Jasprit Bumrah: బుమ్రా అనే 'వజ్రాన్ని' తీర్చిదిద్దిన శిల్పి ఆయనే..!

Jasprit Bumrah: బుమ్రా అనే వజ్రాన్ని తీర్చిదిద్దిన శిల్పి ఆయనే..!
x

Jasprit Bumrah: బుమ్రా అనే 'వజ్రాన్ని' తీర్చిదిద్దిన శిల్పి ఆయనే..!

Highlights

Jasprit Bumrah: వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ రోమాంచిత విజయం సాధించింది.

Jasprit Bumrah: వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ రోమాంచిత విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంలో బ్యాటర్ల కృషి ఉన్నప్పటికీ, ఆఖరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా వేసిన స్పెల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరొందిన బుమ్రాను ఒక క్రమశిక్షణ గల ఆటగాడిగా మార్చిన అతని గురువు కిషోర్ త్రివేది గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సెమీస్‌లో బుమ్రా మ్యాజిక్

253 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. జాకబ్ బెథెల్ (105) మెరుపు సెంచరీతో ఒక దశలో విజయం దిశగా సాగింది. అయితే, డెత్ ఓవర్లలో బుమ్రా తన పదునైన యార్కర్లతో కట్టడి చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. "బుమ్రా వంటి ఆటగాళ్లు తరానికి ఒక్కరే పుడతారు" అని కొనియాడారు.

విచిత్రమైన యాక్షన్‌నే బలహీనత నుంచి బలంగా..

అహ్మదాబాద్‌లోని 'రాయల్ క్రికెట్ అకాడమీ' నిర్వాహకుడు, 79 ఏళ్ల కిషోర్ త్రివేది వద్ద 16 ఏళ్ల వయసులో బుమ్రా శిక్షణకు వెళ్లాడు. బుమ్రా విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌ను చూసి చాలామంది ఎగతాళి చేసినా, త్రివేది మాత్రం అతనిలోని ప్రత్యేకతను గుర్తించారు. బుమ్రా చేతికున్న ‘హైపర్ ఎక్స్‌టెన్షన్’ వల్ల బంతి విభిన్న కోణంలో వస్తుందని, అది బ్యాటర్లకు ప్రమాదకరమని గ్రహించి, యాక్షన్‌ను మార్చవద్దని భరోసా ఇచ్చారు.

శిక్షణలో కఠిన నిబంధనలు

ఆరంభంలో బుమ్రా ప్రాక్టీస్ పట్ల అంత సీరియస్‌గా లేకపోవడంతో, త్రివేది కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బుమ్రా తల్లి అనుమతితో అతడిని క్రమశిక్షణలో పెట్టారు. ప్రాక్టీస్‌కు గైర్హాజరైతే రోజంతా నెట్స్ వెనకాల నిలబడేలా శిక్ష వేసేవారు. కేవలం వేగం మాత్రమే కాకుండా యార్కర్లు, కట్టర్లు, స్లో బాల్స్‌తో బ్యాటర్ మనసును చదవడం నేర్పించారు. సెమీస్‌లో హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసిన తీరు, బెథెల్‌ను అడ్డుకున్న విధానం త్రివేది నేర్పిన పాఠాలే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

గురువు చిన్న కోరిక..

ముంబై ఇండియన్స్ స్కౌట్ జాన్ రైట్ కంట పడటంతో బుమ్రా దశ తిరిగినప్పటికీ, పునాది మాత్రం అహ్మదాబాద్‌లోని ఆ చిన్న మైదానంలోనే పడింది. నేడు తన శిష్యుడి విజయాన్ని చూసి త్రివేది గర్వపడుతున్నారు. "బుమ్రా అప్పుడప్పుడూ అకాడమీకి వచ్చి వెళ్తుంటే చూడాలని ఉంది" అని ఆయన తన మనసులోని చిన్న కోరికను వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories