Karun Nair: ఆ ప్రముఖ క్రికెటర్ చెప్పిన మాట వినుంటే... కరుణ్ నాయర్ కెరీర్ ముగిసేదేమో!

Karun Nair Comeback Test Team 2025
x

Karun Nair: ఆ ప్రముఖ క్రికెటర్ చెప్పిన మాట వినుంటే... కరుణ్ నాయర్ కెరీర్ ముగిసేదేమో!

Highlights

Karun Nair: సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Karun Nair: సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం ఓ ప్రముఖ భారత క్రికెటర్ అతనికి ఫోన్ చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి, ఆర్థిక భద్రత కోసం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడాలని సలహా ఇచ్చాడట. అయితే, ఆ సలహాను పట్టించుకోకుండా, కఠిన శ్రమతో తన లక్ష్యాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్న కరుణ్… నేడు టీమిండియా జట్టులోకి తిరిగి వచ్చాడు.

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారత్ టెస్టు జట్టులోకి కరుణ్ నాయర్ రీ ఎంట్రీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు. ‘‘రెండేళ్ల క్రితం ఓ క్రికెటర్ నాకు ఫోన్ చేసి, రిటైర్మెంట్ తీసుకొని లీగ్‌లలో ఆడమన్నాడు. అది నాకెంతో సులువు. కానీ నా లక్ష్యం మాత్రం టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవడం. అప్పటినుంచి గట్టి పట్టుదలతో కృషి చేశాను. ఇప్పుడదే ఫలితం’’ అని చెప్పుకొచ్చాడు కరుణ్.

ఇక జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 18 మంది భారత జట్టులో కరుణ్ నాయర్‌కు అవకాశం లభించింది. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఏ తరఫున ఆడిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన కరుణ్… తన ఫామ్‌ను మరోసారి నిరూపించాడు.

అంతేకాకుండా, 2023–24 కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్లలో నార్తాంప్టన్‌షైర్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 736 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీను కూడా నమోదు చేశాడు. ఇక 2024-25 రంజీ ట్రోఫీలో విదర్భ తరఫున 16 ఇన్నింగ్స్‌ల్లో 863 పరుగులతో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 779 పరుగులు చేయగా, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 255 పరుగులతో నిలకడ చూపించాడు.

కాగా, కఠిన శ్రమ, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎలా విజయాన్ని సాధించొచ్చో కరుణ్ నాయర్ మరోసారి నిరూపించాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో అతని ప్రదర్శనపై భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories