SRH vs HCA: ఫ్రి టికెట్స్ కోసం వేధిస్తున్నారంటున్న ఫ్రాంచైజీ... మరి అధ్యక్షుడు ఏమంటున్నారు?

SRH vs HCA fight over complimentary tickets allotment issue, SRH writes a serious mail to Hyderabad cricket association
x

SRH vs HCA: ఫ్రి టికెట్స్ కోసం వేధిస్తున్నారంటున్న ఫ్రాంచైజీ... మరి అధ్యక్షుడు ఏ. జగన్మోహన్ రావు ఏమంటున్నారు?

Highlights

SRH vs HCA issue over complimentary tickets: ఐపిఎల్ 2025 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లతో తలపడుతున్నారు. మరోవైపు జట్టు...

SRH vs HCA issue over complimentary tickets: ఐపిఎల్ 2025 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లతో తలపడుతున్నారు. మరోవైపు జట్టు యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో తలపడుతోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజర్ టి.బి. శ్రీనాథ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి సీ.జే. శ్రీనివాస్ రావుకు రాసిన లేఖతో ఈ జగడం బయటికొచ్చింది.

అయితే, హైదరాబాబ్ క్రికెట్ అసోసియేషన్‌తో జరుగుతున్న ఈ జగడం ఇప్పటిది కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపిస్తోంది. గతేడాది నుండి ఫ్రీ టికెట్స్ కోసం అనేక విషయాల్లో హెచ్‌సీఏ తమను ఇలాగే ఇబ్బంది పెడుతోంది అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తంచేసింది. అగ్రిమెంట్ ప్రకారం నడుచుకుంటామంటే పర్వాలేదు... లేదంటే హైదరాబాద్ స్టేడియంకు గుడ్ బై చెప్పి మరో నగరానికి వెళ్లిపోతామని శ్రీనాథ్ ఆ లేఖలో స్పష్టంచేశారు.

ఇంతకీ ఈ గొడవకు దారితీసిన పరిస్థితులేంటి?

శ్రీనాథ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరరీకి రాసిన లేఖ ప్రకారం అధ్యక్షుడు జగన్మోహన్ రావు తమని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆరోపించింది. ఆ లేఖలో ఏం ఉందంటే..

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ జరిగిన రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు F12A బాక్సుకు తాళం వేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అడగ్గా అడగ్గా మరో గంటలో మ్యాచ్ ప్రారంభం కానుందనగా ఆ బాక్సు తాళం తెరిచారు. ఇదే విషయమై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. స్టేడియం విషయంలో అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్న ఫ్రాంచైజీతో వ్యవహరించే తీరు ఇది కాదని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అభ్యంతరం వ్యక్తంచేసింది.

గత కొన్నేళ్లుగా అగ్రిమెంట్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 3900 కాంప్లిమెంటరీ టికెట్స్ ఉచితంగా కేటాయిస్తోంది. అందులో భాగంగానే ఈ F12A బాక్సులోనూ 50 టికెట్స్ కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ బాక్సులో 30 టికెట్స్ మాత్రమే అడుగుతూ మరో 20 టికెట్స్ మరో బాక్సులో కేటాయించాల్సిందిగా కోరింది. అయితే, ఈ విషయాన్ని చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుందామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ చెప్పింది.

అయితే, చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పిన తరువాత కూడా మీరు(HCA) F12A బాక్సుకు తాళం ఎలా వేస్తారని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రశ్నించింది.

" ఉప్పల్ స్టేడియం ఫీజు చెల్లిస్తున్నాం. ఐపిఎల్ జరిగినన్ని రోజులు స్టేడియం నిర్వహణ బాధ్యతలు మేమే చూసుకుంటున్నాం. అగ్రిమెంట్ ప్రకారం 3900 కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్నాం. అయినప్పటికీ ఏదో ఒక కొర్రీలు పెట్టి మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు" అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను నిలదీసింది.

ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ స్టేడియంలో ఆడటం ఇష్టలేకపోతే అదే విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వండి. ఆ విషయాన్ని మేం బీసీసీఐకి, తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసి ఇక్కడి నుండి వెళ్లిపోతాం" అని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం స్పష్టంచేసింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ లేఖపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్పందించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈమెయిల్ పంపించింది వాస్తవమేనని అంగీకరించారు. 20 కాంప్లిమెంటరీ టికెట్స్ విషయంలో వివాదం తలెత్తిందని, ఆ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆయన చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం వెల్లడించింది.

అయితే, ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు సెక్రటరీ ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, అధ్యక్షుడి స్పందన ఎలా ఉంటుందనే విషయంలోనే క్లారిటీ లేదు అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు అభిప్రాయపడినట్లుగా ఆ కథనం స్పష్టంచేసింది.

అప్పటికైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా?

ఏప్రిల్ 6న ఆదివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఆలోగానైనా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేదే ప్రస్తుతం అందరూ వేచిచూస్తున్న అంశం.

ఇకనైనా HCA తీరు మారేనా?

ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఆట తప్పించి అనేక వివాదాల్లో ముందుంటుంది అనే అపవాదు ఉంది. అసోసియేషన్ రాజకీయలు, పదవులు, నిధుల దుర్వినియోగం వంటి నెగటివ్ న్యూస్‌తో అసోసియేషన్ అనేకసార్లు వార్తల్లోకెక్కింది.

ఈ విషయంలో తాము అగ్రిమెంట్ ప్రకారం నడుచుకుంటామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది. మరి ఇకనైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ సమస్యను పరిష్కరించుకుని ముందుకెళ్తుందా లేక ఆ 20 సీట్ల కేటాయింపులో పంతానికి పోయి మరిన్ని ఆరోపణలు మూటగట్టుకుంటుందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories