Tilak Varma : తిలక్ స్ట్రైక్ రేట్ పై విమర్శలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్

Tilak Varma : తిలక్ స్ట్రైక్ రేట్ పై విమర్శలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
x
Highlights

తిలక్ స్ట్రైక్ రేట్ పై విమర్శలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్

Tilak Varma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచి సూపర్-8 రౌండ్‌లోకి ఘనంగా ప్రవేశించింది. అయితే వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ భారత బ్యాటింగ్ విభాగంపై మాత్రం విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస డకౌట్లతో ఇబ్బంది పడుతుంటే, మూడో స్థానంలో వస్తున్న యువ సంచలనం తిలక్ వర్మ ఆడుతున్న తీరుపై చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లోనూ, గత సిరీస్‌లలోనూ మెరుపు వేగంతో ఆడే తిలక్.. ఈ వరల్డ్ కప్‌లో మాత్రం టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో నెమ్మదిగా ఆడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందిస్తూ అసలు నిజం బయటపెట్టాడు.

తిలక్ వర్మ ఈ టోర్నీలో ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తే వరుసగా 25, 25, 25, 31 పరుగులు చేశాడు. స్కోర్లు పర్వాలేదనిపించినా, అతని స్ట్రైక్ రేట్ మాత్రం అభిమానులను నిరాశపరిచింది. పాకిస్థాన్‌పై 104, నెదర్లాండ్స్‌పై 114 స్ట్రైక్ రేట్‌తో తిలక్ ఆడాడు. అయితే ఇది తిలక్ వైఫల్యం కాదని, జట్టు మేనేజ్మెంట్ అతనికి ఇచ్చిన స్పెషల్ ఆర్డర్ అని కెప్టెన్ సూర్య వెల్లడించాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ.. తిలక్ తన వ్యక్తిగత శైలిని పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆడుతున్నాడని స్పష్టం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మకు ఇచ్చిన మెసేజ్ గురించి వివరిస్తూ.. "నేను స్వయంగా తిలక్‌తో మాట్లాడాను. మేనేజ్మెంట్ అతనికి ఒక స్పష్టమైన బాధ్యత ఇచ్చింది. ఒకవేళ ఓపెనర్ అవుట్ అయితే పవర్‌ప్లేలో తన సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించవచ్చు. కానీ, ఒకవేళ త్వరగా రెండు వికెట్లు పడిపోతే మాత్రం తిలక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాలి. అనవసర షాట్లకు పోకుండా 10వ ఓవర్ వరకు క్రీజులో ఉండి భాగస్వామ్యం నెలకొల్పాలి. ఆ తర్వాత చివర్లో మా దగ్గర విధ్వంసం సృష్టించే హిట్టర్లు ఉన్నారు కాబట్టి, మధ్య ఓవర్లలో వికెట్ కాపాడుకోవడం చాలా ముఖ్యం" అని వివరించాడు.

తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకుంటారా అన్న ప్రశ్నకు సూర్య ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "ప్రస్తుతం అంతా బాగానే జరుగుతోంది, మార్పులు చేయాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించాడు. తిలక్ వర్మ తన ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తిగా లేకపోవచ్చు, ఎందుకంటే అతను తన కోసం పెట్టుకున్న ప్రమాణాలు చాలా ఎక్కువని సూర్య అన్నాడు. అయినప్పటికీ, తిలక్ ఆడుతున్న విధానం పట్ల మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉందని, అతని ఫామ్ గురించి ఎటువంటి ఆందోళన లేదని కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు. సూపర్-8లో దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఎదుర్కొనేటప్పుడు తిలక్ వర్మ వంటి టెక్నిక్ ఉన్న బ్యాటర్ ఉండటం జట్టుకు ప్లస్ అవుతుందని సూర్య భావిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories