
అప్పుడు విరాట్, ఇప్పుడు అభిషేక్.. భారత్ మళ్ళీ ఛాంపియన్ అవుతుందా?
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్) కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరి డకౌట్ల హ్యాట్రిక్ నమోదు చేయడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే, క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ పరిస్థితి సరిగ్గా 2024 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ పడ్డ కష్టాలను తలపిస్తోందని, ఆ సెంటిమెంట్ పండితే ఈసారి కూడా భారతే ఛాంపియన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ కూడా టోర్నీ ఆరంభంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఐర్లాండ్‌పై 1 రన్, పాకిస్థాన్‌పై 4 పరుగులు, అమెరికాపై గోల్డెన్ డకౌట్ అయ్యారు. కానీ, సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో తన విశ్వరూపం చూపించి భారత్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఫైనల్‌లో కోహ్లీ చేసిన 76 పరుగులు టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అదే తరహాలో మొదటి మూడు మ్యాచ్‌ల్లో సున్నాలు చుట్టేయడం చూస్తుంటే, అతను కూడా తన అసలు సిసలు విశ్వరూపాన్ని సెమీస్ లేదా ఫైనల్ కోసం దాచిపెట్టాడేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ప్రస్తుత టోర్నీలో అభిషేక్ శర్మ గణాంకాలు చూస్తే.. మూడు మ్యాచ్‌ల్లో కేవలం 8 బంతులు ఎదుర్కొని ఒక్క రన్ కూడా చేయలేకపోయాడు. అమెరికాపై ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అవ్వగా, పాక్‌పై 4 బంతులు, నెదర్లాండ్స్‌పై 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ప్రపంచ వేదికపై ఒత్తిడికి చిత్తవుతున్నాడు. అయినప్పటికీ టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచడం విశేషం.
చరిత్ర పునరావృతమవుతుందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 2024లో కోహ్లీ ఎలాగైతే విమర్శల నుంచి బయటపడి జట్టుకు ట్రోఫీని అందించాడో, అభిషేక్ శర్మ కూడా సూపర్-8 రౌండ్ నుంచి తన బ్యాట్‌కు పనిచెప్పి భారత్‌ను మళ్ళీ విశ్వవిజేతగా నిలుపుతాడేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే, అభిషేక్ శర్మ వైఫల్యాలు కూడా టీమిండియాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే శుభసూచకంగానే మిగిలిపోతాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




