T20 World Cup 2026: గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు.. 20 టీమ్స్ అంచనాలు ఇవే!

T20 World Cup 2026: గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు.. 20 టీమ్స్ అంచనాలు ఇవే!
x

T20 World Cup 2026: గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు.. 20 టీమ్స్ అంచనాలు ఇవే!

Highlights

భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఆరంభం కానుంది. ఈసారి టోర్నీలో 20 టీమ్స్ పాల్గొననున్నాయి.

భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఆరంభం కానుంది. ఈసారి టోర్నీలో 20 టీమ్స్ పాల్గొననున్నాయి. మరో ఆరు రోజుల్లో ఆరంభం కానున్న వరల్డ్‌కప్‌పై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. టోర్నీ షెడ్యూల్, గ్రూప్‌ల కూర్పు, బలమైన జట్లు ఎవరు అనే అంశాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు టోర్నీ ఎలా సాగుతుందనే అంచనాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

గ్రూప్ దశను పరిశీలిస్తే నాలుగు గ్రూప్‌లు అత్యంత పోటీగా ఉండనున్నాయి. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్ ఉండగా.. దాయాదుల మధ్య మ్యాచ్ టోర్నీకే హైలైట్‌గా నిలవనుంది. ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ టాప్ టూ జట్లుగా ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. అనుభవం ఉన్న ఆసీస్‌తో పాటు యువశక్తి కలిసిన శ్రీలంక కూడా ఈ గ్రూప్‌లో ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. గ్రూప్ Cలో ఇంగ్లండ్, వెస్టిండీస్ ఉండగా.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరైన ఈ రెండు జట్ల మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించనుంది. గ్రూప్ Dలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఇటీవలి కాలంలో అఫ్గానిస్థాన్ చూపిస్తున్న ప్రదర్శన ఈ గ్రూప్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.

గ్రూప్ దశ ముగిసిన తర్వాత సూపర్‌ 8 దశలోని ఒక్కో గ్రూప్‌లో నాలుగు ప్రధాన జట్లు వస్తాయని అంచనా. ఒక గ్రూప్‌లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా.. మరో గ్రూప్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ ఉండే అవకాశం ఉంది. ఈ దశలో ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. సూపర్‌ 8 తర్వాత సెమీఫైనల్ రేసులో గ్రూప్ 1 నుంచి భారత్, ఆస్ట్రేలియా.. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు శ్రీలంక లేదా పాకిస్తాన్ ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సెమీఫైనల్ సమీకరణాలు కూడా అభిమానులకు ఆసక్తికరంగా మారనున్నాయి.

సెమీఫైనల్స్‌-1లో భారత్ vs ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుందని అంచనా. గతంలోనూ ఈ రెండు జట్ల మధ్య కీలక మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించాయి. సెమీఫైనల్స్‌-2లో శ్రీలంక vs ఆస్ట్రేలియా లేదా పాకిస్తాన్/ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఉండనుంది. ఈ అంచనాలన్నీ నిజమైతే.. ఫైనల్‌లో క్రికెట్ అభిమానులు కోరుకునే క్లాసిక్ పోరు చూడొచ్చు. భారత్ vs ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుందని అంచనా. 2023 నవంబర్‌ 19న భారత్ ఓటమి ఎదుర్కొన్నా.. మార్చి 8న జరిగే ఈ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. మొత్తంగా చూస్తే టీ20 వరల్డ్‌కప్‌ 2026 ప్రతి దశలోనూ హై వోల్టేజ్ మ్యాచ్‌లతో, అంచనాలకు మించిన మలుపులతో సాగడం ఖాయం. టీమిండియా అభిమానులు మాత్రం ఈసారి కప్ భారత్‌కే వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories