IPL 2025: యుద్ధభయంతో ఐపీఎల్ రద్దవుతుందా ? భారత్-పాక్ టెన్షన్ మధ్య బీసీసీఐ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

India-Pakistan Tension Impacts IPL Whats Next for the League
x

IPL 2025: యుద్ధభయంతో ఐపీఎల్ రద్దవుతుందా ? భారత్-పాక్ టెన్షన్ మధ్య బీసీసీఐ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

Highlights

IPL: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆగ్రహంతో ఉంది.

IPL: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆగ్రహంతో ఉంది. వరుసగా దుశ్చర్యలకు పాల్పడుతోంది. అయితే, భారత్ కూడా వారికి దీటైన సమాధానం ఇస్తోంది. బుధవారం పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. అయితే, భారత్ పాకిస్తాన్‌కు గట్టిగా బదులిస్తూ వారి మిస్సైల్స్, డ్రోన్‌లను కూల్చివేసింది. కానీ ఈ దాడి ప్రభావం ఐపీఎల్‌పై కనిపించింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే రద్దయింది. దీంతో ఇప్పుడు ఈ లీగ్ కొనసాగుతుందా లేదా వాయిదా వేస్తారా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. దీనితో పాటు బీసీసీఐ ముందు ఉన్న ఇతర ఆప్షన్స్ ఏమిటో తెలుసుకుందాం.

జమ్మూ, పఠాన్‌కోట్‌లో వైమానిక దాడుల హెచ్చరికల తర్వాత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే రద్దయింది. అలాగే, మే 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను ఇదివరకే వేరే వేదికకు మార్చారు. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో శుక్రవారం మే 9న బీసీసీఐ అత్యవసర సమావేశం జరగనుంది. మే 8న కూడా ఐపీఎల్ మ్యాచ్ రద్దయిన తర్వాత బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమయ్యాయి. దీనిపై తుది నిర్ణయం ఈరోజు వెలువడవచ్చు.

ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ గురువారం మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ కొనసాగుతుందా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. దీంతో ఐపీఎల్ ముందుకు సాగుతుందా లేదా వాయిదా వేస్తారా అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది. అయితే, బీసీసీఐ ఎలాగైనా ఈ సీజన్‌ను పూర్తి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. లేకపోతే, భవిష్యత్తులో ఖాళీ సమయం దొరకడం చాలా కష్టం అవుతుంది. మార్చి నుంచి మే వరకు మాత్రమే పెద్ద దేశాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడవు.

మరోవైపు, బీసీసీఐ వేదికలను మార్చే విషయంపై కూడా ఆలోచిస్తోంది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం తక్కువగా ఉన్న, సురక్షితమైన వేదికల్లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించవచ్చు. ఇదివరకు కరోనా తర్వాత ఐపీఎల్ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కూడా కొన్ని వేదికల్లోనే మ్యాచ్‌లు జరిగాయి. తద్వారా ఆటగాళ్లు తక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది.

బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టోర్నమెంట్‌ను వేరే దేశానికి తరలించే విషయంపై కూడా చర్చించవచ్చు. ఇదివరకు కూడా భారతదేశం వెలుపల ఐపీఎల్ జరిగింది. దీంతో బీసీసీఐకి ఇది ఒక ఆప్షన్‌గా ఉండవచ్చు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పెద్ద నిర్ణయం తీసుకుంటూ పాకిస్తాన్ క్రికెట్ మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ ఐపీఎల్ సీజన్‌ను వాయిదా వేసే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అంటే రెండు దశల్లో పూర్తి చేయవచ్చు. ఐపీఎల్ 2021 కూడా రెండు దశల్లో జరిగింది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021ని మే 4న నిలిపివేశారు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 రెండవ దశ యూఏఈలో జరిగింది. మొదటి దశలో 29 మ్యాచ్‌లు జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్‌లు రెండవ దశలో జరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories