India vs NZ 5th T20: టీమిండియాలో భారీ మార్పులు..సంజూ శాంసన్‌కు ఉద్వాసన? ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ ఫిక్స్

India vs NZ 5th T20: టీమిండియాలో భారీ మార్పులు..సంజూ శాంసన్‌కు ఉద్వాసన? ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ ఫిక్స్
x
Highlights

టీమిండియాలో భారీ మార్పులు..సంజూ శాంసన్‌కు ఉద్వాసన? ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ ఫిక్స్

India vs NZ 5th T20: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. శనివారం (జనవరి 31) తిరువనంతపురంలో జరగనున్న ఐదో, చివరి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. నాలుగో మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన టీమిండియా, ఈ నిర్ణయాత్మక పోరులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో కొన్ని సాహసోపేతమైన మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది.

ఈ సిరీస్‌లో కేరళ స్టార్ సంజూ శాంసన్‌కు మేనేజ్మెంట్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశమిచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ అతను ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 10, 06, 00 పరుగులకే పరిమితమైన సంజూ, తన సొంత గడ్డపై జరగనున్న మ్యాచ్‌కు ముందు జరిగిన నాలుగో టీ20లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. నిలకడలేమి ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిన సంజూను తప్పించి, తుది జట్టులో మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇది సంజూ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరి అనిపిస్తోంది.

సంజూ స్థానంలో విధ్వంసకర ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. చిన్నపాటి గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో మ్యాచ్ సమయంలో అతను డ్రింక్స్ బ్రేక్ లో మైదానంలో చురుగ్గా పరిగెత్తుతూ కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ సిరీస్ రెండో మ్యాచ్‌లోనే 76 పరుగులతో మెరుపులు మెరిపించిన ఇషాన్, టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మతో కలిసి టీమిండియాకు భారీ స్కోరు అందించే బాధ్యతను తీసుకోనున్నాడు. అతని రాకతో జట్టు బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగంలోనూ సూర్య మార్పులు చేసే యోచనలో ఉన్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని మళ్ళీ తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్‌ను ఆ తర్వాత బెంచ్‌కే పరిమితం చేశారు. అయితే, తిరువనంతపురం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, కుల్దీప్ యాదవ్ లేదా రవి బిష్ణోయ్‌లలో ఒకరిని పక్కన పెట్టి వరుణ్‌ను రంగంలోకి దించే స్కెచ్ వేస్తోంది టీమ్ ఇండియా మేనేజ్మెంట్. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు.

భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్/వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Show Full Article
Print Article
Next Story
More Stories