T20 World Cup 2026 : సూర్య కెప్టెన్సీకి ఎసరు? వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అగార్కర్ వేయబోయే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి?

T20 World Cup 2026
x

T20 World Cup 2026 : సూర్య కెప్టెన్సీకి ఎసరు? వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అగార్కర్ వేయబోయే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి?

Highlights

T20 World Cup 2026 :భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది.

T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శనివారం (డిసెంబర్ 20) ముంబైలో సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా స్క్వాడ్‌ను ప్రకటించనున్నారు. అయితే అందరి దృష్టి ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైనే ఉంది. గత కొంతకాలంగా సూర్య దారుణమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.

సౌతాఫ్రికాతో తాజాగా ముగిసిన సిరీస్‌లో భారత్ 3-1తో విజయం సాధించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్య బ్యాటింగ్ మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కూడా సూర్య కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ఏడాది ఆడిన 21 ఇన్నింగ్స్‌ల్లో సూర్య సగటు కేవలం 13.62 మాత్రమే ఉండటం గమనార్హం. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన సూర్యను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేక వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీ కోసం ఏవైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒకవేళ ఫామ్ ప్రాతిపదికన సూర్యపై వేటు వేయాలనుకుంటే, హార్దిక్ పాండ్యా పేరు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా సిరీస్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి పాత ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. అయితే కోచ్ గౌతమ్ గంభీర్, అగార్కర్ ఆలోచనా విధానం ప్రకారం.. వరల్డ్ కప్‌కు కొద్ది రోజుల ముందు కెప్టెన్‌ను మార్చే అవకాశం తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సూర్య వయస్సు (35 ఏళ్లు), ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కెప్టెన్‌ను నియమించే ఛాన్స్ ఉంది.

మరోవైపు జట్టు ఎంపికలో ఓపెనింగ్ స్థానం కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. శుభ్‌మన్ గిల్ ఫామ్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నా, అతనికి వైస్ కెప్టెన్ హోదా ఉండటంతో జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. దీనివల్ల ఫుల్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లకు మొండిచేయి ఎదురయ్యే ప్రమాదం ఉంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శామ్సన్ తమ స్థానాలను దాదాపు ఖాయం చేసుకోగా.. రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి రావొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories