IND vs NZ Final: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వల్లే కాలేదు.. మరి సూర్యకుమార్ సాధించి చరిత్ర సృష్టిస్తాడా?
IND vs NZ Final: భారత్ ఇప్పటికే 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 2026లో మరోసారి ట్రోఫీ సాధిస్తే.. టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండు సార్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రలో నిలుస్తుంది. అంతేకాకుండా మొత్తం మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా కూడా అవతరిస్తుంది.
IND vs NZ Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ టైటిల్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 2026లో మరోసారి ట్రోఫీ సాధిస్తే.. టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండు సార్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రలో నిలుస్తుంది. అంతేకాకుండా మొత్తం మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా కూడా అవతరిస్తుంది.
ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత్:
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో సూపర్-8 దశలో ఫిబ్రవరి 22న జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ భారీ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుని మిగతా మ్యాచ్‌ల్లో (జింబాంబ్వే, వెస్టిండీస్) విజయం సాధించింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఉత్కంఠభరితమైన పోరులో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో ఫైనల్:
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే 2026 ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూడడానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. స్వదేశీ ప్రేక్షకుల మద్దతుతో భారత్ మరోసారి ప్రపంచ కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కివీస్ మాత్రం తొలిసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలవాలని చూస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ ఆధిపత్యం:
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మాత్రం న్యూజిలాండ్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా కివీస్ విజయం సాధించింది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో డేనియల్ వెటోరి అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్‌కు విజయం అందించాడు. అతడు 4 వికెట్లు తీసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత్ లక్ష్యాన్ని చేధించలేక 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2016 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేశారు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ 110 పరుగులకే పరిమితమైంది. డారిల్ మిచెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సూర్యకుమార్ ముందు భారీ సవాల్:
ప్రస్తుతం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందున్న ప్రధాన లక్ష్యం కప్ గెలిచి.. రెండు రికార్డులను సృష్టించడం. గతంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఫైనల్‌లో సూర్యకుమార్ జట్టును విజయం వైపు నడిపిస్తాడా అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. భారత్ చరిత్ర సృష్టిస్తుందా? లేక కివీస్ మరోసారి పైచేయి సాధిస్తుందా? అనేది చూడాలి. ధోనీ, విరాట్ వల్లే కాని రికార్డు.. సూర్య సాధించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.




