T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 34 సిక్సర్లు, 73 బౌండరీలు

T20 World Cup 2026
x

India vs England T20 World Cup 2026

Highlights

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. సంజూ శాంసన్ (89), బెథెల్ (105) మెరవగా, మ్యాచ్‌లో మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి.

T20 World Cup 2026 : ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం మరో అద్భుతమైన పోరాటానికి వేదికైంది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. ఇరు జట్లు కలిసి దాదాపు 500 పరుగులు సాధించిన ఈ మ్యాచ్‌లో, టీమిండియా 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్, ఇంగ్లాండ్ కుర్రాడు జాకబ్ బెథెల్ సంచలన సెంచరీ ఈ మ్యాచ్‌ను ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా మార్చేశాయి.

మ్యాచ్ హైలైట్స్

గురువారం మార్చి 5న జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది. సంజూ శాంసన్ కేవలం 89 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేయగా.. ఇషాన్ కిషన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా మెరుపు వేగంతో పరుగులు రాబట్టారు. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ, 22 ఏళ్ల జాకబ్ బెథెల్ (105) వీరోచితంగా పోరాడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసినా, ఇంగ్లాండ్ 246 పరుగుల వద్దే ఆగిపోయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను అడ్డుకున్నాడు.

రికార్డుల వర్షం

ఈ మ్యాచ్ కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు, రికార్డుల పరంగా కొత్త చరిత్ర సృష్టించింది. భారత్ చేసిన 253, ఇంగ్లాండ్ చేసిన 246 పరుగులతో కలిపి మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదే. ఇక మొత్తం టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో స్థానంలో ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్‌లో 519 పరుగులు నమోదయ్యాయి. అలాగే, ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి ఏకంగా 34 సిక్సర్లు బాదాయి, ఇది కూడా ఒక వరల్డ్ రికార్డు. బౌండరీల విషయంలోనూ పాత రికార్డులు కనుమరుగయ్యాయి. మొత్తం 73 బౌండరీలు ఈ ఒక్క మ్యాచ్‌లోనే రావడం విశేషం.

భారత్ మరో ఫైనల్ వేట

టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. 2024 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్, ఇప్పుడు 2026లోనూ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ (2007, 2009), శ్రీలంక (2012, 2014) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. మరోవైపు, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చేసిన 105 పరుగులు, వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా రికార్డుకెక్కింది. అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ చేసిన 100 పరుగుల రికార్డును అతడు చెరిపివేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories