
Samsung Galaxy A07 5G: ఎంట్రీ లెవల్ 5G ఫోన్.. గేమ్ ఛేంజింగ్ ఫీచర్లు ఉన్నాయి..!
Samsung Galaxy A07 5G: శాంసంగ్ తన కొత్త ఎంట్రీ-లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ Galaxy A07 5Gను త్వరలో మార్కెట్లోకి తీసుకురావచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Samsung Galaxy A07 5G: శాంసంగ్ తన కొత్త ఎంట్రీ-లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ Galaxy A07 5Gను త్వరలో మార్కెట్లోకి తీసుకురావచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ తాజాగా బ్రెజిల్ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీ (Anatel) సర్టిఫికేషన్ పొందడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి సర్టిఫికేషన్లు లాంచ్‌కు ముందే వస్తుండటంతో, గెలాక్సీ A07 5G అరంగేట్రం ఆసన్నమైందనే అంచనాలు టెక్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
బ్రెజిలియన్ టెక్ వెబ్సైట్ Tecnoblog వెల్లడించిన వివరాల ప్రకారం.. SM-A076M/DS మోడల్ నంబర్‌తో లిస్ట్ అయిన గెలాక్సీ A07 5Gలో 6,000mAh సామర్థ్యమైన భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఇప్పటివరకు గెలాక్సీ A07 4G, గెలాక్సీ A06 5G మోడల్స్‌లో ఉన్న 5,000mAh బ్యాటరీతో పోలిస్తే గణనీయమైన అప్‌గ్రేడ్. ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్లో ఈ స్థాయి బ్యాటరీ సామర్థ్యం రోజంతా ఉపయోగించే యూజర్లకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఇక ఛార్జింగ్ విషయంలో ఈ ఫోన్ 15W సామర్థ్యంతో ఉన్న EP-TA200 ఛార్జర్‌తో వస్తుందని, అలాగే USB టైప్-A పోర్ట్‌కు మద్దతు ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
Galaxy A07 5Gకు సంబంధించిన తాజా వివరాల ప్రకారం.. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇది కనీసం 4GB RAMతో జతకానుంది. సాఫ్ట్వేర్ పరంగా చూస్తే.. గెలాక్సీ A07 5G బాక్స్ నుంచి బయటకు వచ్చిన వెంటనే Android 16పై పనిచేయడం విశేషం. ఈ ధర శ్రేణిలో ఆండ్రాయిడ్ తాజా వెర్షన్‌తో ఫోన్ రావడం అరుదైన విషయమే.
ఇక డిస్ప్లే విషయానికొస్తే.. శాంసంగ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈ ఏడాది అక్టోబరులో లాంచ్ అయిన గెలాక్సీ A07 4G మోడల్‌ను ఆధారంగా తీసుకుంటే.. Galaxy A07 5Gలో కూడా 6.7-అంగుళాల HD+ డిస్ప్లే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 4G వేరియంట్లో ఉన్న 90Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్ 5G మోడల్లో కూడా కొనసాగవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
లాంచ్‌కు సంబంధించిన సంకేతాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే Galaxy A07 5Gకు సంబంధించిన సపోర్ట్ పేజీలు అమెరికా, స్పెయిన్, న్యూజిలాండ్‌లోని Samsung అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ విధమైన సపోర్ట్ పేజీలు లైవ్ కావడం అంటే, ఫోన్ విడుదలకు ముందు చివరి దశలో ఉన్నట్లు అర్థం.
శాంసంగ్ గెలాక్సీ A07 5G ధర విషయానికొస్తే.. గెలాక్సీ A07 4G భారత మార్కెట్లో 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ.8,999 ధరకు లాంచ్ అయింది. గెలాక్సీ A07 5Gలో 5G కనెక్టివిటీతో పాటు పెద్ద బ్యాటరీ అప్‌గ్రేడ్ ఉన్నందున.. దీని ధర రూ.10,000 నుంచి రూ.12,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. భారీ 6,000mAh బ్యాటరీ, 5G సపోర్ట్, తాజా Android వెర్షన్‌తో శాంసంగ్ గెలాక్సీ A07 5G ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి పోటీని ఇవ్వగల డివైస్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం శాంసంగ్ నుంచి అధికారిక లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్ల ప్రకటన కోసం టెక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




