IPL 2026 : ఐపీఎల్ మినీ ఆక్షన్ తేదీ, వేదిక ఖరారు.. ఏ జట్టుకు ఎన్ని ఖాళీలు, ఎంత డబ్బు?

IPL 2026
x

IPL 2026 : ఐపీఎల్ మినీ ఆక్షన్ తేదీ, వేదిక ఖరారు.. ఏ జట్టుకు ఎన్ని ఖాళీలు, ఎంత డబ్బు?

Highlights

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన అతిపెద్ద అప్‌డేట్ వచ్చేసింది.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన అతిపెద్ద అప్‌డేట్ వచ్చేసింది. ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న బీసీసీఐ... ఇక అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మినీ-ఆక్షన్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈసారి ఆటగాళ్ల వేలం మన దేశంలో కాకుండా విదేశీ గడ్డపై జరగనుంది. తేదీ, వేదికతో పాటు ఏ జట్టుకు ఎంత బడ్జెట్ మిగిలిందో వివరాలు చూద్దాం.

ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ నవంబర్ 15న ముగిసిన వెంటనే, బీసీసీఐ మినీ-ఆక్షన్ వివరాలను ప్రకటించింది. రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ బయటికి రావడంతోనే, ఇప్పుడు ఫ్రాంచైజీల దృష్టి మొత్తం వేలంపై పడింది. ఐపీఎల్ 2026 మినీ-ఆక్షన్ వచ్చే నెల, డిసెంబర్ 16న ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈసారి వేలాన్ని యూఏఈలోని అబుదాబిలో ఉన్న ఎతిహాద్ అరీనాలో నిర్వహించనున్నారు.10 ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 77 మంది ఆటగాళ్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ఈ 77 స్లాట్లను భర్తీ చేయడానికి అన్ని జట్ల వద్ద కలిపి రూ.237.55 కోట్లకు పైగా ఆక్షన్ పర్స్ అందుబాటులో ఉంది.

రిటెన్షన్ ప్రక్రియ తర్వాత, ఏ జట్టుకు ఎంత డబ్బు మిగిలింది, ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుంటే, వేలంలో ఆయా జట్ల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఐపీఎల్ 2026 మినీ-ఆక్షన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న తర్వాత, ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న బడ్జెట్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అన్ని జట్లలో అత్యధికంగా ఖాళీ స్లాట్లు, ఎక్కువ బడ్జెట్ కలిగి ఉన్న జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిలిచింది. ఈ జట్టు వద్ద ఏకంగా 13 స్లాట్లు ఖాళీగా ఉండగా, వాటిని భర్తీ చేయడానికి రూ.64.3 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు, ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద 9 స్లాట్లు ఖాళీగా ఉండి, రూ.43.4 కోట్లతో వేలంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు 10 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉంది, దీని కోసం వారి పర్స్లో రూ.25.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అత్యంత తక్కువ బడ్జెట్ కలిగి ఉన్న జట్టుగా రాజస్థాన్ రాయల్స్ (RR) నిలిచింది. వారికి 9 స్లాట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, కేవలం రూ.16.4 కోట్లు మాత్రమే అందుబాటులో ఉండటం వలన, వేలంలో ఆచితూచి వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది.

నవంబర్ 15 నాటికి 10 ఫ్రాంచైజీలు మొత్తం 173 మంది ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. ఇప్పుడు మిగిలిన 77 స్థానాల కోసం డిసెంబర్ 16న వేలంలో పెద్ద పోటీ నెలకొననుంది. తదుపరి అడుగులో భాగంగా బీసీసీఐ త్వరలోనే వేలంలో పాల్గొనడానికి ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎంత మంది స్థానిక, అంతర్జాతీయ ఆటగాళ్లు తమ పేర్లను వేలానికి నమోదు చేసుకున్నారో పూర్తి స్పష్టత వస్తుంది. ఫ్రాంచైజీలు తమ బడ్జెట్, ఖాళీ స్థానాలను దృష్టిలో ఉంచుకుని వేలానికి సన్నద్ధమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories