IPL 2026 : సంజు శాంసన్ రాజస్థాన్‌కు గుడ్ బై.. ఐపీఎల్ 2026లో కొత్త కెప్టెన్ ఆ భారత ఓపెనరేనా?

IPL 2026
x

IPL 2026 : సంజు శాంసన్ రాజస్థాన్‌కు గుడ్ బై.. ఐపీఎల్ 2026లో కొత్త కెప్టెన్ ఆ భారత ఓపెనరేనా?

Highlights

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెను మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెను మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ రాజస్థాన్ జట్టును వీడనున్నట్లు ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు మీడియా వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో 2008 ఐపీఎల్ ఛాంపియన్ జట్టు ఇప్పుడు కొత్త కెప్టెన్‌ను వెతుకుతోంది. అయితే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చి జట్టులోనే ఉంచుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. సంజు శాంసన్‌ను దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ తో సహా మరో 3 ప్రధాన జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంచలన పరిణామాల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సుదీర్ఘకాలం పాటు సేవలందించిన కెప్టెన్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్టును వీడాలని ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చినట్లుగా మీడియా నివేదికలు చెబుతున్నాయి. కేవలం సంజు శాంసన్ మాత్రమే కాకుండా, యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. అయితే, జురెల్ జట్టును ఎందుకు వీడుతున్నారనేదానికి గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

సంజు శాంసన్ నిష్క్రమణ దాదాపు ఖాయం కావడంతో, రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కెప్టెన్ కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. వాస్తవానికి, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఆర్ఆర్ జట్టును వీడాలని అనుకున్నాడట. అయితే, ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ అతన్ని ఆపి, కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తామని వాగ్దానం చేసినట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్‌కు యంగ్ సంచలనం జైస్వాల్ నాయకత్వం వహించే అవకాశం ఉంది.

సంజు శాంసన్ వంటి అనుభవం ఉన్న, ప్రతిభావంతుడైన ఆటగాడు అందుబాటులోకి వస్తే, అతన్ని దక్కించుకోవడానికి ఇతర ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి గట్టి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సంజు శాంసన్‌ను ఆర్ఆర్ ట్రేడ్ చేస్తుందా లేక అతన్ని విడుదల చేసి మెగా ఆక్షన్‌లో ఇతర జట్లు వేలం వేయాలా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

సంజు శాంసన్ 2013-15 మధ్య, మళ్లీ 2018 నుండి ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అతను తన 177 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 4,704 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు, సంజు శాంసన్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ ఆక్షన్ డిసెంబర్ 13 నుంచి 15 తేదీల మధ్య జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ ఇంకా ఆక్షన్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, నవంబర్ 15 లోపు జట్లు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 2025లో జరిగిన మెగా ఆక్షన్‌తో పోలిస్తే ఈసారి ఆక్షన్ చిన్న స్థాయిలో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories