ICC : గన్‌ సెలబ్రేషన్, ఫైటర్ జెట్ సంజ్ఞ.. పాక్ ఆటగాళ్లకు ఐసీసీ సీరియస్ వార్నింగ్

ICC Fines Haris Rauf for Provocative Gestures in Asia Cup 2025
x

ICC : గన్‌ సెలబ్రేషన్, ఫైటర్ జెట్ సంజ్ఞ.. పాక్ ఆటగాళ్లకు ఐసీసీ సీరియస్ వార్నింగ్ 

Highlights

ICC: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ రౌండ్ మ్యాచ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు పెద్ద వివాదానికి దారితీశాయి.

ICC: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ రౌండ్ మ్యాచ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వివాదాల నేపథ్యంలో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఒకరి ఆటగాళ్లపై ఒకరు ఐసీసీకి ఫిర్యాదు చేశాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదు మేరకు, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 25న ఐసీసీ విచారణకు హాజరయ్యారు. ఆ విచారణ తర్వాత, సూర్యకుమార్‌కు అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. ఇటు బీసీసీఐ కూడా పాకిస్తాన్ ఆటగాళ్లైన సాహిబ్‌జాదా ఫర్హాన్, హారిస్ రవూఫ్‌లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఐసీసీ విచారణ జరిపి తాజాగా తన కీలక తీర్పును ప్రకటించింది.

భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, హారిస్ రవూఫ్‌లు రెచ్చగొట్టే సైగలు చేశారు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ సెలబ్రేషన్ చేయగా, హారిస్ రవూఫ్ ఒక ఫైటర్ జెట్‌ను కూల్చినట్లుగా సైగ చేశాడు. ఈ ఇద్దరి ప్రవర్తనపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ, వారి దూకుడు సైగలు, అనుచిత ప్రవర్తనకు గాను హారిస్ రవూఫ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. బ్యాట్స్‌మెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు మాత్రం అతని గన్ సెలబ్రేషన్‌పై కేవలం హెచ్చరిక మాత్రమే ఇచ్చి పంపించింది.

ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన హావభావాలు ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఐసీసీ పేర్కొంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవూఫ్, ఒక ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లుగా సైగ చేశాడు. దీనిపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ, రవూఫ్ ప్రవర్తనకు జరిమానా రూపంలో శిక్ష విధించింది. అయితే, హారిస్ రవూఫ్‌ను మ్యాచ్ నుండి నిషేధించలేదు. కాబట్టి భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతను ఆడతాడు.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అయితే, హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతను మైదానంలో గన్ సెలబ్రేషన్ చేశాడు. ఈ వేడుక పహల్‌గామ్ దాడి, భారతదేశ ఆపరేషన్ సింధూర్‌కు వ్యతిరేకంగా జరిగిందని బీసీసీఐ ఆరోపించింది. దీని ఫలితంగా, అలాంటి వేడుకలను మళ్లీ చేయవద్దని ఐసీసీ అతనికి హెచ్చరిక జారీ చేసింది. ఈ సంఘటనలు ఆసియా కప్‌లో ఆటగాళ్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories