకలు పూర్తయ్యాయి. ముఖ్యంగా సంగీత్ కార్యక్రమం పెద్ద వార్తగా మారింది. ఈ వేడుకలో స్మృతి, పలాష్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా వధూవరుల జట్ల మధ్య సరదాగా ఒక క్రికెట్ మ్యాచ్‌ను కూడా నిర్వహించారు. ఇరు కుటుంబాలు, స్నేహితులు, టీమిండియా మహిళా క్రికెటర్లు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories