Cyber Frauds: ఆన్‌లైన్ మోసాల ఆట ఖతం.. ప్రభుత్వం తెచ్చిన 'FRI' సిస్టమ్ ఏం చేస్తుంది?

Cyber Frauds
x

Cyber Frauds: ఆన్‌లైన్ మోసాల ఆట ఖతం.. ప్రభుత్వం తెచ్చిన 'FRI' సిస్టమ్ ఏం చేస్తుంది?

Highlights

Cyber Frauds: ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతోంది. ఇలాంటి మోసగాళ్లకు కళ్ళెం వేయడానికి మన ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది.

Cyber Frauds: ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతోంది. ఇలాంటి మోసగాళ్లకు కళ్ళెం వేయడానికి మన ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. అదే 'ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్' సిస్టమ్.. ఇది ఏంటంటే, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ పేమెంట్ బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టడానికి దీన్ని ఒక ఆయుధంలా వాడబోతున్నాయి. అసలు ఈ 'FRI' ఎలా పనిచేస్తుంది? మీ డబ్బును ఇది ఎలా కాపాడుతుంది? వివరంగా తెలుసుకుందాం.

ఈ 'FRI' సిస్టమ్ ద్వారా ప్రభుత్వ ఏజెన్సీలు సైబర్ నేరాల్లో వాడే మొబైల్ నంబర్లపై నిఘా పెడతాయి. అంటే, ఏ నంబర్ల నుంచి మోసాలు జరుగుతున్నాయో వాటిని కనిపెడతాయి. ఇలాంటి నంబర్లను లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ అనే కేటగిరీలుగా విడదీస్తారు. ఒక మొబైల్ నంబర్‌తో మోసం జరిగే ప్రమాదం ఎంత ఉందో ఈ కేటగిరీలు చెబుతాయి. ఈ సమాచారాన్ని చాలా చోట్ల నుంచి సేకరిస్తారు. ఉదాహరణకు, 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్', టెలికాం డిపార్ట్‌మెంట్ వారి 'చక్షు ప్లాట్‌ఫామ్', అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే నిఘా రిపోర్టుల నుంచి ఈ డేటా అంతా వస్తుంది.

ఈ సిస్టమ్ వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, యూపీఐ సేవలు అందించే సంస్థలకు చాలా పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఏ మొబైల్ నంబర్‌పై ఎక్కువ జాగ్రత్తగా ఉండాలో వారికి తెలిసిపోతుంది. ఒక నంబర్‌కు 'రిస్క్ ఎక్కువ' అని వస్తే, వాళ్లు ఆ యూజర్ భద్రత కోసం మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి కాకుండా, 'డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ' అనే సంస్థ ఒక 'మొబైల్ నంబర్ రద్దు జాబితాను కూడా తయారు చేస్తుంది. ఈ జాబితాలో సైబర్ నేరాలు, మోసాలు, తప్పుగా వాడటం, లేదా ఆధార్ వివరాలు సరిపోక రద్దు చేసిన మొబైల్ నంబర్లు ఉంటాయి. ఈ నంబర్లలో చాలా వరకు మోసాలకు ఉపయోగించినవే ఉంటాయి.

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. మోసగాళ్లు రకరకాల కొత్త దారులు వెతుకుతూ ప్రజల డబ్బును దోచేసుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాల ప్రకారం, గత 10 ఏళ్లలో ఆన్‌లైన్ పేమెంట్లు పెరిగినట్లే, సైబర్ నేరాలు చేసేవాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. 2014-15 సంవత్సరంలో డిజిటల్ మోసాల వల్ల రూ.18.46 కోట్ల నష్టం జరిగిందట. చాలా సార్లు, మోసగాళ్లు ఒక లింక్ పంపి ప్రజలను మోసం చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే, వాళ్ళు మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు. తమ కష్టార్జితాన్ని క్షణాల్లో పోగొట్టుకుంటారు.

ఈ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది. ప్రజలను అప్రమత్తం చేయడానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త 'FRI' సిస్టమ్‌తో, సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఈ సిస్టమ్ వల్ల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మోసాలను ముందుగానే పసిగట్టి, తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories