
Ishan Kishan
Ishan Kishan : టి20 వరల్డ్ కప్ ఫైనల్ ముందర ఇషాన్ కిషన్ సోదరి దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ బాధను దిగమింగి ఇషాన్ 54 పరుగులతో రాణించి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
Ishan Kishan : టీమిండియా మరోసారి టి20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. దాదాపు 88 వేల మంది ప్రేక్షకుల కేరింతల మధ్య ఈ అద్భుత విజయం నమోదైంది. అయితే ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో టీమిండియా విజయం వెనుక ఒక గుండె నిండా బాధను మోస్తూ దేశం కోసం ఆడిన ఆటగాడి కథ ఉంది. ఆయనే టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్, ఈ స్థాయి ప్రదర్శన చేస్తున్నప్పుడు తన తండ్రి గ్యాలరీలో ఉండి చూడాలని అనుకున్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆయన స్టేడియానికి రాలేకపోయారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌కు కేవలం ఒక రోజు ముందు ఇషాన్ కిషన్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఇషాన్ కిషన్ సోదరి (కజిన్), ఆమె భర్త ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇషాన్ తండ్రి ప్రణవ్ పాండే తన కొడుకు కోరిక మేరకు శనివారం అహ్మదాబాద్ బయలుదేరాల్సి ఉంది. ఆయన ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలోనే ఈ దారుణమైన వార్త తెలిసింది. దీంతో ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెంటనే ప్రమాదం జరిగిన సిలిగుడికి బయలుదేరి వెళ్లారు.
ఒక పక్క పెళ్లి వేడుకకు వెళ్తున్న సోదరి దంపతులు ప్రమాదానికి గురయ్యారని, ఆ దంపతుల ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిసి ఇషాన్ కిషన్ కుప్పకూలిపోయాడు. తన సోదరి ఆఖరి చూపు చూసుకోవాలని అనుకున్నా, దేశం తరపున ఫైనల్ ఆడాల్సిన బాధ్యత అతడిని ఆపింది. ఒకవైపు కళ్లలో నీళ్లు తిరుగుతున్నా, గుండె నిండా బాధ ఉన్నా.. ఆ పట్టుదలను మైదానంలో చూపించాడు. తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి, దేశం కోసం అత్యంత కీలకమైన మ్యాచ్‌లో బరిలోకి దిగి తన పోరాట పటిమను చాటాడు.
ప్రమాదం వార్త తెలిసినా కూడా స్థిమితంగా ఆడిన ఇషాన్ కిషన్, కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి తన ప్రతాపం చూపించాడు. భారత జట్టు 255 పరుగుల భారీ స్కోరు సాధించడంలో అతని ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టి మూడు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. తన తండ్రి ఎదురుగా ఈ ఘనత సాధించాలని అనుకున్నా సాధ్యం కాలేదు. కానీ, తన ఆటకు ప్రాణం పోసి భారత్ కప్పు గెలిచేలా చేసి, ఈ విజయాన్ని తన మరణించిన సోదరికే అంకితం ఇచ్చాడు. దేశం మొత్తం విజయోత్సవాల్లో మునిగిపోతే, ఇషాన్ మాత్రం కన్నీళ్లను ఆపుకుంటూ చిరునవ్వుతో కనిపించాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




