Riyan Parag : 14 కోట్లు పెట్టి కొంటే ఇదేనా ఆట? కీలక క్యాచ్‌లు వదిలేస్తున్న రాజస్థాన్ కెప్టెన్

Riyan Parag : 14 కోట్లు పెట్టి కొంటే ఇదేనా ఆట? కీలక క్యాచ్‌లు వదిలేస్తున్న రాజస్థాన్ కెప్టెన్
x
Highlights

Riyan Parag : ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పరిస్థితి ఏమీ బాగాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు ముందు ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో...

Riyan Parag : ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పరిస్థితి ఏమీ బాగాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు ముందు ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో RR జట్టు 8వ స్థానంలో ఉంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరంగా ఉంటున్నాడు. దీంతో రియాన్ పరాగ్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కానీ ఈ ఆటగాడు తన ప్రదర్శనతో జట్టు సహచరుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. ఈ సీజన్‌లో రియాన్ పరాగ్ అనేక కీలకమైన సమయాల్లో క్యాచ్‌లను వదిలేశాడు. అది జట్టుకు చాలా నష్టం కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో రియాన్ పరాగ్‌ను ఏకంగా 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ అతను ఇప్పటివరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు.

RCBతో జరిగిన ఐపీఎల్ 2025లోని 42వ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ అలాంటి తప్పిదం చేశాడు. దానిని అతను మర్చిపోవాలనుకుంటాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫారూఖీ రెండో ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని ఫారూఖీ ఫుల్ టాస్‌గా విసిరాడు. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ షాట్ ఆడగా బంతి మిడ్ ఆఫ్ వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు కానీ బంతి అతని చేతిలోంచి జారిపోయింది. సాల్ట్ ఆ సమయంలో 1 పరుగు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత సాల్ట్ 23 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. అలాగే విరాట్ కోహ్లీతో కలిసి 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 క్యాచ్‌లు పట్టాడు. కానీ అదే సమయంలో 4 క్యాచ్‌లు వదిలేశాడు. అతని ఎఫిషియెన్సీ 55 శాతం మాత్రమే ఉంది. కెప్టెన్ ఇలా క్యాచ్‌లు వదలడం జట్టుకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ సీజన్‌లో అతని ప్రదర్శన గురించి మాట్లాడితే, RCBతో జరిగిన మ్యాచ్‌కు ముందు 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో అతను 30.28 సగటుతో 212 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కాగా ఈ సీజన్‌లో RCBతో జరిగిన మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్‌లు ఆడగా అందులో 6 ఓడిపోయింది. కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories