IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. ఆస్ట్రేలియాదే ఆధిపత్యం!

IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. ఆస్ట్రేలియాదే ఆధిపత్యం!
x
Highlights

IND vs AUS 2nd Test Day 1 Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఆరంభమైన రెండో టెస్టులో మొదటి...

IND vs AUS 2nd Test Day 1 Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఆరంభమైన రెండో టెస్టులో మొదటి రోజు ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 86 రన్స్ చేసింది. మార్నస్‌ లబుషేన్ (20; 67 బంతుల్లో 3 ఫోర్లు), నాథన్ మెక్‌స్వినీ (38; 97 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 13 పరుగులకే అవుట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ 180 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. తొలిరోజులో ఆధిపత్యం చెలాయించింది.

గులాబీ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే అతడు ఎల్బీగా అవుట్ అయ్యాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (37), వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు క్రీజులో కుదురుకుని పరుగులు చేశారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ సమయంలో స్టార్క్‌ మరోసారి బౌలింగ్‌కు వచ్చి.. టీమిండియాను దెబ్బ కొట్టాడు.

కేఎల్‌ను ఔట్ చేసిన స్టార్క్.. కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (7)ని పెవిలియన్ చేర్చాడు. మరోవైపు గిల్, రోహిత్ శర్మ (3)లను స్కాట్ బోలాండ్‌ అవుట్ చేశాడు. రిషబ్ పంత్ (21)ను ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. ఆర్ అశ్విన్ (22) పర్వాలేదనిపించాడు. ఓవైపు వికెట్స్ పడుతున్నా నితీశ్‌ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 42 పరుగులతో ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీసి భారత జట్టు నడ్డి విరిచాడు.

భారత్ ఆలౌట్ అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంబించిన ఆస్ట్రేలియాకు ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (13)ను జస్ప్రీత్ బుమ్రా ఔట్‌ చేశాడు. జట్టు స్కోర్ 24 పరుగుల వద్ద స్లిప్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. యువ ఓపెనర్ మెక్‌స్వినీకి మార్నస్‌ లబుషేన్ జతకలిశాడు. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కెప్టెన్ రోహిత్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఆట ముగిసేసరికి 86/1 స్కోరుతో ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది.రెండో రోజు ఆరంభంలో టీమిండియా బౌలర్లు వికెట్లు పడగొట్టకుంటే.. ఆసీస్‌ భారీ ఆధిక్యం సాధిస్తుంది. ఇక భారం అంత బౌలర్లపైనే ఉంది. పెర్త్‌లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తరహాలో జస్‌ప్రీత్ బుమ్రానో లేదా మరొకరో రెచ్చిపోతేనే ఏదైనా ఫలితం ఉంటుంది. లేదంటే ఫలితం తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories