SA20 league 2026 : 8 పరుగులకే 6 వికెట్లా? గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఛాంపియన్ ఆట

SA20 league 2026 : 8 పరుగులకే 6 వికెట్లా? గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఛాంపియన్ ఆట
x
Highlights

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న SA20 లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

SA20 league 2026 : సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న SA20 లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు, ఈసారి మాత్రం కనీసం పోరాట పటిమను కూడా ప్రదర్శించలేకపోతోంది. తాజాగా పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ నేతృత్వంలోని ముంబై జట్టు పేకమేడలా కూలిపోయింది. కేవలం 19 బంతుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసింది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సొంత మైదానంలో ఆడుతున్నా కనీస ప్రభావం చూపలేకపోయింది. పార్ల్ రాయల్స్ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే కనిపిస్తోంది.

ముంబై ఇన్నింగ్స్ ఒక దశలో 15.2 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 80 పరుగులతో బాగానే ఉంది. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. నాలుగో వికెట్ పడిన తర్వాత కేవలం 19 బంతుల వ్యవధిలో ముంబై మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో ముంబై బ్యాటర్లు కేవలం 8 పరుగులు మాత్రమే జోడించగలిగారు. ఫలితంగా 19వ ఓవర్‌లో ముంబై జట్టు కేవలం 88 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే స్టార్ స్పిన్నర్ సికిందర్ రజా తన స్పిన్ మాయాజాలంతో ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. అతను 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

తక్కువ లక్ష్యంతోనే బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ ప్రిటోరియస్ అవుట్ అయ్యాడు. అయితే, లక్ష్యం చిన్నది కావడంతో పార్ల్ జట్టు తడబడకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. కేవలం 13 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో పార్ల్ రాయల్స్ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories