
వరల్డ్ కప్‌లో టీమిండియా బోణీ.. అమెరికా మీద గెలుపులో ఆ ముగ్గురే హీరోలు
IND vs USA: టీ20 ప్రపంచకప్ 2026 వేటను భారత్ ఘనవిజయంతో ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన పోరులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో టాప్ ఆర్డర్ కుప్పకూలి ఓటమి భయం వెంటాడినా, ముగ్గురు ఆటగాళ్లు అసాధారణ ప్రతిభ కనబరిచి భారత్‌ను గెలిపించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ ముగ్గురు మొనగాళ్లు ఎవరో చూద్దాం.
1. సూర్యకుమార్ యాదవ్
భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేయదేమో అన్న స్థితిలో ఉన్నప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతం చేశాడు. ఒత్తిడిలోనూ చెలరేగి ఆడుతూ 171 స్ట్రైక్ రేట్‌తో కేవలం 49 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సూర్య ఆడి ఉండకపోతే భారత్ ఈ మ్యాచ్‌ను గెలవడం అసాధ్యమయ్యేది. అందుకే ఆయన ఈ గెలుపుకు మొదటి హీరో.
2. మహమ్మద్ సిరాజ్
హర్షిత్ రాణా స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన సిరాజ్, తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. పవర్‌ప్లేలో అమెరికా ఓపెనర్ల వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోకుండా చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఓవర్లోనే గూస్‌ను అవుట్ చేసి అమెరికా పతనానికి పునాది వేశాడు.
3. అక్షర్ పటేల్
ఉప-కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో అసలైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. బ్యాటింగ్‌లో సూర్యకు తోడుగా నిలిచి 41 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక బౌలింగ్‌లో తన మార్క్ చూపించాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అమెరికా గెలుపు ఆశలను పూర్తిగా ఆవిరి చేసేశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




