Liquor Sales : రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. అమ్మకాలు పెరిగినా సర్కార్ ఖజానాకు రాని 'కిక్కు'

Liquor Sales : తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. బీర్ల విక్రయాలు 70 శాతం పెరిగినా, ధరల తగ్గింపు, తక్కువ ధర బ్రాండ్ల వల్ల ప్రభుత్వ ఆదాయ వృద్ధి మాత్రం 1 శాతం లోపే నమోదైంది.

CR Reddy
Updated on: 3 April 2026 9:06 AM IST
Liquor Sales
X

Liquor Sales 

Liquor Sales : తెలంగాణలో మందుబాబులు గత ఏడాది రికార్డులు తిరగరాశారు. ముఖ్యంగా ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. 2024-25లో 136 లక్షల కేసులుగా ఉన్న బీర్ విక్రయాలు, ఈసారి ఏకంగా 232 లక్షల కేసులకు చేరాయి. అంటే గతేడాదితో పోలిస్తే దాదాపు 70.29 శాతం భారీ పెరుగుదల నమోదైంది. కేవలం బీర్లు మాత్రమే కాకుండా, ఐఎంఎల్ మద్యం విక్రయాలు కూడా 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు పెరిగాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో మద్యం వినియోగం మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది.

అమ్మకాలు భారీగా.. ఆదాయం స్వల్పంగా..

మద్యం విక్రయాల విలువ పరంగా చూస్తే, గతేడాది రూ.29,440 కోట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది రూ.31,237 కోట్లకు పెరిగాయి. అంటే అమ్మకాల విలువలో 6.11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయం మాత్రం కేవలం 0.68 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. రాష్ట్ర ఖజానాకు గతేడాది రూ.28,846 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.29,042 కోట్లకు మాత్రమే పరిమితమైంది. అమ్మకాలు ఇంత భారీగా పెరిగినా ఆదాయం ఎందుకు పెరగలేదనే అంశంపై అబ్కారీ శాఖ లోతుగా విశ్లేషిస్తోంది.

ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణాలు

ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అందులో మొదటిది బడ్జెట్ లిక్కర్ వైపు జనం మొగ్గు చూపడం. ముఖ్యంగా రూ.99 ధర కలిగిన 180ml బాటిళ్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు తక్కువ ధర బ్రాండ్లనే ఎంచుకోవడం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.442 కోట్ల నష్టం వాటిల్లింది. దీనికి తోడు, ప్రముఖ బ్రాండెడ్ మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించడంతో మరో రూ.972 కోట్ల మేర ఆదాయానికి గండి పడింది. సగటు బాటిల్ ధర రూ.180 నుంచి రూ.160 కి పడిపోవడం కూడా ప్రధాన కారణం.

లైసెన్స్ ఫీజుల ప్రభావం

గత ఆర్థిక సంవత్సరంలో మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,900 కోట్ల మేర నాన్-రీఫండబుల్ ఫీజులు వచ్చాయి. అయితే ఈ ఏడాది అటువంటి కొత్త టెండర్లు లేకపోవడం వల్ల ఆ ఆదాయం రాకుండా పోయింది. దీనివల్ల లైసెన్స్ ఫీజుల విభాగంలో ఆదాయం 19.37 శాతం పడిపోయింది. విక్రయాల ద్వారా వచ్చే నేరుగా ఆదాయం పెరిగినా, ఇతర ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గడంతో మొత్తం రెవెన్యూ గ్రాఫ్ పడిపోయింది.

సామాజిక ఆందోళన

రాష్ట్రంలో ఏటా మద్యం వినియోగం పెరుగుతుండటం పట్ల సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం రాకపోయినా ఫర్వాలేదు కానీ, ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా కాకుండా, మితిమీరిన మద్యం వినియోగాన్ని అరికట్టేలా ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

CR Reddy

CR Reddy

Next Story