T20 World Cup Final : ఆదివారం నాటి ఫైనల్ కు పిచ్ రిపోర్ట్ ఇదే.. బ్యాటర్లకు పండగే, బౌలర్లకు సవాలే

T20 World Cup Final
x

T20 World Cup Final 

Highlights

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. గత వైఫల్యాల నుండి నేర్చుకుని, ఈసారి అహ్మదాబాద్‌లో ఎర్ర మట్టి ప్రాధాన్యత కలిగిన మిశ్రమ పిచ్‌ను సిద్ధం చేశారు.

T20 World Cup Final : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత, ఈ ప్రతిష్టాత్మక మైదానం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆదివారం (మార్చి 8) జరగనున్న ఈ తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే గతంలో ఇదే స్టేడియంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి టీమిండియా తన వ్యూహాన్ని మార్చింది. ముఖ్యంగా పిచ్ తయారీలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 19, 2023.. ఈ తేదీని భారత క్రికెట్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్, ఇదే అహ్మదాబాద్ మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ రోజు మనకు నచ్చినట్లుగా తయారు చేయించుకున్న నల్ల రేగడి మట్టి పిచ్ మనకే శాపంగా మారింది. బంతి నెమ్మదించి మన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అంతెందుకు, ఇదే టీ20 వరల్డ్ కప్‌లో కూడా సూపర్ 8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అదే నల్ల మట్టి పిచ్‌పై భారత్ ఓటమి పాలైంది. గత 32 ఐసీసీ మ్యాచుల్లో భారత్ ఓడిపోయిన ఆ రెండు మ్యాచులు కూడా అహ్మదాబాద్ పిచ్ మహిమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా మేనేజ్మెంట్, ఈసారి పిచ్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ కోసం మిక్స్‌డ్ సాయిల్ పిచ్‌ను సిద్ధం చేశారు. అంటే ఇందులో ఎర్ర మట్టి, నల్ల మట్టి రెండింటినీ కలిపి వాడారు. ఇందులో సుమారు 70 శాతం ఎర్ర మట్టి ఉండగా, మిగిలిన 30 శాతం మాత్రమే నల్ల మట్టిని ఉపయోగించారు. దీనివల్ల పిచ్ నెమ్మదించకుండా, బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది. మన బ్యాటర్లు స్ట్రోక్ ప్లే ఆడటానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

సాధారణంగా నల్ల మట్టి పిచ్‌లు మ్యాచ్ గడుస్తున్న కొద్దీ నెమ్మదిస్తాయి, కానీ ఎర్ర మట్టి పిచ్‌లు పేసర్లకు సహకరిస్తూనే బ్యాటర్లకు మంచి స్కోర్లు చేసే అవకాశం ఇస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగనుంది. బంతి బ్యాటుపైకి వేగంగా వస్తుంది కాబట్టి సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు భారీ షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఈ మిక్స్‌డ్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కోట్లాది మంది భారతీయుల ఆశల వారధి అయిన ఈ ఫైనల్ పోరులో మనవాళ్లు ట్రోఫీ ముద్దాడుతారా లేదా అనేది రేపు తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories